వైసీపీ నీడ...ఆ మంత్రులకు బెడద ?
అయితే వారిలో ఇపుడు చాలా మంది మీద కూటమిలోనే ఒకింత అసంతృప్తి అయితే ఉందని అంటున్నారు.
By: Tupaki Desk | 30 Dec 2024 4:30 AM GMTవైసీపీ నుంచి టీడీపీలోకి చివరి నిముషంలో వచ్చి చేరిన వారు చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు. కొంతమంది మరింత లక్ కలసి మంత్రులుగా కూడా అయ్యారు. అయితే వారిలో ఇపుడు చాలా మంది మీద కూటమిలోనే ఒకింత అసంతృప్తి అయితే ఉందని అంటున్నారు.
అధినాయకత్వం కూడా మంత్రులుగా వారి పనితీరుని బేరీజు వేస్తున్నపుడు పెదవి విరుపులే వినిపిస్తున్నాయని అంటున్నారు. ఇక వారి పూర్వాశ్రమం తో పాటు ప్రస్తుత పోకడల వల్ల కూడా మంత్రులుగా మంచి మార్కులు వారికి పడడం లేదని అంటున్నారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్న 24 మంది మంత్రులలో దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మంత్రులు కొత్తవారే ఉన్నారు. వారిలో అనూహ్యంగా మంత్రులు అయిన వారు విజయనగరం జిల్లా నుంచి కొండపల్లి శ్రీనివాస్, అలాగే తూర్పు గోదావరి జిల్లా నుంచి వాసంశెట్టి సుభాష్, కడప నుంచి మండిపల్లి రాం ప్రసాదరెడ్డి ఉన్నారు.
ఈ ముగ్గురూ కూడా గతంలో వైసీపీలో ఉన్నారు. అయితే వారిలో కొండపల్లి మీద లేటెస్ట్ వివాదం ఏమిటి అంటే ఆయన సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు పాదాభివందనం చేశారు అని. దాని మీద కొండపల్లి క్లారిటీ ఇచ్చేశారు.తాను అభివాదం మాత్రమే చేశాను తప్ప మరేమీ కాదని అన్నారు. అయినా అది సద్దుమణగలేదు. మరో వైపు విజయనగరంలో వైసీపీ అధిపత్యమే ఇంకా కొనసాగుతోందని కూడా కూటమిలో అసంతృప్తి ఉందని అంటున్నారు.
ఇక గోదావరి జిల్లాకు చెందిన మంత్రి సుబాష్ విషయం తీసుకుంటే ఆయన చుట్టూ అంతా వైసీపీ వారే ఉండి లబ్ది పొందుతున్నారు అన్న ఆరోపణల నేపథ్యంలో హై కమాండ్ ఆయన విషయంలో చెప్పాల్సింది చెప్పిందని ఆయన కూడా సర్దుకున్నారు అంటున్నారు. అయినా సరే ఆయన మీద కూడా కూటమిలో కొంత అసంతృప్తి అయితే ఉందని అంటున్నారు. ఇక మండిపల్లి రాం ప్రసాదరెడ్డి కడప జిల్లాలో మంత్రి. అక్కడ వైసీపీ ఓటమి చెందినా రాజకీయ ఆధిపత్యం చేస్తూనే ఉంది. దానిని ఎదుర్కోవడంలో ఆయన దూకుడు చేయడం లేదని విమర్శలు చేస్తున్నారు.
ఇక మరో సీనియర్ నేత మంత్రి కొలుసు పార్ధసారధి కూడా చివరి నిముషంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి టికెట్ సంపాదించిన వారే. ఆయన పెనమలూరు నుంచి నూజివీడు వచ్చి మరీ వైసీపీ కంచుకోటలో విజయం సాధించారు.
అయితే ఇటీవల సర్దార్ గౌతు లచ్చన్న పేరిట విజయవాడలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొనడంతో ఆయన కూడా ఇబ్బంది పడ్డారు. దాని మీద వివరణ కూడా ఇచ్చారు. వైసీపీని వీడిన తరువాత ఆ పార్టీ నేతలతో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ కూడా ఇచ్చారు.
ఇదంతా ఎందుకు అంటే ఒక వైపు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అన్న వార్తలు వస్తున్న క్రమంలో ఈ విధంగా వైసీపీ నీడ కొందరి మంత్రులను వెంటాడుతోందని అంటున్నారు. దాంతో వారిలో ఎవరి పదవులకు కత్తెర పడుతోంది అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.