Begin typing your search above and press return to search.

సీఎం క్యాంప్‌ ఆఫీసుగా ఆ ప్యాలెస్‌!

ఇది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా మార్చడానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను కలిగి ఉందని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   14 Jan 2024 6:41 AM GMT
సీఎం క్యాంప్‌ ఆఫీసుగా ఆ ప్యాలెస్‌!
X

తెలంగాణ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి క్యాంపు కార్యాలయంగా బేగంపేటలోని చిరాన్‌ ఫోర్ట్‌ లేన్‌ లోని పైగా ప్యాలెస్‌ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. సీనియర్‌ అధికారుల బృందం ఇటీవల ఈ ప్యాలెస్‌ ను పరిశీలించడంతో ఊహాగానాలు మరింత పెరిగాయి. ఇది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా మార్చడానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను కలిగి ఉందని చెబుతున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి క్యాంపు కార్యాలయంగా మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని కూడా అధికారులు పరిశీలించారు. అయితే దానిపట్ల అంత సుముఖత వ్యక్తం కాలేదని తెలుస్తోంది. దీంతో అధికారులు బేగంపేటలోని పైగా ప్యాలెస్‌ ను పరిశీలించారని చెబుతున్నారు. దీన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కార్యాలయంగా దాదాపు ఎంపిక చేయొచ్చని అంటున్నారు.

అటు బేగంపేట విమానాశ్రయం, ఇటు బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయానికి సమీపంలో ఉండడంతో అధికారులు పైగా ప్యాలెస్‌ పట్ల సానుకూలంగా ఉన్నారని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

కాగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం తాము వివిధ భవనాలను పరిశీలిస్తున్నామని.. అయితే ఇంకా ఏదీ ఖరారు కాలేదని ఒక సీనియర్‌ అధికారి వెల్లడించారు.

ఐదు ఎకరాలలో విస్తరించి ఉన్న పైగా ప్యాలెస్‌ లో ఒక హెరిటేజ్‌ నిర్మాణంతో సహా మూడు భవనాలు ఉన్నాయి. 2007 నుంyì యూఎస్‌ కాన్సులేట్‌ కార్యాలయం పైగా ప్యాలెస్‌ లో ఉండేది. దీన్ని గత సంవత్సరం మార్చిలో నానక్‌ రామగూడకు మార్చారు.

పైగా ప్యాలెస్‌ ను ఇప్పుడు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నిర్వహిస్తోంది. మరోవైపు డిసెంబరు 10న జూబ్లీహిల్స్‌ లోని మర్రి చెన్నారెడ్డి తెలంగాణ మానవ వనరుల అభివృద్ధి సంస్థను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సందర్శించడంతో అందులోని వివేకానంద బ్లాక్‌ ను కొత్త క్యాంపు కార్యాలయంగా మార్చే అవకాశం ఉందన్న ఊహాగానాలు చెలరేగిన సంగతి తెలిసిందే.

30 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ సంస్థలో మంజీర, గోదావరి తదితర అనేక బ్లాక్‌లు ఉన్నాయి. అయితే జూబ్లీహిల్స్‌ లోని పెద్దమ్మ ఆలయానికి సమీపంలో ఉన్న ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో ఉన్న వివేకానంద బ్లాక్‌పై రేవంత్‌ రెడ్డి ప్రత్యేకంగా ఆరా తీశారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే వివేకానంద బ్లాక్‌ లో పిచ్చిమొక్కలను తొలగించారు. మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ముఖ్యమంత్రి రేవంత్‌ ఇప్పటికే కొన్ని సమావేశాలు నిర్వహించారు. అయితే, దీనికి కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.

పైగా ప్యాలెస్‌ అయితే వెంటనే కార్యాలయ కార్యకలాపాలను ప్రారంభించడానికి అన్ని సౌకర్యాలతో అనువుగా ఉందని అంటున్నారు. మరికొద్ది రోజుల్లోనే సీఎం క్యాంపు కార్యాలయంపై స్పష్టత రానుంది.