Begin typing your search above and press return to search.

బ్రిటన్‌ లో ఆ పార్టీ గెలుపు భారత్‌ కు ఇబ్బందేనా?

పార్లమెంటులో అత్యధిక స్థానాలను కొల్లగొట్టి అధికారాన్ని చేపట్టింది.

By:  Tupaki Desk   |   5 July 2024 5:22 PM GMT
బ్రిటన్‌ లో ఆ పార్టీ గెలుపు భారత్‌ కు ఇబ్బందేనా?
X

రవి అస్తమించని సామ్రాజ్యంగా గ్రేట్‌ బ్రిటన్‌ కు పేరు. అలాంటి దేశంలో జరిగిన ఎన్నికలు సర్వత్రా ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ప్రస్తుత ప్రధాని రిషి సునాక్‌ కు చెందిన కన్జర్వేటివ్‌ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది. 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత లేబర్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్లమెంటులో అత్యధిక స్థానాలను కొల్లగొట్టి అధికారాన్ని చేపట్టింది.

మొత్తం 650 పార్లమెంటు స్థానాలకుగానూ లేబర్‌ పార్టీ మెజార్టీకి అవసరమైన 326 స్థానాలను దాటేసి 368 స్థానాలను గెలుచుకుంది. ఇక కన్జర్వేటివ్‌ పార్టీ కేవలం 87 స్థానాలకే పరిమితమైంది. లేబర్‌ పార్టీ ఘనవిజయం నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన కీర్‌ స్మార్టర్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

కాగా కన్జర్వేటివ్‌ పార్టీతో పోలిస్తే లేబర్‌ పార్టీకి భారత వ్యతిరేక పార్టీగా ముద్ర ఉంది. ముఖ్యంగా కాశ్మీర్‌ విషయంలో ఆ పార్టీ భారత్‌ ను ఇబ్బంది పెట్టేలా గతంలో వ్యాఖ్యలు చేసింది.

గతేడాది సెప్టెంబర్‌ 25న యూకేలో జరిగిన లేబర్‌ పార్టీ సమావేశం..

కాశ్మీర్‌లో అంతర్జాతీయ జోక్యానికి, ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని ప్రజాభిప్రాయ సేకరణకు మద్దతు ఇచ్చే తీర్మానాన్ని ఆమోదించడం గమనార్హం.

ఈ తీర్మానం ప్రకారం.. కాశ్మీర్‌ లో అంతర్జాతీయ జోక్యం ఉండాలని, అక్కడ ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని లేబర్‌ పార్టీ పిలుపునిచ్చింది.

ముఖ్యంగా, కాశ్మీరీ ప్రజల స్వయం నిర్ణయాధికారానికి మద్దతు ఇవ్వాలని.. ఇందుకోసం అంతర్జాతీయ పరిశీలకులను జమ్మూకాశ్మీర్‌ కు పంపాలని లేబర్‌ పార్టీ గతంలో తమ దేశ ప్రభుత్వానికి పిలుపునిచ్చింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని లేబర్‌ పార్టీ కోరింది.

లేబర్‌ పార్టీ నిర్ణయాలు భారత్‌ కు వ్యతిరేకం. కాశ్మీర్‌ పూర్తిగా తమ భూభాగమని.. ఇందులో మూడో పక్షం జోక్యాన్ని తాము ఆమోదించబోమని ఇప్పటికే భారత్‌ పలుమార్లు విస్పష్ట ప్రకటనలు జారీ చేసింది. భారత్‌ –పాకిస్థాన్‌ ఉభయపక్షాలు చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకుంటాయని మనదేశం తేల్చిచెప్పింది.

కాశ్మీర్‌ కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి హోదాను తీసేసి దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం రాజ్యాంగంలోని 370 ఆర్టికల్‌ ను సవరించింది. అలాగే జమ్మూకాశ్మీర్‌ లో ఉన్న లడఖ్‌ ను విడదీసి.. దాన్ని కూడా ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది.

ఇప్పుడు యూకేలో లేబర్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. అది ఇప్పటికే భారత్‌ వ్యతిరేక చర్యలకు మద్దతు ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా ఆ పార్టీయే ఇంగ్లండ్‌ లో అధికారంలో ఉండటంతో భారత్‌ ను ఇబ్బంది పెట్టే చర్యలకు పాల్పడవచ్చని అంటున్నారు. ఇప్పటివరకు కన్జర్వేటివ్‌ పార్టీ బ్రిటన్‌ లో అధికారంలో ఉంది. అది భారత్‌ కు అనుకూలంగానే వ్యవహరించింది. అందులోనూ గత కొన్నేళ్లుగా భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధానిగా ఉండటంతో భారత్‌ –బ్రిటన్‌ సంబంధాలు బలపడ్డాయి. ఇప్పుడు

లేబర్‌ పార్టీ అధికారంలోకి రావడంతో ఇరు దేశాల ఏ మలుపు తిరుగుతాయో వేచిచూడాల్సిందే.

అయితే విదేశాంగ విధానం విషయంలో భారత్‌ చాలా గట్టిగా వ్యవహరిస్తోంది. మన ప్రయోజనాలకు ఇబ్బంది కలిగితే అమెరికాను కూడా లెక్కచేయడం లేదు. రష్యా, ఇరాన్‌ నుంచి చమురు కొనుగోళ్లు ఆపేయాలని అమెరికా కోరినా భారత్‌ ఆ దేశం ఆదేశాలను ధిక్కరించింది. తమ దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని.. రష్యా, ఇరాన్‌ నుంచి చమురు కొనుగోళ్లు చేస్తామని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌ వ్యవహారంలో బ్రిటన్‌ జోక్యం చేసుకుంటే భారత్‌ నుంచి గట్టిగా దానికి కౌంటర్లు ఖాయంగా ఉంటాయి.