Begin typing your search above and press return to search.

బీజేపీ ప్లాన్ బీ...జగన్ కి హుషారేనా ?

భారతీయ జనతా పార్టీ అంతకు ముందు ఎలా ఉన్నా బీజేపీ ఈ ఇద్దరు నేతృత్వంలోకి వచ్చాక దూకుడు పెంచింది.

By:  Tupaki Desk   |   28 Jun 2024 11:30 PM GMT
బీజేపీ ప్లాన్ బీ...జగన్ కి హుషారేనా ?
X

కేంద్రంలో నరేంద్ర మోడీ అమిత్ షాల సారధ్యంలోని బీజేపీది అంతా అప్ టు డేట్ పాలిటిక్స్. భారతీయ జనతా పార్టీ అంతకు ముందు ఎలా ఉన్నా బీజేపీ ఈ ఇద్దరు నేతృత్వంలోకి వచ్చాక దూకుడు పెంచింది. ఒక విధంగా పరుగులే మొదలెట్టింది.

వరసగా మూడుసార్లు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం అంటే మామూలు విషయం కాదు. అందులో తొలి రెండు సార్లు పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన పార్టీ మూడవసారి మ్యాజిక్ ఫిగర్ కి 32 సీట్ల దూరంలో ఉండిపోయింది. నిజానికి 240 బిగ్ నంబర్. బీజేపీ పదేళ్ల పాటు అధికారంలో ఉంటూ కూడా యాంటీ ఇంకెంబెన్సీని చేదించి ఈ నంబర్ ని సాధించినడం అంటే మామూలు విషయం కాదు.

అది కూడా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అత్యధిక ఎంపీలు ఇచ్చే యూపీ బీజేపీకి హ్యాండ్ ఇచ్చినా గెలిచి మూడవసారి మోడీ ప్రధాని కావడం అంటే రికార్డు అని అంటున్నారు. ఇలా బీజేపీ కొత్త ప్లాన్స్ తో ముందుకు వెళ్లడం వల్లనే సాధ్యపడింది అని అంటున్నారు. బీజేపీ చూపు అంతా ఇక మీదట సౌత్ మీదనే ఉండబోతోంది అని అంటున్నారు.

కేరళలో ఒక ఎంపీతో బోణీ కొట్టింది. తమిళనాడులో గెలవకపోయినా ఎన్నడూ లేని విధంగా 18 శాతం ఓటు షేర్ ని తాజా ఎంపీ ఎన్నికల్లో సాధించింది. ఇక కర్నాటకలో ఎటూ పాగా వేసి ఉంది. ఈసారి కూడా మెజారిటీ ఎంపీ సీట్లు దక్కించుకుంది. తెలంగాణలో అధికారానికి దగ్గరలో ఉన్నట్లుగానే భావిస్తోంది. ఎనిమిది ఎంపీ సీట్లు అంటే అసెంబ్లీ సీట్లతో కన్వర్ట్ చేసుకుంటే 56 నంబర్ వస్తుంది 60 ఎమ్మెల్యేలు గెలిస్తే సీఎం సీటు ఆ పార్టీదే అన్న భావన ఉంది. అలా 2028 ప్లాన్ లో బీజేపీ ఉంది.

ఏపీలోనూ బీజేపీ కొత్త ఆశలతో ముందుకు సాగుతోంది. ఏపీలో బీజేపీకి మూడు ఎంపీ సీట్లు దక్కాయి. అంటే 21 ఎమ్మెల్యే సీట్లు అన్న మాట. అదే సమయంలో విభజన ఏపీలో 8 ఎమ్మెల్యే సీట్లూ వచ్చాయి. బీజేపీ ఏపీలో ఎన్డీయే కూటమిలో ఉంది. జనసేన టీడీపీతో మంచి స్నేహం కొనసాగుతోంది.

అయితే ఏపీలో అధికారం దిశగా బీజేపీ ఆలోచనలు ఉన్నాయి. తన బలాన్ని మరింతగా విస్తరించుకునేందుకు రానున్న అయిదేళ్ళలో బీజేపీ చూస్తుంది అని అంటున్నారు. అదే విధంగా కేంద్రంలో తన ప్రభుత్వ సుస్థిరతకు భంగం వాటిల్లకుండా ప్లాన్ బీ తో బీజేపీ ఉంది అని అంటున్నారు. బీజేపీ తెలుగుదేశం రెండూ నమ్మకంగా అడుగులు వేస్తున్నాయి. అయితే రాజకీయాలు ఎపుడూ ఒకే విధంగా ఉండవు.

ఒకవేళ ఏమైనా జరిగినా తన మద్దతు పార్టీలను పెంచుకుని అధికారంలో అయిదేళ్లు ఉండే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది. అందుకే అవసరం లేకపోయినా స్పీకర్ ఎన్నికల్లో వైసీపీ మద్దతు కోరింది అని అంటున్నారు. అలాగే వైసీపీ మనసును తెలుసుకునే ప్రయత్నం చేసింది అంటున్నారు. వైసీపీ కూడా బీజేపీకి మద్దతు ఇవ్వడానికే ముందుకు వచ్చింది.

ఇది కేవలం స్పీకర్ ఎన్నిక వరకే పరిమితమని ఎవరూ అనుకోవడం లేదు. భవిష్యత్తు అవసరాలనే దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఆ విధంగా పావులు కదిపింది అని అంటున్నారు ఎంత ఘోరంగా ఓటమి పాలు అయినా నలభై శాతం ఓటింగ్ కోటీ 33 లక్షల ప్రజల మద్దతు వైసీపీకి ఉంది అన్నది కూడా బీజేపీ ఆ పార్టీ మద్దతు తీసుకోవడానికి కారణం అవుతోంది అంటున్నారు

అంతే కాకుండా రాజ్యసభ అవసరాలు ఉన్నాయి. 2029 దాకా కూడా వైసీపీకి ఎంపీలు ఉంటారు. సో ఈ విధంగా బీజేపీ ప్లాన్ బీలో భాగమే ఎన్డీయే బయట మిత్రులను చేరదీయడం అని అంటున్నారు. బీజేపీ వైసీపీతో ఫ్యూచర్ పాలిటిక్స్ కి కూడా ప్లాన్ బీ లో స్కోప్ ఉందని అంటున్నారు.

ఏపీ లో రాజకీయ పరిణామాలు పరిస్థితుల ఆధారంగా బీజేపీ ప్లాన్ బీ మరింత పదును తేరుతుందని అంటున్నారు. మొత్తానికి ఏపీతో పాటు కేంద్ర రాజకీయాలను దృష్టిలో ఉంచూనే బీజేపీ పెద్దలు వైసీపీ అధినాయకత్వంతో ఫోన్ కాల్ కలిపారు అని అంటున్నారు. మొత్తానికి సుడిగుండంలో పడిన వైసీపీకి ఇపుడు ఎంతో కొంత ఆశ, మరికొంత భరోసా కేంద్రం నుంచి దక్కాయని అంటున్నారు.