ఎర్రమట్టి వెనుక 'లోగుట్టు'.. కదిలితే ఇబ్బందే!
అయితే.. కొన్ని దశాబ్దాలుగా ఉన్న ఎర్రమట్టి దిబ్బల వ్యవహారం ఇప్పుడే ఎందుకు తెరమీదికి వచ్చింది?
By: Tupaki Desk | 16 July 2024 9:30 AM GMTప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన వ్యవహారం.. విశాఖపట్నం జిల్లాలోని భీమిలి నియోజకవ ర్గంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు. ఇవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయి. వీటి ద్వారా.. వర్షపు నీరు భూమిలోకి ఇంకుతోంది. తద్వారా.. పర్యావరణానికి మేలు జరుగుతోంది. అయితే.. కొన్ని దశాబ్దాలుగా ఉన్న ఎర్రమట్టి దిబ్బల వ్యవహారం ఇప్పుడే ఎందుకు తెరమీదికి వచ్చింది? అంటే.. వీటిని కొందరు చదును చేస్తున్నారు. ఇక్కడి మట్టిని ఎవరూ తవ్వి తీసుకువెళ్లడం లేదు.(దీనిని గమనించాలి).
అయితే.. అలా చదును చేయడం కూడా.. నేరమే. రుషి కొండను చదును చేసి విల్లా కట్టినప్పుడు.. ఎవరూ ఊరుకోలేదు కదా?! సహజ సిద్దంగా ఏర్పడిన కొండను ఎలా తవ్వేస్తారని.. అందరూ ప్రశ్నించారు.. కోర్టు లు చీవాట్లు కూడా పెట్టాయి. అలానే ప్రకృతి సిద్ధంగా ఏర్పడి పర్యావరణానికి మేలు చేస్తున్న ఎర్రమట్టి దిబ్బల విషయం కూడా అంతే! వాటిని పరిరక్షించాలే తప్ప.. వాటి జోలికి వెళ్లలేదు. అందుకే.. గతంలో వైసీపీ నాయకులు విశాఖలో ఎన్ని పనులు చేసినా.. ఈ ఎర్రమట్టి దిబ్బల జోలికి మాత్రం పోలేదు.
మరి ఇప్పుడు ఏమైంది?
ఇప్పుడు కూడా.. ఎవరూ ఎర్రమట్టి దిబ్బలను దోచుకోవడం లేదు. కాకపోతే.. చదును చేస్తున్నారు. దిబ్బల ను నేలమట్టం చేస్తున్నారు. దీనికి లారీలను, జేసీబీలను వినియోగిస్తున్నారు. దీనికి కారణం.. టీడీపీలో కీలక నాయకుడికి చెందిన వ్యవహారం ఒకటి లోగుట్టుగా ఉంది. గతంలో ఈ భూములను(అంటే ఎర్రమట్టి దిబ్బలు ఉన్న ప్రాంతం) `భీమునిపట్నం ఎయిడెడ్ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ`కి కేటాయించారు. ఇది జరిగి రెండు దశాబ్దాలు అయింది. అయితే.. తర్వాత.. ఆయా భూముల్లో నిర్మాణాలకు అధికారులు ఒప్పుకోలేదు.
దీంతో 2014-19 మధ్య కూడా సొసైటీ ఏర్పాటుకు ఫైళ్లు ముందుకు కదిలాయి. కానీ, దీనిపై విశాఖకు చెందిన ఓ వైసీపీ నాయకుడు అప్పట్లో కోర్టుకు వెళ్లారు. దీంతో ఈ వ్యవహారం.. హైకోర్టు పరిధిలో ఉంది. ప్రస్తుతం విచారణ దశలో ఉన్నట్టు తెలిసింది. అయితే.. గత ఐదేళ్లు మౌనంగా ఉన్న ఈ వ్యవహారంలో ఇప్పుడు కూటమి సర్కారు వచ్చాక.. అనూహ్యంగా కదలిక వచ్చింది. ఈ క్రమంలో సొసైటీ ఇళ్ల ప్లాట్లకు అనువుగా, లారీలు తిరిగేందుకు వీలుగా దిబ్బలను చదును చేస్తూ.. రోడ్లు వేస్తున్నారు. ఇదీ.. సంగతి!!