విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద
గతవారం భారీ వరదలతో కండ్రిగ, నున్న, వాంబే కాలనీ సహా ఆ చుట్టుపక్కల కాలనీలు వరదలో చిక్కుకుపోయాయి.
By: Tupaki Desk | 7 Sep 2024 7:39 AM GMTవిజయవాడలో వచ్చిన వరదలు వారం రోజులపాటు అక్కడి ప్రజలు నిద్ర లేకుండా చేశాయి. రాత్రికిరాత్రి చుట్టుముట్టిన వరదలతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు తరలాల్సి వచ్చింది. బుడమేరు వరద విజయవాడలో ఈ ప్రళయానికి కారణమైంది.
గతవారం భారీ వరదలతో కండ్రిగ, నున్న, వాంబే కాలనీ సహా ఆ చుట్టుపక్కల కాలనీలు వరదలో చిక్కుకుపోయాయి. ఈ వరదలకు కారణమైన బుడమేరు పేరు వింటేనే ఇప్పుడు అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. బెజవాడ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వచ్చిన భారీ వరదలతో ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. ఇంకా ఆ వరద నుంచి ఆ ఇళ్లను వీడనే లేదు.
అయితే.. విజయవాడను ఇప్పుడప్పుడే వరదలు వీడేలా కనిపిస్తలేవు. వర్షాలు తగ్గి, వరదలు తగ్గాయని కాస్త రిలీఫ్ అవుతున్న తరుణంలో.. మరోసారి వర్షాలు భయపెడుతున్నాయి. తాజాగా మరోసారి నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో జనం మళ్లీ ఆందోళనలో పడింది.
తాజాగా.. సింగ్‌నగర్, విద్యాధరపురం, భవనీపురం, రాజరాజేశ్వరిపేట, రూరల్ పరిధిలో అంబాపురం, జక్కంపూడి కాలనీ, రాయనపాడు, నైనవరంతోపాటు పలు గ్రామాల్లో అడుగు నుంచి రెండడుగుల మేర నీరు పెరిగింది. దీంతో మరోసారి ప్రజల్లో భయాందోళన మొదలైంది. అయితే.. వెలగలేరు హెడ్ రెగ్యులేటరీ పరిధిలో ఎలాంటి వరద లేదని తేలడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
అటు.. కృష్ణా జిల్లా పరిధిలోని బుడమనేరు మాత్రం మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరను మండలాల్లో తగ్గిన వరద.. గుడివాడ, నందివాడ, మండపల్లి మండల్లాలో ఉధృతమైంది. దీంతో అక్కడి ప్రజలు మరోసారి తలదాచుకునేందుకు పరుగులు పెట్టారు. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు వరదతో ముంచెత్తాయి. దేవుడా.. మొన్న వచ్చిన వరదలతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని, మరోసారి మాకు ఈ పరీక్ష ఏంటని జనం ఆక్రందనలు చేస్తున్నారు.