Begin typing your search above and press return to search.

ఏఐ ఫోన్ కాల్ తో ప్రధానినే టార్గెట్ చేశారు.. తెరపైకి షాకింగ్ విషయం!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనే అంశం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ ప్రపంచంలో తీవ్ర సంచలనమైన అంశం.

By:  Tupaki Desk   |   17 Jan 2025 7:16 AM GMT
ఏఐ ఫోన్  కాల్  తో  ప్రధానినే టార్గెట్  చేశారు.. తెరపైకి షాకింగ్  విషయం!
X

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనే అంశం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ ప్రపంచంలో తీవ్ర సంచలనమైన అంశం. దీనివల్ల సాంకేతిక రంగంలో ప్రపంచం మరింత దూసుకుపోతుందని కొంతమంది చెబితే.. అదే స్థాయిలో సమస్యలూ ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఏఐ ఫోన్ కాల్ తో దేశ ప్రధానిని టార్గెట్ చేశారు సైబర్ నేరగాళ్లు.

అవును... ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది గొప్ప వరంలా మారిందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. ఏఐ ఫోన్ కాల్ తో ఏకంగా దేశ ప్రధానినే మోసం చేయాలని యత్నించారు సైబర్ మాయగాళ్లు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన షాకింగ్ విషయాలూ వెల్లడించారు థాయ్ ప్రధాని టేటోంగ్టార్న్ షనవత్రా.

తాజాగా ఈ విషయాలను వెళ్లడించిన థాయ్ లాండ్ ప్రధాని షనవత్రా... తనకూ తొలుత ఓ వాయిస్ మెసేజ్ వచ్చిందని.. ఇందులో "మీరు ఎలా ఉన్నారు.. నేను మీతో కలిసి పనిచేయాలి అని అనుకుంటున్నా" అని ఉందని వెల్లడించారు. అనంతరం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఓ నేత గొంతుతో తనకు నేరుగా కాల్ చేసి మాట్లాడారని ఆమె తెలిపారు.

అదే నంబర్ కు తిరిగి కాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు కాల్ కట్ అయ్యిందని అన్నారు. అనంతరం.. "అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్"లోని దేశాలలో థాయ్ లాండ్ మాత్రమే విరాళం ఇవ్వలేదని.. వెంటనే ఆ విరాళాలు తమకు ఇవ్వాళని డిమాండ్ చేస్తూ మరో వాయిస్ మేసేజ్ వచ్చిందని ఆమె తెలిపారు.

దీంతో... ఒక్కసారిగా అవాక్కయ్యానని అన్నారు. అయితే.. ఆ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నేత ఎవరనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. ఇదే సమయంలో.. ఆ ఫోన్ కాల్ ఎక్కడ నుంచి వచ్చిందనే విషయాన్ని చెప్పలేదు. ప్రస్తుతం ఈ విషయాన్ని అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లూ తెలిపారు. ఇలాంటి వాటిపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

అదే సమయంలో... ఈ మోసాన్ని తాను వెంటనే గుర్తించానని చెప్పిన ప్రధాని టేటోంగ్టార్న్... ప్రధాని స్థానంలో ఉన్న తనకే సైబర్ నేరగాళ్లు కాల్ చేస్తే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తం చేశారు.