మమతకు డేంజర్.. బంగ్లాలోలా బెంగాల్ లో ప్రభుత్వంపై విద్యార్థి ఉద్యమం
నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ మెడికోలు, విద్యార్థి సంఘాలు రోజూ ఆందోళనలు చేస్తున్నాయి.
By: Tupaki Desk | 28 Aug 2024 2:30 AM GMTఅదేమీ దశాద్దాల చరిత్ర ఉన్న విద్యార్థి సంఘం కాదు.. అదేమీ సీపీఎం, టీఎంసీ, కాంగ్రెస్, బీజేపీ వంటి ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన విద్యార్థి విభాగం కాదు.. మొన్ననే పుట్టకొచ్చింది. కానీ.. ప్రభుత్వాన్ని పెకిలించేలా కనిపిస్తోంది. అదే పశ్చిమ బెంగాల్ లో ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న ‘పశ్చిమబంగ ఛాత్ర సమాజ్’. ఆర్జీ కర్ వైద్య కళాశాల యువ వైద్యురాలిపై హత్యాచారం ఘటనతో పుట్టకొచ్చిందీ సంఘం. వైద్యురాలిపై దారుణం బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ మెడికోలు, విద్యార్థి సంఘాలు రోజూ ఆందోళనలు చేస్తున్నాయి. వీటికి నాయకత్వం వహిస్తున్నది ‘పశ్చిమబంగ ఛాత్ర సమాజ్. ఇది కొత్త విద్యార్థి సంఘం కావడం గమనార్హం. ఇంతవరకూ ఈ సంఘం రిజిస్టర్డ్ కూడా కాలేదు.
మమత రాజీనామా డిమాండ్ తో..
రవీంద్ర భారతి విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చదువుతున్న ప్రబీర్ దాస్, కల్యాణీ వర్సిటీ స్టూడెంట్ శుభాంకర్ హల్దార్, రవీంద్ర ముక్త వర్సిటీ విద్యార్థి సయన్ లాహిరిలు ‘నబన్నా అభియాన్’ పేరుతో ఆందోళనలకు సారథ్యం వహిస్తున్నారు. ఏ పార్టీతోనూ సంబంధం లేదని, న్యాయం కోసం ఆందోళనలు అని చెబుతున్నారు. యువ వైద్యురాలికి న్యాయం జరగాలని, నిందితుడికి మరణశిక్ష విధించాలని, సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనేది వీరి డిమాండ్లు. చూస్తుండగానే వీరికి మద్దతు పెరుగుతోంది. దీంతో మంగళవారం తలపెట్టిన ఆందోళనలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయితే, ప్రజాదరణ పెరుగుతోంది. కాగా, జూనియర్ వైద్యులు.. ‘నబన్నా మార్చ్ (చలో సచివాలయం)’లో పాల్గొనడం లేదు. ఛాత్ర సమాజ్ తో తమకు సంబంధం లేదంటన్నారు. బుధవారం కోల్ కతాలో ర్యాలీకి పిలుపునిచ్చారు. గమనార్హం ఏమంటే. ఛాత్ర సమాజ్ కు ఆందోళనలకు బెంగాల్ ప్రతిపక్ష పార్టీ బీజేపీ మద్దతు ఇస్తోంది. లెఫ్ట్ పార్టీలు, ఇతర విద్యార్థి సంఘాలు మాత్రం దూరంగా ఉంటున్నాయి.
‘నబన్నా అభియాన్’ పేరుతో హావ్ డా నుంచి మొదలుపెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. సంతర్‌గాచి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు బారికేడ్లను లాగి పడేశారు. బద్దలుకొట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో లాఠీఛార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపి బాష్పవాయువు ప్రయోగించారు. కాగా, మార్చ్ జరిగే సమయంలో హింసకు కుట్ర పన్నారంటూ నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని కిడ్నాప్ చేశారంటూ బీజేపీ కీలక నేత సువేందు అధికారి ఆరోపించారు. పోలీసులు ఖండించగా.. ‘ఆ విద్యార్థుల కుటుంబాలు హైకోర్టుకు వెళ్లాయి. మమతా పోలీస్.. కోర్టులో కలుద్దాం’’ అంటూ సువేందు బదులివ్వడం గమనార్హం.
ప్రభుత్వం అప్రమత్తం..
విద్యార్థుల ఆందోళనలు ఎటు దారితీస్తాయోనని మమతా బెనర్జీ ప్రభుత్వం ముందుజాగ్రత్త పడుతోంది. కోల్ కతాలో 6 వేలమంది పోలీసులను మోహరించారు. 26 జిల్లాల కలెక్టర్లు బాధ్యతలు అప్పగించారు. హేస్టింగ్స్ లోని ఫోర్ట్ విలియం గేట్లకు గ్రీజ్ పూశారు. పాఠశాలలకు సెలవులు ఇచ్చారు.