వైరల్ వీడియో... రెండు వాహనాలు ఢీకొన్న గొడవ విలువ నిండు ప్రాణమా?
మనిషిలో మానవత్వం ఛాయలు తగ్గిపోతూ.. ఆ స్థానంలో రాక్షసత్వం తాలూకు లక్షణాలు దర్శనమిస్తున్నాయని చెబుతున్నారు.
By: Tupaki Desk | 15 Oct 2024 7:30 PM GMTమనిషి.. తాను మనిషి అన్న సృహ కోల్పోతున్న దశకు చేరిపోయామని అంటుంటారు వేదాంతులు! ప్రతీ చిన్న విషయానికి ఎక్కడలేని ఆగ్రహావేశాలు తెచ్చేసుకోవడం.. ఒకరిపై కోపం వస్తే దాన్ని ఎంత వరకూ చూపించొచ్చో అనే సృహ లేకపోవడం వంటివాటి వల్ల ఊహించని పరిణామాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.
మనిషిలో మానవత్వం ఛాయలు తగ్గిపోతూ.. ఆ స్థానంలో రాక్షసత్వం తాలూకు లక్షణాలు దర్శనమిస్తున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ముంబైలో జరిగిన ఘటన పైన చెప్పుకున్న వాటికి బలం చేకూర్చేలా ఉంది. రెండు వాహనాలు ఢీకొన్ని చిన్న వివాదం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకొంది.
అవును... బాబా సిద్ధిఖ్ హత్యతో ఉలిక్కిపడిన ముంబైలో తాజాగా మరో ఘోరం తెరపైకి వచ్చింది. రెండు వాహనాలు ఢీకొన్న చిన్న వివాదం ఏకంగా ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ సమయంలో ముంబైలోని శాంతిభద్రతలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.
వివరాళ్లోకి వెళ్తే... శనివారం మహారాష్ట్ర నవనిర్మాన సేన కార్యకర్త ఆకాశ్ మీన్ (28).. తన తల్లితండ్రులతో కలిసి ఇంటి నుంచి కారులో బయటకు వెళ్లారు. ఆ సమయంలో మార్గమధ్యలో ఓ ఆటో డ్రైవర్ ఓవర్ టేక్ చేసే క్రమంలో ఆకాశ్ కారును ఢీకొట్టాడు. దీంతో... వారి మధ్య వివాదం చెలరేగింది. పరస్పరం వాగ్వాదం జరిగింది.
అయితే... అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయిన ఆటోడ్రైవర్ తన స్నేహితులకు విషయం చెప్పి.. పదుల సంఖ్యలో తన వెంట తీసుకొని వచాడు. అనంతరం ఆకాష్ కారును గుర్తించి.. దాన్ని ఆపి.. అతనిపై దాడికి దిగారు. సదరు ఆటో డ్రైవర్ కు మద్దతుగా వచ్చిన బ్యాచ్ అంతా ఆకాశ్ మీన్ పై పడి విచక్షణా రహితంగా పిడి గుద్దులు గుద్దుతూ, తన్నుతూ గాయపరిచారు.
ఈ సమయంలో కుమారుడిపై పడి దాడి చేస్తున్న వాళ్లను ఆపడానికి తల్లితండ్రులు చేసిన ప్రయత్నం కంటతడి పెట్టించిందని చెబుతున్నారు. ఈ సమయంలో ఆకాశ్ తండ్రి కూడా తీవ్రంగా గాయపడ్డారు. విచక్షణా రహితంగా దాడి చేసిన అనంతరం సదరు ఆటో డ్రైవర్, అతని కూడా వచ్చిన గ్యాంగ్ అక్కడ నుంచి వెళ్లిపోయారు.
అనంతరం తీవ్రంగా గాయపడిన ఆకాశ్ మీన్ ను స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే... చికిత్స పొందుతూ ఆకాశ్ మరణించినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను ఆరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారిపై హత్య, దాడి, ఇతర నేరాలకు సంబంధించిన సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు!