Begin typing your search above and press return to search.

టీయారెస్ నుంచి బీయారెస్ కి మారడమే కొంప ముంచిందా?

అసలు తెలంగాణా ఉద్యమం స్టార్ట్ చేసి కనీ వినీ ఎరగని తీరులో దాన్ని కొనసాగించి అసాధ్యం అనుకున్న తెలంగాణాను సుసాధ్యం చేసింది టీయారెస్.

By:  Tupaki Desk   |   1 Dec 2023 10:15 AM GMT
టీయారెస్ నుంచి బీయారెస్ కి మారడమే కొంప ముంచిందా?
X

పేరులో ఏముంది అని అంటారు. కానీ చాలానే ఉంది. కొన్ని పేర్లు సెంటిమెంట్ గా ఉంటాయి. కొన్ని లక్కీ జాక్ పాట్ గా పనిచేస్తాయి. జనాలకు మరి కొన్ని పేర్లు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. అలా తీసుకుంటే కనుక టీయారెస్ అన్నది తెలంగాణా ఆత్మగా ఉన్న పేరు. తెలంగాణా పేరుతో ఉన్నపుడు టీయారెస్ కి అన్నీ భారీ విజయాలే దక్కాయని చెప్పాలి.

అసలు తెలంగాణా ఉద్యమం స్టార్ట్ చేసి కనీ వినీ ఎరగని తీరులో దాన్ని కొనసాగించి అసాధ్యం అనుకున్న తెలంగాణాను సుసాధ్యం చేసింది టీయారెస్. మరి అలాంటి ఉద్యమ నినాదం లాంటి పేరుని కాస్తా బీయారెస్ గా మార్చి తెలంగాణా పేరుని తీసివేయడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయా అన్న చర్చ అయితే ఇపుడు తెలంగాణా అంతటా సాగుతోంది.

తెలంగాణాలో పోలింగ్ ముగిసింది. ఫలితాలకు టైం ఉంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ముందే ఊహించి చెప్పిన మాటలు ఇచ్చిన నివేదికలు చూస్తే తెలంగాణాలో అధికారంలో ఉన్న బీయారెస్ ని తెగ కలవరపెడుతున్నాయి. ఎందుకంటే దాదాపుగా అన్ని సర్వేలూ కాంగ్రెస్ కే ఎడ్జ్ ఇచ్చాయి. అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ మాత్రమే అని కచ్చితంగా చెప్పేశాయి.

దాంతోనే ఇపుడు బీయారెస్ లో అంతర్మధనం సాగుతోంది అని అంటున్నారు. ఇక దీంతోనే అనేక రకాలైన చర్చలు కూడా మొదలయ్యాయి. రాజకీయ విశ్లేషకులు అయితే టీయారెస్ ని కాస్తా బీయారెస్ గా మార్చిన మీదటనే ఇపుడు కష్టాలు ఎదురయ్యాయని అంటున్నారు. పార్టీ పేరులో తెలంగాణా అన్నది లేకపోవడం వల్లనే ఇపుడు ఇలా అయింది అని అంటున్న వారూ ఉన్నారు.

ఇక బీయారెస్ గా గత ఏడాది విజయదశమి వేళ కేసీయార్ పేరు మార్చారు. అయితే ఆనాడు మద్దతుగా నిలిచిన వారు అయితే ఈ రోజు ఎవరూ లేరు. కర్నాటక నుంచి వచ్చిన మాజీ సీఎం కుమార స్వామి అయితే ఇపుడు బీజేపీతో పొత్తులో ఉన్నారు. అలాగే నాడు వచ్చిన చాలా మంది నేతలు కూడా కనిపించడంలేదు. ఇంకో వైపు చూస్తే టీయారెస్ అస్థిత్వం ఆత్మ అన్నీ కూడా తెలంగాణాలో పెట్టుకుని ఆ పేరుని కాస్తా చెరిపేసి కీలక సమయాల్లో కేసీయార్ దేశాటనం చేయడం కూడా కచ్చితంగా దెబ్బ తీసింది అని అంటున్నారు.

కేసీయార్ మహారాష్ట్ర వెళ్లారు, పంజాబ్ వెళ్లారు, అక్కడ రైతులకు డబ్బులు ఇచ్చారు. బీహార్ కి వెళ్లారు. ఇలా దేశాన్ని పట్టుకుని తిరిగిన కేసీయార్ అతి ధీమాతో వ్యవహరించారు అన్న విమర్శలు ఇపుడు వస్తున్నాయి. తెలంగాణా రాష్ట్రాన్ని ఆయన పట్టించుకోలేదని రాజకీయ సమీకరణలు మారినా గెలుస్తామన్న మొండి ధైర్యంతో ముందుకు పోవడం ఇక ముందు జాతీయ రాజకీయమే అని కూడా నేల విడిచి సాము చేయడం వల్లనే ఇపుడు ఇలాంటి పరిస్థితులు వచ్చాయా అన్నదే చర్చగా ఉంది.

ఇలా తెలంగాణాను కాదనుకుని దేశం వైపు చూడడం కేసీయార్ జాతీయ రాజకీయాల మమకారాన్ని తెలియచేసినా ఉన్న చోట బలమున్న చోట మాత్రం దెబ్బ పడింది అని అంటున్నారు. దీనిని కాస్తా వెనక్కి వెళ్ళి ఎన్టీయార్ నేషనల్ ఫ్రంట్ నాటి అనుభవాన్ని కూడా గుర్తుకు తెస్తున్నారు. ఆనాడు ఉమ్మడి ఏపీకి తెలుగుదేశం తరఫున ముఖ్యమంత్రి అయిన ఎన్టీయార్ కీలక సమయంలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అంటూ జాతీయ రాజకీయాలు నడిపారు.

చివరికి 1989లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలు అయ్యారు. తెలుగుదేశం దారుణంగా పరాజయం పాలు కావడమే కాకుండా ఎన్టీయార్ కల్వకుర్తిలో స్వయంగా ఓటమి పాలు అయ్యారు. ఎమోషనల్ పాలిటిక్స్ కి పెట్టింది పేరు అయిన ఎంటీయార్ కి అది తొలి చివరి ఓటమి, ఆయన రాజకీయ జీవితంలో మాయని మచ్చ. మరి కేసీయార్ రాజకీయం ఎమోషనల్ ప్లస్ వ్యూహాత్మకంగా సాగుతుంది.

అయినా కూడా ఆయన పెట్టిన పార్టీలో ఎమోషన్ని టచ్ చేసే తెలంగాణా అనేది మాత్రం లేదు అదే చివరికి దెబ్బ కొట్టింది అని అంటున్నారు. ఏది ఏమైనా అసలు ఫలితాలు వస్తే బీయారెస్ పేరు హిట్టో ఫట్టో తేలుతుంది అని అంటున్నారు.