లైలా ఈవెంట్ వివాదంపై వైసీపీ నేత సీరియస్ వార్నింగ్
ముఖ్యంగా బైకాట్ లైలా అంటూ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 10 Feb 2025 11:15 AM GMTలైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు థర్టీ ఇయర్స్ పృధ్వీ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఆయన "150 మేకలలో 11 గొర్రెలు మిగిలాయి" అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా బైకాట్ లైలా అంటూ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి.
ఇక ఈ సంఘటనపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పందిస్తూ, "ఇప్పుడున్న 11 గొర్రెలే రేపు గర్జించే సింహాలు అవుతాయి. శత్రువులను చీల్చి చెండాడుతాయి. రోజులెప్పుడు ఒకేలా ఉండవు. వ్యక్తిగత కక్షలతో ఇండస్ట్రీని బలి చేయడమేంటి?" అంటూ ప్రశ్నించారు. ఆయన, రాజకీయ వేదికల్ని వదిలి సినీ ఈవెంట్లలో రాజకీయ విమర్శలు చేయడం సరైంది కాదని హెచ్చరించారు.
ఇక ఈ వివాదంపై వైసీపీ సోషల్ మీడియా వర్గాలు #BoycottLaila అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రచారం మొదలుపెట్టాయి. దీనివల్ల సినిమా యూనిట్ కాస్త ఆందోళనకు గురైంది. దీంతో నిర్మాతలు ఎటువంటి రాజకీయ పక్షపాతం లేదని, తమ సినిమా కేవలం వినోదం కోసం మాత్రమే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. తమ ఈవెంట్‌లో గెస్ట్‌లుగా హాజరైన వారు ఏమి మాట్లాడతారో తమ చేతుల్లో లేదని, సినిమా చూడాలి గానీ అనవసరమైన రాజకీయ వివాదాల్లో లాగొద్దని వారు కోరారు.
లైలా మూవీ హీరో విశ్వక్ సేన్ కూడా ఈ వివాదంపై స్పందిస్తూ, "మా సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. ఇది పూర్తిగా వినోదాత్మక చిత్రం. ఒక్కరు పొరపాటు చేస్తే అందరికీ శిక్ష వేసినట్లే అవుతుంది. ఇలాంటి అనవసర విమర్శలు మాకు అవసరం లేదు." అని అన్నారు. ఇదిలా ఉండగా, సినిమా ప్రమోషన్ కంటే వివాదం ఎక్కువ ప్రచారం కావడం యూనిట్‌ను కాస్త నిరాశకు గురిచేస్తోంది.
ఈ విషయంపై ఇప్పటికే కూటమి వర్గాలు ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోయినా, వైసీపీ మాత్రం దీనిని తీవ్రంగా పరిగణించిందని తెలుస్తోంది. "సినిమా రంగాన్ని రాజకీయ కక్షల కోసం వాడుకోవడం సరికాదు. తప్పు చేసిన వాళ్లు నైతిక బాధ్యత తీసుకోవాలి. అయినా, సినిమా ఒక వినోద రంగం. దాన్ని వ్యక్తిగత భావోద్వేగాల కోసం వాడుకోవడం ఏమాత్రం మంచిది కాదు" అని వైసీపీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇప్పటికే జరిగిన హంగామాతో లైలా చిత్రానికి మంచి బజ్ క్రియేట్ అయినప్పటికీ, ఈ వివాదం థియేటర్ల వద్ద ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది చూడాల్సిందే. ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కానుండటంతో, ముందు వివాదం సద్దుమణిగితే మంచిది అని చిత్రబృందం భావిస్తోంది.