టెస్లా.. బీవైడీ.. తెలంగాణకు వస్తే రేవంత్ విజయమే?
భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)దే.. పెట్రోల్ డీజిల్ వంటి ఇంధనాల కారణంగా ఇప్పటికే నేచర్ కు పూడ్చలేని నష్టం వాటిల్లింది.
By: Tupaki Desk | 22 Jan 2024 12:30 PM GMTభవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)దే.. పెట్రోల్ డీజిల్ వంటి ఇంధనాల కారణంగా ఇప్పటికే నేచర్ కు పూడ్చలేని నష్టం వాటిల్లింది. వీటి వినియోగం నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడాలి. లేదంటే భవిష్యత్ తరాలకు మనం చేటు చేసినవారం అవుతాం. అంతేకాదు.. ప్రపంచానికీ కీడు తలపెట్టిన వారిగా మిగిలిపోతాం.. ఈ కోణంలో ఆలోచిస్తే పెట్రోల్ డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా వచ్చాయి ఈవీలు.
ఆ రెండూ దిగ్గజాలు..
ఎలక్ట్రిక్ వాహనాల్లో విప్లవం అంటే.. టెస్లా. అమెరికన్ కుబేరుడు ఎలాన్ మస్క తీసుకొచ్చిన టెస్లా ఫీచర్లు అద్భుతం. డ్రైవర్ లేకుండానే నడిపే వీలు.. అత్యంత తేలికైన మెటీరియల్ తో తయారీ, ఉపగ్రహం సంకేతాల ఆధారంగా పనిచేసే తీరు.. ఇలా ఎన్నో ఫీచర్లు దాని సొంతం. బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్) కూడా ఇలాంటిదే. చైనాకు చెందిన ఈ సంస్థ ఈవీల ఉత్పత్తిలో అగ్రగామి. అయితే, టెస్లా భారత్ కు వచ్చేందుకు రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావడం లేదు. ఉత్పత్తి ప్లాంట్ నెలకొల్పి పూర్తిగా భారత్ లో తయారీ చేపట్టాలని కేంద్రం నిబంధన విధిస్తుండగా, తొలుత బయట నుంచి ఉత్పత్తి చేసిన కార్లను భారత మార్కెట్ లోకి ప్రవేశపెడతామని ఆ తర్వాత సొంతంగా తయారీ ప్లాంట్ నెలకొల్పుతామని టెస్లా చెబుతోంది. దీనికి కేంద్రం అంగీకరించడం లేదు. దీంతో టెస్లా భారత్ లోకి రావడం ఆలస్యం జరుగుతోంది. ఇక బీవైడీ.. గత ఆగస్టులో ప్లాంట్ నెలకొల్పుతామని కేంద్రాన్ని కోరింది. దీనికి అనుమతి లభించలేదు. టెస్లా యూనిట్ ను హైదరాబాద్ లో నెలకొల్పాలంటూ దాని అధినేత ఎలాస్ మస్క్ ను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా కోరారు. కానీ, ఎటువంటి కదలిక రాలేదు.
రేవంత్ చెప్పినట్లు అయితే..?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వారం రోజుల విదేశీ పర్యటనలో భాగంగా గత వారం దుబాయ్ లో ప్రపంచ ఆర్థిక సదస్సు, యూకేలో ప్రవాస భారతీయులు, హై కమిషన్ లో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. ఇదే సమయంలో యూకే ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ కు టెస్లా, బీవైడీ రానున్నట్లు పేర్కొన్నారు. ఇదే నిజమైతే గనుక అతిపెద్ద ప్రాజెక్టులను సాధించి తన పాలనలో తొలి రోజుల్లోనే రేవంత్ మంచి మార్కులు కొట్టేసినట్లు అవుతుంది. అంతేగాక.. పారిశ్రామికంగా ఆయన ప్రభుత్వం సాధించిన పెద్ద విజయంగా నిలుస్తుంది. అయితే, టెస్లా, బీవైడీ చాలా పెద్ద సంస్థలు. వీటి ఉత్పత్తి సంస్థలను తమ తమ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసేందుకు ఇతర రాష్ట్రాల సీఎంలు గట్టిగా ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్ కు తరలించేందుకే చూస్తారు. వీటన్నిటీ దాటుకుని.. టెస్లా, బీవైడీ తెలంగాణకు వస్తే హైదరాబాద్ విశిష్ఠతను చాటినట్లు అవుతుంది.