Begin typing your search above and press return to search.

అధ్యక్షుడి మెడకు చుట్టుకున్న సతీమణి 'బ్యాగు'.. దిగిపోవాల్సిందే

ఆ మధ్య ఓ నైట్ పార్టీలో తొక్కిసలాట మరణాలతో వార్తల్లో నిలిచింది.

By:  Tupaki Desk   |   6 Dec 2024 5:30 PM GMT
అధ్యక్షుడి మెడకు చుట్టుకున్న సతీమణి బ్యాగు.. దిగిపోవాల్సిందే
X

గత మంగళవారం రాత్రి అనూహ్యంగా కొరియాలో ఎమర్జెన్సీ అంటూ అందరూ ఉత్తర కొరియా గురించి అనుకున్నారు. అక్కడి నియంత కిమ్ పాలనలో ఇది సహజమే కదా? అని భావించారు. కానీ, తీరా విషయం తెలిసి ఔరా అనుకున్నారు. డెవలప్ మెంట్ కు ప్రాధాన్యం ఇచ్చే, రాజకీయ అస్థిరతకు అవకాశం లేని దక్షిణ కొరియాలో ఇలా జరగడం ఏమిటా? అని ఆశ్చర్యపోయారు. ఇప్పటివరకు మనకు దక్షిణ కొరియా పారిశ్రామిక ఉత్పత్తుల గురించే తెలుసు. ఆ మధ్య ఓ నైట్ పార్టీలో తొక్కిసలాట మరణాలతో వార్తల్లో నిలిచింది. తాజాగా ఎమర్జెన్సీతో సంచలనమైంది. దీనంతటికీ ఏం జరిగిందంటే?

కొంపముంచిన భార్య బ్యాగ్‌

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ పదవీ గండంలో చిక్కుకున్నారు. ఆయనకు అభిశంసన తప్పేలా లేదు. ఓ విధంగా చెప్పాలంటే పదవి దిగిపోక తప్పేలా లేదు. ఇప్పటికే ఓసారి ఆయన వివాదాల్లో నిలిచారు. దీనికి కారణం యోల్ భార్య అందుకున్న బ్యాగు. దేశ రాజకీయాలను కుదిపేసిన ఈ అంశం యోల్ ప్రతిష్ఠను మసకబార్చింది.

యోల్‌ భార్య కిమ్ కియోన్‌ హీ. ఓ రెండేళ్ల క్రితం పాస్టర్‌ చాయ్‌ జే యంగ్‌ నుంచి డియోర్‌ బ్యాగ్‌ ను పొందారు. బహుమతిగానే వచ్చినా దీని విలువ దాదాపు రూ.2 లక్షలు (2250 డాలర్లు). అయితే, కియోన్ కు బహుమతి ఇచ్చిన పాస్టర్ ఉత్తర కొరియాపై దక్షిణ కొరియా అధ్యక్షుడి కఠిన వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు.

ఆయన బ్యాగును కియోన్ కు ఇస్తున్న ఫొటోలు నిరుడు నవంబరులో బయటకు వచ్చాయి. వాస్తవానికి 2022లోనే ఆఇమె కార్యాలయానికి వెళ్లి మరీ బ్యాగ్ ఇచ్చాడు.

ఆమె అభ్యంతరం అయినా..

వాస్తవానికి పాస్టర్ బ్యాగ్ ఇస్తున్నప్పుడు ఇలాంటి ఖరీదైనవి నాకెందుకు? అంటూ కియోన్ అభ్యంతరం తెలిపారు. అయితే, ఆ పాస్టర్ తన చేతిలోకి వాచీకి ఉన్న సీక్రెట్ కెమెరాతో రికార్డ్‌ చేశాడు. కొంత కాలం తర్వాత ఈ వీడియో వామపక్ష వెబ్ సైట్‌ లో వచ్చింది. ఇదే సమయంలో అధ్యక్ష దంపతులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కియోన్ కు లంచం ఇచ్చారని.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇలా చేశారనే విమర్శలు మొదలయ్యాయి.

750 డాలర్ల మొత్తం మించొద్దు..

దక్షిణ కొరియా చట్టాల ప్రకారం.. ఒకేసారి 750 అమెరికన్ డాలర్లు లేదా ఏడాదిలో 2,200 డాలర్ల విలువైన బహుమతులను స్వీకరించకూడదు. అందుకనే కియోన్ వ్యవహారం సంచలనంగా మారింది. మరోవైపు ఆమెకు వచ్చిన బహుమతిని ప్రభుత్వ ఆస్తి కింద భద్రపరిచినట్లు అధ్యక్ష్య కార్యాలయం తెలిపింది. ఇప్పటికే జూలైలో కియోన్ ను 12 గంటల పాటు విచారించారు. లంచం కింద బ్యాగ్ ను తీసుకున్నారని నిరూపణ కాలేదు.

వ్యతిరేకతను తట్టుకునేందుకు..

అసలే కియోన్ బ్యాగు వివాదం పట్ల ప్రతిపక్షాలు వెంటాడుతుంటే.. అనూహ్యంగా అధ్యక్షుడు ‘మార్షల్‌ లా’ ప్రకటించడం మరింత దుమారం రేపింది. ప్రతిపక్షాల టార్గెట్ గా.. అవి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ అధ్యక్షుడు యోల్‌ ‘ఎమర్జెన్సీ మార్షల్‌ లా’ విధించారు. కియోన్ పై ఆరోపణతో దక్షిణ కొరియా ప్రజల్లో అధ్యక్షుడిపై వ్యతిరేకత ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ప్రతిపక్షాలు పార్లమెంటులో ఓటింగ్‌ పెట్టి అత్యవసర స్థితికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించారు. దీంతో అధ్యక్షుడు వెనక్కుతగ్గారు.

దిగిపోవాల్సిందే..

ఈ పరిణామాల రీత్యా యోల్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. అభిశంసనకు సిద్ధం అవుతున్నాయి. యోల్ కు సొంత పార్టీ నుంచి కూడా మద్దతు తగ్గింది. అధ్యక్షుడి రాజ్యాంగ హక్కుల్లో కోతకు కూడా అధికార పార్టీ ఓకే చెప్పింది. దీంతో యోల్ ను దించేయడం ఖాయం అనిపిస్తోంది.