ఆ డీప్ ఫేక్ వీడియోపై ఐటీ దిగ్గజం క్లారిటీ
ఈ తరహా వీడియోల కట్టడికి సైబర్ క్రైమ్ నిపుణులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆ డీప్ ఫేక్ వీడియోల బెడద మాత్రం సెలబ్రిటీలకు తప్పడం లేదు.
By: Tupaki Desk | 15 Dec 2023 4:41 AM GMTసామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు సినీ తారల నుంచి క్రీడాకారుల వరకు అందరినీ బెంబేలిసిస్తున్న అంశం డీప్ ఫేక్ వీడియోలు. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంతో ఆ వ్యవహారంపై ఏకంగా ప్రధాని మోడీ సహా పలువురు రాజకీయ నేతలు, సెలబ్రిటీలు స్పందించారు. ఆ తర్వాత బాలీవుడ్ నటి కాజోల్, సారా టెండూల్కర్, రతన్ టాటాల డీప్ ఫేక్ వీడియోలు కూడా వైరల్ కావడం సంచలనం రేపింది. ఈ తరహా వీడియోల కట్టడికి సైబర్ క్రైమ్ నిపుణులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆ డీప్ ఫేక్ వీడియోల బెడద మాత్రం సెలబ్రిటీలకు తప్పడం లేదు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి డీప్ ఫేక్ వీడియో బారిన పడటం చర్చనీయాంశమైంది. ట్రేడింగ్ యాప్ లను ఆయన ప్రమోట్ చేస్తున్నట్టుగా డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై నారాయణమూర్తి స్వయంగా స్పందించారు. ఆటోమేటెడ్ ట్రేడింగ్ యాప్ లలో తాను పెట్టుబడులు పెట్టినట్లుగా చేస్తున్న ప్రచారంలో నిజం లేదని, అవి అసత్య వార్తలని నారాయణమూర్తి కొట్టిపడేశారు.
బిట్ కాయిన్, ప్రాఫిట్ బిట్ వంటి వాటి తరఫున తాను ప్రచారం చేస్తున్నట్లుగా యాడ్స్ వస్తున్నాయని, డీప్ ఫేక్ ఫోటోలు వీడియోలతో నకిలీ ఇంటర్వ్యూలు కూడా వైరల్ అవుతున్నాయని చెప్పారు. ఆ యాప్ లు, వీడియోలు, వెబ్సైట్ లతో తనకు సంబంధం లేదని, ఆ మోసరపూరిత కథనాలను నమ్మొద్దని ప్రజలను కోరారు. అటువంటి వీడియోలు, నకిలీ వార్తలు కనిపించినప్పుడు సంబంధిత రెగ్యులేటరీ అధికారులకు ఫిర్యాదు చేయాలని నారాయణమూర్తి సూచించారు.