Begin typing your search above and press return to search.

టీడీపీ జనసేనలకు అదే అసలైన సవాల్...?

ఎవరైనా త్యాగపురుషుడు ఉన్నాడంటే తెర వెనక బలమైన హామీతోనే అలా ఉన్నారని అర్ధం చేసుకోవాలి.

By:  Tupaki Desk   |   18 Feb 2024 12:30 AM GMT
టీడీపీ జనసేనలకు అదే అసలైన సవాల్...?
X

పొత్తులు పెట్టుకోవడం సులువు. ఇద్దరు నేతలు కలుస్తారు. హ్యాపీగా చేయి చేయి కలుపుతారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో అది అలాగే ఉంటుందా అంటే ఉండదు. ఎంత లోతుల్లోకి వెళ్తే అంతలా రాజకీయ వైరం ఉంటుంది. పైగా పై స్థాయిలో అధినేతలు ఆలోచించినట్లుగానే దిగువ స్థాయిలో నేతలు కూడా ఆలోచిస్తారు. మాకేంటి అన్నదే ఆ ఆలోచన. రాజకీయాల్లో త్యాగాలకు ఎపుడూ తావులేదు. ఎవరైనా త్యాగపురుషుడు ఉన్నాడంటే తెర వెనక బలమైన హామీతోనే అలా ఉన్నారని అర్ధం చేసుకోవాలి.

ఏది ఏమైనా ఏపీలో చూస్తే పొత్తుల అవసరం ఉందని టీడీపీ జనసేన రెండూ గుర్తించాయి. అధికారంలో ఉన్న పార్టీని దించాలంటే విపక్షాలు చేతులు కలపక తప్పదు. ఎందుకంటే ఓటరు ఎపుడూ రెండు ఆప్షన్లనే చూస్తారు. మూడవది చూడదు. ప్రభుత్వాన్ని కొనసాగించాలా వద్దా అన్నది ఒకటైతే విపక్షంలో ఎవరిని ఎంచుకోవాలి అన్నది రెండవది. అక్కడ రెండు మూడు పార్టీలు పోటీ చేస్తే కచ్చితంగా ఓట్ల చీలిక ఉంటుంది.

ఈ విషయంలో జనసేన అధినేత పవన్ రాజకీయ దూర దృష్టి బహు గొప్పది. ఆయన ఎపుడో 2021లోనే ఇప్పటం సభలో ఇదే విషయం చెప్పారు. ఓట్లను చీల్చను మళ్లీ వైసీపీకి అధికారం దక్కనియను అని. దాని కోసం ఎందాకైనా వెళ్తామని కూడా చెప్పారు. అలా టీడీపీతో జనసేన పొత్తు రాజకీయ భావ సారూప్యత తో కుదిరింది. టీడీపీ కూడా పొత్తుల కోసం ఎదురుచూస్తోంది కాబట్టి ఇది సాధ్యపడింది.

సరే రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. మరి దిగువ స్థాయిలో ఓట్ల బదిలీ జరుగుతుందా అంటే అనేక సందేహాలు ఉత్పన్నం అవుతున్నాయి. దానికి కారణం రెండు పార్టీలూ ఒకే చోట బలంగా ఉండడం, ఒకే సీటుని ఆశించడం. ఇది ఎక్కువగా గోదావరి జిల్లాలో కనిపిస్తూంటే అటూ ఇటుగా ఏపీ అంతా ఇలాగే ఉంది.

టీడీపీకి కోస్తా ప్రాంతం కంచుకోటగా ఉంది. ఇక్కడ ఏడు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. వీటిలో ఎపుడూ టీడీపీకి మెజారిటీ సీట్లు వస్తాయి. 2019లో మాత్రం జనసేన రాకతో దానికి గండి పడింది. జనసేన టీడీపీ ఓట్లు చీల్చింది కూడా ఇక్కడే. దాంతో టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి పొత్తు ఉంది కనుక ఓట్లు బదిలీ అవుతాయని అనుకుంటున్నారు. కానీ జనసేన టీడీపీ అభ్యర్ధులు బలంగా ఉన్న సీట్లలో పేచీ స్టార్ట్ అవుతఒంది.

అది రాజమండ్రి రూరల్ నుంచి మొదలెడితే రాజోలు, అమలాపురం, నర్సాపురం, పిఠాపురం, కాకినాడ రూరల్, అర్బన్ తాడేపల్లిగూడెం ఇలా చాలానే ఉన్నాయని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో తీసుకుంటే గాజువాక. భీమిలీ, అనకాపల్లి, పెందుర్తి, పాయకరావుపేట వంటి చోట్ల రెండు పార్టీల మధ్య సంఖ్యత కంటే ఇబ్బందులే ఎక్కువగా ఉన్నాయి.

విజయనగరంలో చూసుకుంటే నెల్లిమర్ల విజయనగరం, గజపతినగరం సీట్లను జనసేన ఆశిస్తోంది అని ప్రచారం ఉంది. ఇక్కడ టీడీపీకి బలమైన క్యాండిడేట్లు ఉన్నారు. దాంతో రాజకీయంగా వర్గ పోరు తప్పదని అంటున్నారు. శ్రీకాకుళంలో ఎచ్చెర్ల, పలాస, పాతపట్నం, పాలకొండ సీట్ల మీద జనసేన కన్ను ఉంది. ఇక్కడ గట్టి అభ్యర్ధులు మాజీ ఎమ్మెల్యేలు టీడీపీకి ఉన్నారు. దీంతో రెండు పార్టీలలో ఎవరికి టికెట్ ఇచ్చినా రెండవ వారు సహకరిస్తారా అన్న చర్చ సాగుతోంది.

ఇదిలా ఉంటే ఓట్ల బదిలీ సాఫీగా సాగుతుంది. ఎలాంటి ఇబ్బంది లేదు అని జనసేన నేత నాగబాబు అంటున్నారు. పై స్థాయిలో నాయకులు కలసినట్లుగానే క్షెత్ర స్థాయిలో క్యాడర్ కూడా ఒక్కటిగా పనిచేస్తుంది అని ఆయన చెబుతున్నారు. వైసీపీ దుష్ట పాలనను అంతం చేయలంటే చేతులు కలపాలన్నది రెండు వైపుల నుంచి ఉన్న కార్యకర్తలకు తెలుసు అని అంటున్నారు.

నాగబాబు చెప్పారు కానీ అనుకున్నంత సులువు అయితే కాదు అని అంటున్నారు. మొదటే చెప్పినట్లుగా రాజకీయాల్లో త్యాగాలు ఉండవు. పైగా ఎవరి కోసం ఎవరూ ఆగేది ఉండదు, ఈసారికి జనసేనకు మద్దతు తెలిసి వచ్చేసారికి చూసుకుందామనుకునే అమాయకపు రాజకీయం రోజులు అయితే లేవు కావు అని అంటున్నారు.