Begin typing your search above and press return to search.

మాటకందని విషాదం.. రైల్వే స్టేషన్‌లో ఘోరం

అంత పెద్ద సంస్థలో సేఫ్టీ కరువైందని మరోసారి ఈ ఘటన రుజువు చేసింది.

By:  Tupaki Desk   |   10 Nov 2024 6:36 AM GMT
మాటకందని విషాదం.. రైల్వే స్టేషన్‌లో ఘోరం
X

ఊహకు అందని విషాదం.. మాటల్లో చెప్పలేని ఘోరం.. లోకో పైలట్ నిర్లక్ష్యం వల్ల ఓ ఉద్యోగి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. రైలు ఇంజిన్, కోచ్ మధ్యలో నలిగిపోవాల్సి వచ్చింది. ఘటనను చూస్తేనే కన్నీళ్లు పుట్టుకొస్తున్న ఈ హృదయవిదారక ఘటన బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లా బరౌనీ రైల్వే జంక్షన్‌లో జరిగింది.

దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ రైల్వే. అంత పెద్ద సంస్థలో సేఫ్టీ కరువైందని మరోసారి ఈ ఘటన రుజువు చేసింది. అంతేకాదు.. ఈ మధ్య ఎక్కడో ఒకచోట రైల్వే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. వందల సంఖ్యలో గాయపడుతున్నారు. అయితే.. రోజురోజుకూ పుట్టుకొస్తున్న టెక్నాలజీని వినియోగించడంలో రైల్వే శాఖ విఫలం అవుతున్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి.

తాజాగా.. బరౌనీ రైల్వే జంక్షన్‌లో జరిగిన ఈ ఘోరం మరోసారి నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. అరుణ్ కుమార్ రౌత్ అనే వ్యక్తి ఈ జంక్షన్‌లో షంట్ మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. రైలు ఇంజిన్, పార్సెల్ వ్యాన్ బోగీ మధ్య కప్లింగ్‌ను జత చేస్తుండగా.. లోకో పైలట్ ఒక్కసారిగా రైలు ఇంజిన్‌ను వెనక్కి తీసుకొచ్చారు. దీంతో అరుణ్ ఇంజిన్, బోగీ మధ్య చిక్కుకుపోయాడు. అప్పటికే అక్కడి ప్రయాణికులు పెద్ద ఎత్తున కేకలు వేశారు. కానీ.. లోకో పైలట్ కనీసం ఇంజిన్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయకుండా దిగి పారిపోయాడు. దీంతో విలవిల్లాడుతూ అందరి ముందే అరుణ్ ప్రాణాలు కోల్పోయారు. లక్నో-బరౌనీ ఎక్స్‌ప్రెస్ రైలు బరౌనీ స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్ 5కు చేరుకున్న సమయంలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.

ఈ దుర్ఘటనను ప్రయాణికులు తమ సెల్‌ఫోన్లలో బంధించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానిని చూసిన వారంతా అయ్యో.. పాపం అంటూ కన్నీళ్లు కారుస్తున్నారు. మరోవైపు.. లోకో పైలట్ నిర్లక్ష్యం వల్లే అరుణ్ చనిపోవాల్సి వచ్చిందని ప్రయాణికులు అంటున్నారు. కాగా.. ఈ ఘటనపై రైల్వే శాఖ అధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఆ తదుపరి ఇంజిన్‌ను ముందుకు తీసి మృతదేహాన్ని బయటకు తీశారు. మరోవైపు.. రైల్వే శాఖ నిర్లక్ష్యంపై నెటిజన్లు సైతం ఫైర్ అవుతున్నారు.