పవన్ కల్యాణ్.. వర్సెస్ నారా లోకేష్.. ఏంటీ వేడి..!
రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎప్పుడూ ఒకే విధానాన్ని కూడా అవలంభించే పరిస్థితి కూడా ఉండదు.
By: Tupaki Desk | 21 Jan 2025 4:15 AM GMTరాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎప్పుడూ ఒకే విధానాన్ని కూడా అవలంభించే పరిస్థితి కూడా ఉండదు. ఇప్పుడు ఏపీలో కూటమి పార్టీల మధ్య కూడా ఇలాంటి 'లోతైన రాజకీయం' ఏదో నడుస్తోంద న్న చర్చ సాగుతోంది. పైకి అంతా బాగానే ఉన్నారు. అందరూ బాగానే ఉన్నారు. కానీ, ఎక్కడో తేడా కొడుతోం ది. ఆ తేడా అందరికీ తెలుసు. కానీ, ఎవరూ బహిరంగ వ్యాఖ్యలు చేయడం లేదు. కానీ, లోపాయి కారీగా.. మాత్రం సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువస్తున్నారు.
ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్.. దూకుడుగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ దూకుడులోనూ.. ఆయన వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. అవకాశం-అవసరం ఉన్న ప్రతి అంశాన్నీ ఆయన వినియోగించుకుంటున్నారు. ఇది ఆయన ఇమేజ్‌నుపెంచుతోందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని టీడీపీ నేతలు కూడా అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. అయితే.. ఇదేసమయంలో తమ యువ నాయకుడు.. నారా లోకేష్ ఇమేజ్‌పైనే వారు ఆందోళన చెందుతున్నారు.
చంద్రబాబు తర్వాత ఎవరు? అని చూసుకుంటే.. అందరి వేళ్లూ పవన్ వైపు ఉన్నాయి. ఇది సాధారణ ప్రజానీకంలో కనిపిస్తున్న, వినిపిస్తున్న మాట. తిరుమల లడ్డూ ప్రసాదం విషయాన్ని చంద్రబాబు లేవనెత్తినప్పుడు.. ఆ క్రెడిట్.. తన సనాతన ధర్మ పోరాటం ద్వారా పవన్ ఖాతాలో వేసుకున్నారు. తిరుపతి తొక్కిసలాట జరిగినప్పుడు.. పదే పదే క్షమాపణలు చెప్పాలంటూ.. ప్రజల దృష్టిని ఆకర్షించారు. పోలీసుల పనితీరును రెండు మూడు సందర్భాల్లో ఎండగట్టడం ద్వారా.. పవన్ ఇమేజ్ పెరిగిందనే వాదనా ఉంది.
ఇలా.. నారా లోకేష్‌కు ఇమేజ్ పెరగడం లేదన్నది తమ్ముళ్ల ఆవేదన. దీంతో చంద్రబాబు తర్వాత.. ఆ స్థాయి నాయకుడిగా.. నారా లోకేష్‌ను ప్రొజెక్టు చేయలేకపోతున్నామన్న ఆందోళన కూడా ఉంది. ఈ పరిణామమే.. డిప్యూటీ సీఎం పదవి దాకా వచ్చింది. మరోవైపు.. ఇక్కడే జనసేన కూడా బయట పడింది. తమ నాయకుడికి సీఎం పోస్టు ఇస్తే.. నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని కామెంట్లు చేసింది. ఇది మరింతగా కూటమి మధ్య అంతర్గత వాదన పెరిగేందుకు దారి తీసినట్టు అయింది.
అయితే.. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న చంద్రబాబు.. తాత్కాలికంగా బ్రేకులు వేసే ప్రయ త్నం చేసినా.. మంత్రి టీజీ భరత్ వంటి వారు.. మరింత ఆజ్యం పోసిన పరిస్థితి దావోస్‌లో స్పష్టంగా కనిపించింది. ఎవరు ఔనన్నా.. కాదన్నా.. నారా లోకేష్ సీఎం అవుతాడంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అంత తేలికగానో.. లేదా యాదృచ్ఛికంగానో తీసుకునే పరిస్థితి లేదు. ఈ వ్యాఖ్యలు చాలా నిర్మాణాత్మకంగానే ఉన్నాయి. అంటే.. ఎక్కడో ఏదో తేడా కొడుతోందన్న సంకేతాలను కూడా ఇచ్చాయి. వీటిని అంతర్గతంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయకపోతే.. వచ్చే నాలుగేళ్లలో ఈ వివాదాలు మరింత ముదిరే అవకాశం ఉంటాయన్నది పరిశీలకుల అంచనా.