Begin typing your search above and press return to search.

వైఎస్సార్ పోయె.. ఎన్టీఆర్ వచ్చె!

ఎన్టీఆర్ అభిమానులే కాక సామాన్యులకు ఈ పేరుతో ప్రత్యేక అనుబంధం ఉంది.

By:  Tupaki Desk   |   19 Nov 2024 4:30 PM GMT
వైఎస్సార్ పోయె.. ఎన్టీఆర్ వచ్చె!
X

ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్ల పాలనలో జగన్ సర్కారు ఎన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకుందో లెక్కే లేదు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలిసి కూడా కొన్ని విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుని చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నారు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి. అలా తీవ్ర వివాదాస్పదం అయినా నిర్ణయాల్లో విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ఒకటి. దశాబ్దాల నుంచి ఈ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగుతోంది.

ఎన్టీఆర్ అభిమానులే కాక సామాన్యులకు ఈ పేరుతో ప్రత్యేక అనుబంధం ఉంది. అలాంటిది ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్సార్ పేరు పెట్టడం మెజారిటీ జనాలకు రుచించలేదు. వైఎస్ మీద గౌరవం ఉన్న వాళ్లు కూడా ఈ పేరు మార్పు విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. వైఎస్ డాక్టర్ కాబట్టి హెల్త్ యూనివర్శిటీకి ఆయన పేరు పెట్టామనే లాజిక్ జనాలకు రుచించలేదు.

ఐతే ఈ ఏడాది ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అనివార్యమని తేలిపోయింది. ఫలితాలు వచ్చిన రోజే.. యూనివర్సిటీ దగ్గర ఎన్టీఆర్ అభిమానులు వైఎస్ పేరును తొలగించేశారు. కానీ అధికారికంగా పేరు మార్పుకు కొంచెం సమయం పట్టింది. ఇలాంటివి పద్ధతి ప్రకారం చేయాల్సి ఉంటుంది. ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది. తాజాగా ప్రభుత్వం అసెంబ్లీలో హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుకు బిల్లు పెట్టి ఆమోదింపజేసుకుంది.

దీంతో ఒకప్పట్లాగే ఈ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగబోతోంది. దీంతో పాటుగా ప్రభుత్వం అసెంబ్లీలో పలు బిల్లులు పెట్టి ఆమోదింపజేసుకుంది. ఏపీ పంచాయితీరాజ్ సవరణ బిల్లు-2024, ఏపీ మునిసిపల్ చట్ట సవరణ బిల్లు, ఏపీ ఆయుర్వేదిక్-హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు, ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు, ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు.. ఇవన్నీ కూడా అసెంబ్లీలో ఆమోదం పొందాయి.