బస్సులో సీటు దొరకలేదని కండక్టర్ చెంప కొరికేశాడు
ఇప్పుడున్న బస్సుల్ని చూస్తే.. ఎక్కువగా మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్న పరిస్థితి.
By: Tupaki Desk | 21 Dec 2023 7:30 AM GMTఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా మారింది ఆర్టీసీ డ్రైవర్లు.. కండక్టర్ల పరిస్థితి. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో.. ఇటీవల కాలంలో మహిళలు పెద్ద ఎత్తున బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడున్న బస్సుల్ని చూస్తే.. ఎక్కువగా మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్న పరిస్థితి. దీంతో.. పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
బస్సులో సీటు దొరకటం లేదని.. మగాళ్లకు ప్రత్యేకంగా బస్సులు వేయాలని ఒకరు.. తాను స్కూల్ కు వెళ్లేటప్పుడు గతంలో మాదిరి సీటు లభించటం లేదని ఒక విద్యార్థిని.. ఇలా మహిళలకు ఫ్రీ జర్నీ కారణంగా అవస్థలు పడుతున్నట్లుగా విమర్శలు చేస్తున్నారు. వీటన్నింటికి మించి ఒక షాకింగ్ ఉదంతం అదిలాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని పాండ్రకవడకు అదిలాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు వెళ్లి వస్తోంది.
ఈ క్రమంలో మహారాష్ట్ర పరిధి బోరి బస్టాప్ వద్ద ఉట్నూరు సమీపంలో హస్నాపూర్ కు చెందిన అజీం ఖాన్ బస్సు ఎక్కాడు. అయితే.. తనకు సీటు దొరకని కారణంగా.. తాను ఇచ్చిన డబ్బుల్ని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశాడు. దీంతో. . కండక్టర్ డబ్బులు ఇచ్చేసి.. సదరు ప్రయాణికుడ్ని కిందకుదించేశాడు. ఈ క్రమంలో జరిగిన గొడవను గుర్తుంచుకున్న అజీంఖాన్.. బస్సు దిగిన తర్వాత వేరే వాహనంలో ఆర్టీసీ బస్సును ఫాలో అయ్యాడు.
ఈ క్రమంలో పిప్పల్ కోటి వద్ద బస్సును క్రాస్ చేసిన అతడు.. మళ్లీ బస్సు ఎక్కి కండక్టర్ తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో కండక్టర్ చెంప మీద బలంగా కొరికేయటంతో సదరు కండక్టర్ షాక్ కు గురయ్యాడు. బస్సులో గొడవ చేస్తూ.. నానా యాగి చేస్తున్న సదరు ప్రయాణికుడిపై బాధిత కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. నిందితుడిపై అదిలాబాద్ సెకండ్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.