Begin typing your search above and press return to search.

అందుకు క‌దా.. `రాహుల్ బాబా` పేరొచ్చింది.. అయినా మార‌లేదే

తాజాగా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యంపై బీజేపీ నేతల నుంచి మ‌రిన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

By:  Tupaki Desk   |   29 Nov 2023 4:19 AM GMT
అందుకు క‌దా.. `రాహుల్ బాబా` పేరొచ్చింది.. అయినా మార‌లేదే
X

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్‌గాంధీని.. బీజేపీ అగ్ర‌నేత‌లు.. రాహుల్ బాబా అంటూ ఆట‌ప‌ట్టించే విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ కేంద్ర మంత్రి అమిత్‌షా అనేక సంద‌ర్భాల్లో ``రాహుల్ బాబా`` అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి కార‌ణం.. కీల‌క స‌మ‌యాల్లో ఆయ‌న విదేశాల‌కు వెళ్లిపోవ‌డం.. పార్ల‌మెంటుకు డుమ్మా కొట్ట‌డం వంటివి ప్ర‌ధాన కార‌ణాలు. అయిన‌ప్ప‌టికీ.. రాహుల్ మాత్రం ఎక్క‌డా మార‌డం లేదు. తాజాగా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యంపై బీజేపీ నేతల నుంచి మ‌రిన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

నిర్ణ‌యం ఇదీ..

తెలంగాణ స‌హా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిపోయి.. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు కూడా పూర్త‌య్యాయి. ఇక‌, తెలంగాణ‌లో గురువారం ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల్లో విశ్రాంతి లేకుండా ప‌ర్య‌టించిన రాహుల్ గాంధీ మ‌రోసారి విదేశాలకు వెళ్లనున్నారు. అయితే.. ఈయ‌న వెళ్తున్న స‌మ‌యంలోనే పార్లమెంటు శీతాకాల సమావేశాలు (వచ్చేనెల 4వ తేదీ నుంచి) ప్రారంభం కానున్నాయి. దీంతో బీజేపీ నేత‌లు రాహుల్‌ను మ‌రోసారి ట్రోల్ చేస్తున్నారు. డిసెంబర్ 9 నుంచి ఇండోనేషియా, సింగపూర్, మలేషియా, వియత్నాంలలో రాహుల్ పర్యటించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. సింగపూర్, మలేషియాలలో అక్కడి ఎన్‌ఆర్‌లను, దౌత్యవేత్తలను రాహుల్ కలుసుకుంటారని, వియత్నాం కమ్యూనిస్టు నేతలను కూడా కలుస్తారు.

కీల‌క స‌మ‌యంలో డుమ్మా!

పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4న మొదలై 22వ తేదీతో ముగుస్తాయి. రాహుల్ గాంధీ విదేశీ పర్యటన‌కు వెళ్తే.. ఈ సమావేశాల్లో ఆయన పాల్గొనే అవకాశాలు ఉండ‌వు. వాస్త‌వానికి గ‌త ఏడాది శీతాకాల సమావేశాలకూ రాహుల్ పూర్తిగా దూరమయ్యారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉండటం, గత వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన కీలక బిల్లులు ఈ శీతాకాల సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉన్న తరుణంలో రాహుల్ విదేశీ పర్యటన వ్యవహారంపై బీజేపీ విమ‌ర్శ‌లు చేసేందుకు అవ‌కాశం ఇచ్చిన‌ట్ట‌యింది.