Begin typing your search above and press return to search.

ఎంపీ సీట్ల పునర్విభజన.. దక్షిణాదికి అన్యాయమే.. దళపతి విజయ్

తమిళనాడులో మాత్రం చైతన్యం ఎక్కువేనని చాటుతూ.. అక్కడి నాయకులు మాట్లాడుతున్నారు.

By:  Tupaki Desk   |   5 March 2025 5:04 PM IST
ఎంపీ సీట్ల పునర్విభజన.. దక్షిణాదికి అన్యాయమే.. దళపతి విజయ్
X

మిగతా రాష్ట్రాల మాట ఎలా ఉన్నా.. తమిళనాడులో మాత్రం లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన రాజకీయ కాక రేపుతోంది.. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండడమో.. తెరపైకి దళపతి విజయ్ నాయకత్వంలో కొత్త పార్టీ పుట్టుకురావడమో... నిజంగానే ముందుగానే మేల్కొనడమో.. ఏదైతేనేం..? తమిళనాడులో మాత్రం చైతన్యం ఎక్కువేనని చాటుతూ.. అక్కడి నాయకులు మాట్లాడుతున్నారు.

1990ల నాటి కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారం జనాభా నియంత్రణ పాటించామని.. దీంతో తమ రాష్ట్రాల్లో జనాభా తగ్గిందని, ఇప్పుడు లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనను జనాభా లెక్కల ప్రకారం చేపడితే తాము నష్టపోతామంటూ తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అంటున్నారు.

కొత్తగా చేపట్టే లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనలో.. తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో పార్లమెంట్‌ స్థానాలు తగ్గుతాయనేది తమిళ నాయకులే కాదు.. దక్షిణాది నేతల నుంచి వస్తున్న మాట. అయితే, అలాంటిదేమీ జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వంటివారు చెప్పినా పలు రాష్ట్రాల ఆందోళనను వ్యక్తంచేస్తూనే ఉన్నాయి.

మరోవైపు వివాదాస్పదంగా మారిన లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన-జనాభా ప్రాతిపదిక అంశంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగానే విభజన చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అని తలపడుతున్న స్టాలిన్.. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నిలకు తగిన బేస్ సిద్ధం చేసుకుంటున్నారు.

2026లో జరగబోయే ఎన్నికల్లో డీఎంకేకు సవాల్ విసురుతున్న విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) కూడా లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై స్పందించారు. ఇది పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుందని ఆయన పేర్కొన్నారు. దీన్ని అంగీకరించమని ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్రం ఆయా రాష్ట్రాలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లుగా తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాలు జనాభా పెరుగుదలను నియంత్రించించిన విషయాన్ని గుర్తు చేశారు.

ఈక్రమంలో ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలు విభజించడం సరికాదన్నారు. ఒకరి గెలుపు కోసం ఇంకొకరిని శిక్షించడం అన్యాయమని పేర్కొన్నారు. దక్షిణాదిన నియోజకవర్గాల సంఖ్య తగ్గి.. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ వంటి రాష్ట్రాల్లో పెరిగితే సహించేది లేదని వ్యాఖ్యానించారు. అన్ని పార్టీలతో కలిసి దీనిపై పోరాడతామని ప్రకటించారు. ప్రజాప్రతినిధుల కొరత సాధారణ ప్రజలకు సమస్యే కాదు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నాణ్యమైన విద్య, వైద్యం, రోడ్లు వంటి అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ముందు వాటిపై దృష్టి సారించాలని సూచించారు.