Begin typing your search above and press return to search.

పవన్ ఎఫెక్ట్ రూట్ మార్చిన బియ్యం స్మగ్లర్లు

కోళ్ల దాణాకు ప్రధానంగా వాడే మొక్కజొన్న రేటు విపరీతంగా పెరిగిపోవడంతో రేషన్ బియ్యాన్ని నూకగా మార్చి కోళ్లకు దాణాగా వేస్తున్నట్లు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   25 Dec 2024 11:30 AM GMT
పవన్ ఎఫెక్ట్ రూట్ మార్చిన బియ్యం స్మగ్లర్లు
X

రేషన్ బియ్యం అక్రమణ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దెబ్బతో మిల్లర్లు బియ్యం కొనుగోళ్లు ఆపేసినా, డీలర్లు మాత్రం తమ అక్రమ వ్యాపారానికి ఫుల్ స్టాప్ పెట్టడం లేదట.. మిల్లర్లు కొనకపోయినా, కార్డుదారుల నుంచి బియ్యం తీసుకుంటున్న వ్యాపారులు పీడీఎస్ బియ్యాన్ని పౌల్ట్రీ ఫాంలకు తరలిస్తున్నారని సమాచారం. అక్కడ బియ్యాన్ని కోళ్ల దాణాగా వాడుతున్నట్లు తెలుస్తోంది. కోళ్ల దాణాకు ప్రధానంగా వాడే మొక్కజొన్న రేటు విపరీతంగా పెరిగిపోవడంతో రేషన్ బియ్యాన్ని నూకగా మార్చి కోళ్లకు దాణాగా వేస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేస్తున్న బియ్యం పక్కదారి పడుతోందని గుర్తించిన ప్రభుత్వం, బియ్యం అక్రమ రవాణా అడ్డుకోడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాకినాడ కేంద్రంగా విదేశాలకు ఎగుమతి అవుతున్న రేషన్ బియ్యంపై ఫోకస్ పెట్టింది. జులైలో కాకినాడలో పర్యటించిన సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ అక్కడ కొన్ని గొడౌన్లలో నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. ఆ తర్వాత ఈ వ్యవహారంపై విచారణ చేయగా, రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పక్క రాష్ట్రాల నుంచి రేషన్ బియ్యం పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి అవుతున్నట్లు తేలింది. దీనికి కాకినాడ ప్రధాన కేంద్రంగా గుర్తించింది. ఇక దీనిపై సీరియస్ అయిన డిప్యూటీ సీఎం పవన్ నేరుగా రంగంలోకి దిగి సముద్రంలో లోడ్ చేసిన నౌకను సీజ్ చేయమని ఆదేశించడం తెలిసిందే. పవన్ ఆదేశాలు అమలు కాకపోయినా, విదేశాలకు ఎగుమతి చేయాల్సిన రేషన్ బియ్యాన్ని మాత్రం షిప్ నుంచి దించేయాల్సివచ్చింది. పైగా, కాకినాడతోపాటు రాష్ట్రంలోని మిగిలిన పోర్టుల్లోనూ బియ్యం నిల్వలను తనిఖీ చేసి రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ పరిస్థితుల్లో రిస్కు ఎందుకని భావించిన మిల్లర్లు రేషన్ బియ్యం కొనుగోలు చేయకూడదని నిర్ణయించినట్లు సమాచారం.

ప్రభుత్వ నిర్బంధంతో మిల్లర్లు వెనక్కి తగ్గినా, క్షేత్ర స్థాయిలో డీలర్లు, దళారులు మాత్రం రేషన్ బియ్యం కొనుగోలును ఆపడం లేదు. ప్రజలే స్వచ్ఛందంగా విక్రయిస్తుండటం వల్ల లాభాలు రుచిమరిగిన డీలర్లు, వ్యాపారులు యథావిధిగా బియ్యం కొనుగోలు చేస్తూ వాటిని తక్కువ లాభాలకు పౌల్ట్రీ ఫాంలకు తరలిస్తున్నట్లు చెబుతున్నారు. కిలో 20 రూపాయలకు కొనుగోలు చేస్తున్న పౌల్ట్రి నిర్వాహకులు బియ్యంను పిండిగా నూకగా మార్చి కోళ్లకు ఆహారంగా పెడుతున్నట్లు చెబుతున్నారు. మరికొందరు ఇతర దాణాతో మిక్స్ చేస్తున్నారని అంటున్నారు. దీంతో బియ్యం ఎగుమతులు నిలిచినా, అక్రమ వ్యాపారం మాత్రం ఆగలేదని చెబుతున్నారు. కోళ్లకు దాణాగా వేసే మొక్కజొన్న రేటు విపరీతంగా పెరిగిపోవడంతో పౌల్ట్రి నిర్వాహకులు కూడా బియ్యం కొనుగోలుకు ముందుకు వస్తున్నారంటున్నారు.