Begin typing your search above and press return to search.

మాజీ స్పీకర్ తమ్మినేని విషయంలో అదే నిజమైందా ?

స్పీకర్ గా పనిచేసిన వారికి రాజకీయంగా ఫ్యూచర్ ఉండదని ఎప్పటి నుంచో ఉన్న మాట. అది నిజం అయిన మాట కూడా

By:  Tupaki Desk   |   14 July 2024 2:30 PM GMT
మాజీ స్పీకర్ తమ్మినేని విషయంలో అదే నిజమైందా ?
X

స్పీకర్ గా పనిచేసిన వారికి రాజకీయంగా ఫ్యూచర్ ఉండదని ఎప్పటి నుంచో ఉన్న మాట. అది నిజం అయిన మాట కూడా. ఉమ్మడి ఏపీ నుంచి విభజన ఏపీ దాకా చూసుకుంటే ఎంతో మంది స్పీకర్లుగా పనిచేశారు. ఆ తరువాత రాజకీయంగా వారు కనుమరుగు అయ్యారు. ఇపుడు ఆ జాబితాలో తాజా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేరిపోయారు అని అంటున్నారు.

ఆయన ఆముదాలవలస నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసారు. అయితే తన సొంత మేనల్లుడి చేతిలోనే అతి పెద్ద ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు. ఏడు పదులకు చేరువ అవుతున్న తమ్మినేనికి ఇవి చివరి ఎన్నికలు అనే ప్రచారం సాగింది. ఈసారి గెలిస్తే తన కుమారుడిని రాజకీయ వారసుడిగా చేసుకుని చూసుకోవాలని తమ్మినేని తపన పడ్డారు.

దానికంటే ముందు కుమారుడికే ఎంపీ టికెట్ కానీ ఎమ్మెల్యే టికెట్ కానీ అడిగారని ప్రచారం సాగింది. అయితే వైసీపీ హై కమాండ్ తమ్మినేనికే టికెట్ ఇచ్చింది. దాంతో ఆయన కూటమి ప్రభంజనంలో ఓటమి పాలు అయ్యారు. ఈ పరిణామాల నేపధ్యంలో గత నెల రోజుల నుంచి తమ్మినేని హడావుడి అయితే ఎక్కడా లేదు.

ఆయన పార్టీ సమావేశాలలోనూ కనిపించడంలేదు. దాంతో రాజకీయ వైరాగ్యమా లేక ఓటమి వల్ల కలిగిన విరక్తా లేక భవిష్యత్తు ఆలోచన ఏమైనా చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. టీడీపీలో తొలిసారి 1983లో తెలిచిన తమ్మినేని ఆ పార్టీలోనే అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా చేశారు. వైసీపీ నుంచి ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇలా తన రాజకీయ జీవితంలో మంత్రిగా స్పీకర్ గా పనిచేసిన తమ్మినేని ప్రజారాజ్యం పార్టీలోనూ చేరి 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.

ఇక తాజా ఓటమితో తమ్మినేని రాజకీయంగా తగ్గుతారా లేక మళ్లీ వేరే పార్టీలలో చేరుతారా అని అంటున్నారు. టీడీపీలో తన మేనల్లుడే ఉండడంతో అందులోకి వెళ్ళడం కుదరదు అని అంటున్నారు. దాంతో జనసేనలో చేరుతారా అన్న చర్చ కూడా సాగుతోంది. ప్రజారాజ్యం నాటి పరిచయాలు ఉండడంతో అందులోకే వెళ్తారు అని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

మరో వైపు చూస్తే స్పీకర్లుగా గతంలో పనిచేసిన వారికి రాజకీయంగా ఉన్నతి లేకుండా పోయింది అని గుర్తు చేసుకుంటున్నారు. విభజన ఏపీలో తొలి స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు కూడా 2019లో ఓటమి తరువాత ఇబ్బందిపడ్డారని, ఆ మీదట ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారు.

శ్రీకాకుళం జిల్లాకే చెందిన మాజీ స్పీకర్ ప్రతిభా భారతి సైతం రాజకీయంగా మళ్ళీ ముందు వరసలోకి రాలేకపోయారని కూడా చెబుతున్నారు. అయితే తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం అయినా తమ్మినేని ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటారా అని చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.