Begin typing your search above and press return to search.

మంత్రి మేనల్లుడికి ఆ సీటు.. పార్టీ మారే యోచనలో తాజా ఎంపీ!

అలాగే అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి పాడేరు అసెంబ్లీ సీటును కేటాయించారు.

By:  Tupaki Desk   |   10 Jan 2024 12:30 PM GMT
మంత్రి మేనల్లుడికి ఆ సీటు.. పార్టీ మారే యోచనలో తాజా ఎంపీ!
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్‌ మార్పులుచేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కేవలం అసెంబ్లీ స్థానాల్లోనే కాకుండా పార్లమెంటు స్థానాల్లోనూ మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే అనంతపురం ఎంపీ తలారి రంగయ్యకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. అలాగే అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి పాడేరు అసెంబ్లీ సీటును కేటాయించారు.

ఇప్పుడు ఇదే కోవలో విజయనగరం ఎంపీగా ఉన్న బెల్లాన చంద్రశేఖర్‌ ను తప్పిస్తారని టాక్‌ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు బదులుగా విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గా ఉన్న మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)కు సీటు ఇస్తారని చెబుతున్నారు. చిన్న శ్రీను స్వయానా వైసీపీ కీలక నేత, ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణకు మేనల్లుడు.

ఈ నేపథ్యంలో విజయనగరం ఎంపీ సీటును బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీనుకు ఇస్తారని అంటున్నారు. ప్రస్తుత బెల్లాన చంద్రశేఖర్, చిన్న శ్రీను ఇద్దరూ తూర్పు కాపు సామాజికవర్గానికి చెందినవారే. అయితే బెల్లానతో పోలిస్తే చిన్న శ్రీనుకు ఆర్థిక, అంగ బలాలు మెండుగా ఉన్నాయి. ఓ మేనమామ బొత్స సత్యనారాయణ విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు. మరో మేనమామ బొత్స అప్పలనరసయ్య గజపతినగరం ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే మరో బంధువు కడుబండి శ్రీనివాసరావు నెల్లిమర్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక చిన్న శ్రీను స్వయంగా విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గా చక్రం తిప్పుతున్నారు. ఇన్ని అనుకూలతలు కలిసి రావడంతో జగన్‌ ఓటు చిన్న శ్రీనుకేనని అంటున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో చిన్న శ్రీనును బరిలోకి దింపితే విజయనగరం ఎంపీ సీటును సులువుగా తమ ఖాతాలో వేసుకోవచ్చని వైసీపీ అధిష్టానం లెక్కలు వేసుకుంటుందని చెబుతున్నారు. చిన్ని శ్రీనుకు సీటు ఇస్తున్నారనే వార్తల నేపథ్యంలో ప్రస్తుతం విజయనగరం వైసీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ వైసీపీ అధినేత జగన్‌ ను కలిశారని ప్రచారం జరుగుతోంది.

అయితే జగన్‌.. బెల్లాన చంద్రశేఖర్‌ కు ఎలాంటి హామీ ఇవ్వలేదని చెబుతున్నారు. ఎంపీ సీటు ఇవ్వకపోయినా కనీసం తనకు ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గమైనా కేటాయించాలని బెల్లాన కోరినట్టు చెబుతున్నారు. అయితే జగన్‌ చూద్దామని ఆయనకు చెప్పినట్టు టాక్‌. దీంతో తనకు సీటు రాదని ఫిక్సయిపోయిన బెల్లాన చంద్రశేఖర్‌ పార్టీ మారే యోచనలో ఉన్నారని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది