‘సీఎం ఉత్తమ్’.. కోమటిరెడ్డి ముందే బ్రేక్ వేసేస్తున్నారా?
ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తాజాగా పాల్గొన్న ఓ సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్య ఉత్తమ్ అంటూ సంబోధించారు.
By: Tupaki Desk | 31 Aug 2024 6:59 AM GMTగతంలో కాంగ్రెస్ పార్టీలో ఓ పద్ధతి ఉండేది.. ఎవరైనా సహచరుడి అవకాశాలను దెబ్బతీయాలంటే వారిని బాగా పొగడడమే ఆయుధం. ఉదాహరణకు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సీఎల్పీ నాయకుడో, పీసీసీ అధ్యక్షుడినో కాబోయే సీఎంగా అభివర్ణిస్తూ ప్రచారం చేస్తే.. పరోక్షంగా వారిని వెనక్కులాగుతున్నట్లే. మహా సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో అనేక వర్గాలు. కాంగ్రెస్ నుంచి విడిపోయిన పార్టీలే దేశంలో పలు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలుగా ఎదిగాయంటేనే కాంగ్రెస్ స్థాయి ఏమిటో తెలుస్తుంది. కాగా, తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పటికీ పదేళ్లు అధికారానికి దూరంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. దీనికి అనేక కారణాలు. ప్రతి జిల్లాలో వర్గాలు.. ఒకరిని మించి ఒకరు నాయకులు. అయితే, గత ఏడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకతాటిపై నడిచి అధికారంలోకి వచ్చింది.
పోటీ లేకుండానే సీఎం
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ వంటి అత్యంత బలమైన నాయకుడు ఉన్న సమయంలోనూ ముఖ్యమంత్రి పీఠం కోసం పలువురు కాంగ్రెస్ నాయకులు పోటీపడ్డారు. వీరిలో డీఎస్, పి.జనార్దన రెడ్డి వంటి వారు ముఖ్యులు. కానీ, తెలంగాణలో మాత్రం నిరుడు డిసెంబరులో ఎలాంటి పోటీ లేకుండానే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించింది కాంగ్రెస్ అధిష్ఠానం. అయితే, సీనియర్ నాయకులు, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి ఏపీకి డిప్యూటీ సీఎంగా పనిచేసిన దామోదర రాజనర్సింహ, సీఎల్పీ నాయకుడిగా వ్యవహరించిన మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులతో చర్చించి.. వారిని సముదాయించింది.
టీపీసీసీ చేజారిన కోమటిరెడ్డి
రేవంత్ రెడ్డి 2021లో టీపీపీసీ అధ్యక్షుడు అయిన సందర్భంలో ఆ పదవికి నల్లగొండ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. తనకు ఉన్న అర్హతలతో ఆయన గట్టిగానే పోరాడినా అధిష్ఠానం మాత్రం రేవంత్ కే బాధ్యతలు అప్పగించింది. దీనిపైనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీలో ఉండలేని పరిస్థితికి వచ్చారు. బీజేపీలోకి వెళ్లి మునుగోడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చి గెలవడం తర్వాతి సంగతి. ఇక కాంగ్రెస్ అధికారంలో వచ్చాక వెంకటరెడ్డికి కీలకమైన రోడ్లు-భవనాల శాఖ దక్కింది. రాజగోపాల్ కూ మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. కానీ.. అందుకు అవకాశాలు తక్కువ. ఉమ్మడి నల్లగొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా త్రిగా ఉండడం, అందరూ ఒకటే సామాజిక వర్గం వారు కావడమే దీనికి కారణం.
పొరపాటున అన్నారా? బంధం వేశారా?
ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తాజాగా పాల్గొన్న ఓ సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఉత్తమ్ అంటూ సంబోధించారు. మంత్రి అనబోయి పొరపాటునే అన్నట్లు తడుముకోకుండా సర్దిచెప్పుకొన్నారు. అయితే, తన నాలుకపై మచ్చ ఉందని.. తాను అన్నది జరుగుతుందని వెంటనే వ్యాఖ్యానించారు. దీనంతటినీ ఉత్తమ్ నవ్వుతూ స్వీకరించారు. కాంగ్రెస్ రాజకీయాలు తెలిసినవారు మాత్రం.. ‘ఉత్తమ్ అవకాశాలకు ముందే కోమటిరెడ్డి టెండర్ వేసేశారు’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.