Begin typing your search above and press return to search.

మార్పు మొదలైంది.. గ‌త ఆన‌వాళ్లు కనిపించ‌కూడ‌దు: చంద్ర‌బాబు

విధ్వంసం జరిగిన రాష్ట్రంలో పాలన సాగించాలంటే ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.

By:  Tupaki Desk   |   12 Dec 2024 3:51 AM GMT
మార్పు మొదలైంది.. గ‌త ఆన‌వాళ్లు కనిపించ‌కూడ‌దు:  చంద్ర‌బాబు
X

రాష్ట్రంలో మార్పు మొద‌లైంద‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో నిర్వ‌హించిన క‌లెక్ట‌ర్ స‌ద‌స్సు తొలిరోజు ముగింపు సంద‌ర్భంగా ఆయ‌న సుదీర్ఘ ఉప‌న్యాసం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు కూడా చేశారు. రాష్ట్రంలో నెల‌కొన్న‌ చీకట్లు నెమ్మ‌ది నెమ్మ‌దిగా తొలిగిపోతున్నాయ‌ని.. తెలిపారు. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయ‌ని.. ఇక‌, రాష్ట్రాన్ని నడిపించడం సులభంగానే ఉంటుందన్నారు. విధ్వంసం జరిగిన రాష్ట్రంలో పాలన సాగించాలంటే ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.

గత వైసీపీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల పైనే అప్పులు, బకాయిలు మిగిల్చి వెళ్లింద‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. అంతేకాకుండా.. రెండేళ్ల పాటు రాష్ట్రానికి(2026 వ‌ర‌కు) వచ్చే నిధులను ముందుగానే వాడేసిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌వ్వుతున్న కొద్దీ గ‌త ప్ర‌భుత్వ లోపాలు క‌నిపిస్తూనే ఉన్నాయ‌న్నారు. విధ్వంసం తాలూకు ఆన‌వాళ్లు ఇప్ప‌టితో పోయేలా లేవ‌ని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించామన్నారు. సంక్షేమం-అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.

దేన్నీ వ‌ద‌ల్లేదు..

గత పాలకులు రాష్ట్రంలో దేన్నీ వ‌ద‌ల్లేద‌ని.. అన్నింటినీ ధ్వంసం చేశార‌నిసీఎం చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోర్టులు, సెజ్‌లు కూడా కబ్జా చేశారని అన్నారు. అయితే.. కూట‌మి స‌ర్కారు వ‌చ్చాక అన్నింటినీ ఒకొక్కటిగా సరిదిద్దుతున్నామన్నారు. ర‌హ‌దారుల నిర్మాణం నుంచి ప‌లు ప్రాజెక్టుల దాకా `పీ-4` పాలసీ, జీరో పోవర్టీ, ఉద్యోగాలకల్పన, జనాభావృద్ధి, జల సంరక్షణ, వ్యవసాయంలో పెట్టుబడి తగ్గించడం, రైతులకు లాభాలు పెంచడం.. తదితర అంశాలను ప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్న‌ట్టు వివ‌రించారు.

కూకటి వేళ్లతో సహా తొలగించండి :

ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వ ఆన‌వాళ్లు ఎక్క‌డా క‌నిపించ కూడ‌ద‌ని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో భూ అక్రమాలు, లిక్కర్ మాఫియా, ఇసుక దోపిడీ, గంజాయి సాగు, డ్రగ్స్ సరఫరా, ఎర్రచందనం స్మగ్లింగ్, రేషన్ బియ్యం విదేశాలకు అక్రమ రవాణా.. ఇలా అన్ని మూలాల్లోకి మాఫియా వెళ్లిపోయిందన్నారు. ఇప్పుడు వాటిని కూకటి వేళ్లతో సహా తొలిగించాలని దిశానిర్దేశం చేశారు. ``ఎక్కడా గత ప్రభుత్వ పాలనకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించకూడదు. ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీసిన వారిని క్షమించొద్దు`` అని తేల్చి చెప్పారు. ఈ స‌మ‌యంలో స‌మావేశ మందిరం నిశ్శ‌బ్దం అయిపోవ‌డం గ‌మ‌నార్హం. అంద‌రూ మౌనంగా నిశ్చేష్టులై.. చంద్ర‌బాబు వంకే చూస్తూ.. ఉండిపోయారు. అంటే.. చంద్ర‌బాబు ఎంత ఆగ్ర‌హంతో ఈ మాటలు అని ఉంటార‌నేది ఆలోచించుకోవ‌చ్చు.