Begin typing your search above and press return to search.

చంద్రబాబు పిలుపు కోసం వెయిటింగ్...!

అలాగే టీడీపీ చేసిన కొత్త ముఖాల ప్రయోగం వల్ల సీట్లు కొందరికి దక్కలేదు.

By:  Tupaki Desk   |   3 April 2024 4:04 AM GMT
చంద్రబాబు  పిలుపు కోసం వెయిటింగ్...!
X

ఒక్క మాట అధినేతతో చెప్పుకోవాలని వెయిటింగ్. ఆయన న్యాయం చేస్తారని ఆశ. అలా ఉత్తరాంధ్రా జిల్లాలలో పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. వారికి పొత్తులో భాగంగా సీట్లు దక్కలేదు. అలాగే టీడీపీ చేసిన కొత్త ముఖాల ప్రయోగం వల్ల సీట్లు కొందరికి దక్కలేదు.

వారంతా టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి పిలుపు వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే పాతపట్నం సీటు ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ చంద్రబాబు పిలుపు కోసం చూస్తున్నారు. ఆయన ఆశించిన సీటుని మామిడి గోవిందరావుకు ఇచ్చేశారు.

దాంతో కలమట భారీ ర్యాలీ తీసి తన బలాన్ని చూపించారు. హై కమాండ్ పిలిస్తే వెళ్తాను లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అని అంటున్నారు. ఇక శ్రీకాకుళం అసెంబ్లీ సీటు ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆమె భర్త గుండ అప్పల సూర్యనారాయణ కూడా బాబు నుంచి హామీ తీసుకోవాలని చూస్తున్నారు. ఈ సీటుని గోండు శంకర్ కి ఇచ్చేశారు. దాంతో గుండ దంపతులు ఫైర్ అవుతున్నారు.

విజయనగరం జిల్లాలో చూస్తే నెల్లిమర్ల సీటు దక్కని రెండు ప్రధాన టీడీపీ వర్గాలు గుర్రు మంటున్నాయి. మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు. అలాగే నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి కర్రోతు బంగార్రాజు కూడా సీటు కోసం ఫైట్ చేస్తూనే ఉన్నారు. అది రాలేదు. కానీ కచ్చితమైన హామీ కోసం వారు పట్టుబడుతున్నారు.

అదే విధంగా ఎస్ కోట సీటు ఆశించిన ఎన్నారై గొంప క్రిష్ణ తనకే సీటు ఇవ్వాలని అంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబు పిలిస్తే మాట్లాడుతాను అని అంటున్నారు. లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేయడం ఖాయమని అంటున్నారు. విజయనగరం అసెంబ్లీ సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కూడా ఇండిపెండెంట్ గా పోటీకి తయారు అవుతున్నారు. ఆమె సైతం బాబు పిలుపు కోసం చూస్తున్నారు.

గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు, అలాగే సాలూరు మాజీ ఎమ్మెల్యే భంజ్ దేవ్ వంటి వారు కూడా బాబు ఒక్క మాట చెప్పాలని అంటున్నారు. విశాఖ జిల్లా విషయానికి వస్తే మాడుగుల నుంచి ఇద్దరు ఆశావహులు ఉన్నారు. అందులో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు తనకు సీటు దక్కలేదని ఆవేదనతో ఉన్నారు గోడు చంద్రబాబుతో చెప్పుకోవాలని చూస్తున్నారు. లేని పక్షంలో ఇండిపెండెంట్ గా పోటీకి రెడీ అవుతున్నారు. నియోజకవర్గం ఇంచార్జి పీవీజీ కుమార్ కూడా అధినాయకత్వం మీద ఫైర్ అవుతున్నారు.

చోడవరం నియోజకవర్గంలో ఆశావహులు కూడా చంద్రబాబుతో భేటీ కోరుకుంటున్నారు. తమకు పోటీ చేసే అవకాశం ఇప్పించాలని ప్రకటించిన అభ్యర్థి రాజుని తప్పించాలని కోరుతున్నారు. మాజీ మంత్రి పెందుర్తి సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి అయితే బాబు నుంచి పిలుపు వస్తే చూద్దామని అంటున్నారు.

ఏజెన్సీలో పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. అలాగే అరకు అసెంబ్లీ సీటు ఆశించిన నాయకులు కూడా బాబుని కలసి న్యాయం చేయాలని కోరడానికి సిద్ధపడుతున్నారు. బాబు నో అన్నా లేక వేరే హామీ ఇచ్చినా వీరు ఏ విధంగా స్పందిస్తారు అన్నది చూడాల్సి ఉంది.