వాహనాల మీద 'టీఎస్' కాదు 'టీజీ'.. ఓకే చేసిన కేంద్రం
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రకాల వాహనాల రిజిస్ట్రేషన్ల పేరు మారిపోనున్నాయి. ఇప్పటివరకు 'టీఎస్' స్థానే 'టీజీ'కు మారుస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.
By: Tupaki Desk | 13 March 2024 3:46 AM GMTతాను తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం చేత కూడా ఓకే చేయించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రకాల వాహనాల రిజిస్ట్రేషన్ల పేరు మారిపోనున్నాయి. ఇప్పటివరకు 'టీఎస్' స్థానే 'టీజీ'కు మారుస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రేవంత్ సర్కారు తీసుకున్న నిర్ణయానికి మోడీ సర్కార్ ఆమోదముద్ర వేసినట్లైంది. నిజానికి వాహనాలకు నంబర్లు కేటాయించే క్రమంలో రాష్ట్రం పేరు అర్థమయ్యేందుకు వీలుగా రెండు ఇంగ్లిషు అక్షరాలతో నెంబరు మొదలు కావటం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ కు ఏపీగా.. తమిళనాడుకు టీఎన్ గా.. కేరళకు కేఎల్ గా ఉండే వేళ.. తెలంగాణకు టీజీగా రాష్ట్ర విభజన వేళ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మొదట్లో టీజీ పదానికి అనుకూలంగా ఉన్న కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం టీజీకి బదులుగా టీఎస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అప్పట్లో ఆసక్తికర చర్చ జరిగింది. అప్పటి టీఆర్ఎస్ సర్కారుకు తగ్గట్లే.. టీఎస్ పేరు పెట్టి ఉంటారన్న విమర్శలు వెల్లువెత్తాయి. వాటిని ఖాతరు చేయని కేసీఆర్ సర్కారు తాను అనుకున్నట్లే టీఎస్ గా డిసైడ్ చేశారు.
కట్ చేస్తే.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించటం.. రేవంత్ సర్కారు కొలువు తీరటం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాహనాల నంబర్లకు టీఎస్ కు బదులుగా టీజీగా మార్చనున్నట్లుగా ప్రకటించారు. ఈ అంశాన్ని రాష్ట్ర మంత్రివర్గ భేటీలో చర్చించారు. ప్రభుత్వ నిర్ణయంగా ఆమోద ముద్ర వేశారు. ఈ క్రమంలో సదరు అంశానికి సంబంధించిన అధికారిక ప్రొవిజన్ ను చెప్పటం.. అనుమతి కోసం కేంద్రానికి తమ ప్రతిపాదనను పంపారు.
మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 41(6) కింద ఉన్న అధికారాలను ఉపయోగించి 1989 జూన్ 12న అప్పటి ఉపరితల రవాణా శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ లో ఈ మార్పు చేసినట్లుగా పేర్కొన్నారు. సదరు నోటిఫికేషన్ లోని టేబుల్ లో సీరియల్ నంబరు 29ఏ కింద తెలంగాణలో ఇప్పటివరకు ఉన్న టీఎస్ స్థానే టీజీను కేటాయించినట్లుగా తాజాగా నోటిఫికేషన్ జారీ అయ్యింది. దీంతో.. ఇక నుంచి రిజిస్టర్ అయ్యే వాహనాలకు టీజీ మార్కును కేటాయిస్తారు.