Begin typing your search above and press return to search.

థాయ్ రాజును విమర్శిస్తూ పోస్టులు.. 50 ఏళ్లు జైలు

సోషల్ మీడియాలో రాజు ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఆన్ లైన్ లో పోస్టులు పెట్టారన్నది ఇతడి మీద ఉన్న ఆరోపణ.

By:  Tupaki Desk   |   20 Jan 2024 4:56 AM GMT
థాయ్ రాజును విమర్శిస్తూ పోస్టులు.. 50 ఏళ్లు జైలు
X

నాగరిక ప్రపంచంలో.. అందునా అందరికి సుపరిచితమైన థాయ్ లాండ్ దేశంలో ఇలాంటి శిక్ష విధించటమా? అని అనుకోవచ్చు. ఆ దేశంలో చేయకూడని మహానేరం ఏదైనా ఉందంటే.. అది రాజరిక కుటుంబాన్ని విమర్శించటం. ఆ దేశ రాజును కానీ రాజకుటుంబాన్ని కానీ విమర్శిస్తే.. అందుకు శిక్షలు కఠినాతికఠినంగా ఉంటాయి. తాజాగా ఆన్ లైన్ లో వస్త్రాలు అమ్మే వ్యాపారి ఒకరు ఇలాంటి పనే చేశాడు.

అందుకు అతగాడికి విధించిన శిక్ష అక్షరాల 50 ఏళ్లు. విన్నంతనే ఉలికిపాటుకు గురయ్యే ఈ ఉదంతంలోకి వెళితే.. మన దేశానికి దగ్గర్లో ఉండే థాయ్ లాండ్ లో ఇలాంటి పరిస్థితి ఉందా? అని ఆశ్చర్యపోయే పరిస్థితి. కఠిన చట్టాలు అమల్లో ఉండే ఆ దేశంలో ఇంతటి భారీ శిక్షను విధించటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. థాయ్ లాండ్ లోని చియాంగ్ రాయ్ ప్రావిన్స్ కు చెందిన 30 ఏళ్ల మొంగ్ కొల్ తిరఖోట్ ఆన్ లైన్ లో వస్త్ర వ్యాపారం చేస్తుంటాడు.

ఇతడు వ్యాపారంతో పాటు.. రాజకీయ హక్కుల కార్యకర్తగా పని చేస్తుంటాడు. సోషల్ మీడియాలో రాజు ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఆన్ లైన్ లో పోస్టులు పెట్టారన్నది ఇతడి మీద ఉన్న ఆరోపణ. ప్రపంచంలో అత్యంత కఠిన రాజరికచట్టాలు థాయ్ లాండ్ లో అమలు చేస్తుంటారు. దేశ రాజు.. రాణి.. వారి వారసుల్ని విమర్శిస్తే 15 ఏళ్లు జైలుశిక్ష విధిస్తారు.

ఇక.. వారిపై విమర్శలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తిరఖోట్ మీద విచారణ జరిపిన కోర్టు 2023లో ఇతనికి 28 ఏళ్ల జైలుశిక్ష విధించింది. తాజాగా.. మరో పన్నెండుకు పైగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా తేలింది. దీంతో.. ఆయనకు మరో 22 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చారు. దీంతో.. మొత్తం 50 ఏళ్ల జైలుశిక్షను విధించినట్లైంది. సో.. కొన్ని దేశాల్లో అమలయ్యే కఠిన చట్టాల గురించి అవగాహన లేకుండా ఉంటే.. అనూహ్య ప్రమాదాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే.. విదేశాలకువెళ్లే సమయంలోనూ.. అక్కడ ఉన్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.