పక్షం రోజులు...జనం ఎవరి పక్షం ?
దాంతో ఉన్న ఈ అతి తక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అధినేతలు సిద్ధం అవుతున్నారు.
By: Tupaki Desk | 26 April 2024 5:48 PM GMTఎన్నికలు ముంగిట్లోకి వచ్చేశాయి. కేవలం పదిహేను రోజులు వ్యవధి మాత్రమే ప్రచారానికి ఉంది. మే 11వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు మైకులకూ నోళ్ళకు తాళం పడాల్సిందే. ఏమి చెప్పాలన్నా ఏమి చేయాలన్నా కూడా ఇపుడే జనాలకు చెప్పాలి. దాంతో ఉన్న ఈ అతి తక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అధినేతలు సిద్ధం అవుతున్నారు.
జగన్ కూడా ఈ నెల 28 నుంచి సుడిగాలి పర్యటన మొదలెట్టారు. ఆయన రోజుకు మూడు సభలను అటెండ్ చేయనున్నారు. చంద్రబాబు కూడా మూడు ఎన్నికల సభలను ప్రతీ రోజూ నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రోజులు రెండు సభల్తో హోరెత్తించనున్నారు ఇది కాకుండా మే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి వచ్చి ప్రచారాన్ని పీక్స్ కి చేర్చనున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటికి అయితే ఓటర్ల నాడి అందడం లేదు ఎవరికి విజయం అన్నది తెలియడం లేదు. మిగిలిన ఈ పక్షం రోజులలో జనాలు ఎవరి పక్షం అన్నది చెబుతారా అన్న చర్చ సాగుతోంది. జనాలు అయితే ఇంకా డిసైడ్ కాలేదు అని ఒక వైపు అంటూంటే వారు డిసైడ్ అయ్యారు అని మరో వైపు అంటున్నారు.
అయితే జనాలు ఇంకా అన్నీ గమనిస్తూనే ఉన్నారని మే మొదటి వారం దాటిన తరువాత ఏపీలో పొలిటికల్ పిక్చర్ ఒక క్లారిటీ వస్తుందని అంటున్నారు. జనాలకు అపుడు ఏ వైపు ఎడ్జ్ తీసుకోవాలో అర్ధం అవుతుందని అంటున్నారు.
మరో వైపు చూస్తే ప్రజలను తమ వైపునకు తిప్పుకోవడానికి వైసీపీ టీడీపీ తమ ఎన్నికల మ్యానిఫేస్టోకు పదును పెడుతున్నాయి. ఈ మ్యానిఫేస్టోలు రిలీజ్ అయ్యాక జనం మూడ్ అర్ధం అవుతుందని అంటున్నారు. తెలంగాణా ఎన్నికల్లో మ్యానిఫెస్టోలే నేతల తల రాతలను మార్చాయని అంటున్నారు.
అంతకు ముందు కర్నాటక ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది అని అంటున్నారు. సూపర్ సిక్స్ అంటూ కాంగ్రెస్ రెండు చోట్లా సిక్సర్లు కొట్టింది. ఏపీలో కూడా మ్యానిఫేస్టోలలో ఏది బాగుంది ఏది జనాలకు అట్రాక్ట్ చేస్తుంది అన్నది చూడాలని అంటున్నారు. నిజానికి చూస్తే దేశంలో ఎక్కడా కూడా మ్యానిఫేస్టో రిలీజ్ చేయకుండా ఎన్నికల ప్రచారం సాగలేదు. కానీ ఏపీలో మాత్రం మ్యానిఫేస్టోలను వెనక్కి పెట్టి జగన్ చంద్రబాబు ఇద్దరూ ప్రచారంలో మూడు వంతులు నిర్వహించేశారు.
బహుశా క్లైమాక్స్ లో గేర్ మార్చేందుకే మ్యానిఫెస్టోని అట్టేబెట్టారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా జనాలను తిప్పుకోవడానికి ఇపుడు రెండు పార్టీలకు ఉన్న తురుపు ముక్క అనుకున్నా లేక చివరి ఆయుధం అనుకున్నా ఎన్నికల ప్రణాళికలే అని అంటున్నారు. టీడీపీ ఎన్నికల మ్యానిఫేస్టో ప్రధాని చేతుల మీదుగా విడుదల చేస్తారని అంటున్నారు. దాంతో డేట్ ఫిక్స్ అవలేదు. కానీ వైసీపీ మేనిఫెస్టో మాత్రం ఈ నెల 27న రిలీజ్ చేస్తారు అని అంటున్నారు. సో మొత్తానికి పక్షం రోజులకు ఎన్నికలు రావడంతో ఈసారి ఎన్నికల వేడి రాజకీయ దుమారం వేసవిని మించిపోతోంది అని అంటున్నారు.