విజయ్.. పక్కా ప్లానింగ్‌తోనే దిగాడు
కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్నదే నిజమైంది. కాకపోతే కొంచెం ముందుగానే ప్రకటన వచ్చేసింది
By: Tupaki Desk | 3 Feb 2024 3:15 AM GMTకొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్నదే నిజమైంది. కాకపోతే కొంచెం ముందుగానే ప్రకటన వచ్చేసింది. తమిళ టాప్ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. తమిళగ వెట్రి కళగం పేరుతో అతను కొత్త పార్టీని అనౌన్స్ చేశాడు. తమిళగ వెట్రి కళగం అంటే.. తమిళుల విజయ కూటమి అని అర్థం. పార్టీకి ఆకర్షణీయ పేరును ఎంచుకోవడమే కాదు.. పక్కా ప్లానింగ్‌తోనే అతను రాజకీయాల్లోకి అడుగు పెట్టాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉంది. తెలుగు తారలు ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల తరహాలో ఎన్నికలు మరీ దగ్గర పడిన సమయంలో విజయ్ పార్టీని మొదలుపెట్టలేదు. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిన నేపథ్యంలో పార్టీ నిర్మాణానికి చాలినంత సమయం తీసుకోవాలని అతను భావించాడు.
నిజానికి విజయ్ గత ఏడాదే రాజకీయ పార్టీ పనులు మొదలుపెట్టాడు. అభిమానులతో సమావేశాలు నిర్వహించాడు. ఇప్పుడు పార్టీని అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం అతను వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' అనే సినిమా చేస్తున్నాడు. అందులో రాజకీయ అంశాలు దట్టిస్తారనే ప్రచారం ఉంది. ఈ సినిమాను పూర్తి చేసి ఈ ఏడాది ద్వితీయార్ధంలో అతను పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టే అవకాశముంది. జయలలిత, కరుణానిధిల మరణానంతరం తమిళనాడు రాజకీయాల్లో ఒక శూన్యత ఏర్పడినప్పటికీ.. రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి వాళ్లు అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయారు. రజినీ ఊరించి ఊరించి వెనుకంజ వేయగా.. కమల్ పార్టీని సరిగా నడపలేకపోయారు. ఎవరైనా పక్కా ప్లానింగ్‌తో, పట్టుదలతో రంగంలోకి దిగి.. అభిమానాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసే స్థాయికి ఎదగొచ్చు. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకేకు సరైన పోటీయే లేదు. అదే సమయంలో ఆ పార్టీ మీద కూడా వ్యతిరేకత పెరుగుతోంది. అందుకే విజయ్ ముందుగానే రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అతను ప్రణాళిక ప్రకారం అడుగులేస్తే.. జనాలను ఆకట్టుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా అవతరించే అవకాశముంది.