ఎమర్జెన్సీ... సమాజానికి “కుష్” ఇచ్చే సందేశం ఏమిటి?
ఈ ఒక్క ప్రకటన చాలు.. ఆదేశంలో డ్రగ్ వినియోగం ఏస్థాయిలో ఉందో చెప్పడానికి.
By: Tupaki Desk | 10 April 2024 12:41 PM GMTప్రస్తుతం ఒక డ్రగ్ వాడకం తీవ్రత వల్ల ఒక దేశం ఏకంగా ఎమర్జెన్సీని విధించిన సంగతి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ ఒక్క ప్రకటన చాలు.. ఆదేశంలో డ్రగ్ వినియోగం ఏస్థాయిలో ఉందో చెప్పడానికి. ఇదే సమయంలో.. ఆ డ్రగ్ తయారీలో మనవ ఎముకల పొడిని వాడతారని.. అందువల్ల దుండగులు స్మశానాల్లో పడి సమాధులు తవ్వేస్తున్నారనే విషయంలో మరింత వైరల్ గా మారింది.
దీంతో... మనిషిలో సహజంగా ఉండే, ఉండాల్సిన మానవీయ కోణాలు, లక్షణాలు పోతున్నాయని.. ప్రధానంగా ఈ డ్రగ్స్ వల్ల మనిషిలో అమానవీయ లక్షణాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో ఆ డ్రగ్స్ గురించి సైక్రియాటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఈ వ్యవహారం వల్ల ప్రభలే వ్యాధుల జాబితాను ప్రకటిస్తున్నారు! ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితికి నిదర్శనమని చెబుతున్నారు.
దేశంలో ఎమర్జెన్సీ!:
అవును... మానవ ఎముకల నుండి రూపొందించబడిన ఒక సైకోయాక్టివ్ డ్రగ్ పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియెర్రా లియోన్ లో అతిపెద్ద సమస్యగా మారింది. దీని తయారీలో ఎములక పొడిని కూడా వాడుతుండటంతో.. డీలర్లు దొంగలకు డబ్బులు ఇచ్చి సమాధులను తవ్విస్తున్నారు. దీంతో సియొర్రా లియోన్ లో ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి దాపురించింది.. ఈ సమయంలో స్మశానాలకు కూడా సెక్యూర్టీని ఏర్పాటు చేశారు!
ప్రెసిడెంట్ వర్డ్స్!:
ఒక డ్రగ్ వాడకం వల్ల దేశంమొత్తం అత్యవసర పరిస్థితిని విధించడం అనేది చిన్న విషయం కాదు. దీంతో.. ఈ విషయాలపై స్పందించిన సియెర్రా లియోన్ ప్రెసిడెంట్ జూలియస్ మాదా బయో... "మాదకద్రవ్యాలు, మాదకద్రవ్యాల దుర్వినియోగం, ముఖ్యంగా వినాశకరమైన సింథటిక్ డ్రగ్ "కుష్" ప్రభావం కారణంగా మన దేశం ప్రస్తుతం అస్తిత్వ ముప్పును ఎదుర్కొంటోంది" అని పేర్కొన్నారు.
ఈ డ్రగ్స్ వల్ల రాబోయే సమస్యలు!:
ఈ బోన్ డ్రగ్ “కుష్” వల్ల ఎదురయ్యే ప్రభావాలు వినాశకరమైనవి, భయానకమైనవి అని చెబుతున్నారు నిపుణులు. ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల... బరువు తగ్గడం, చర్మ గాయాలు, దంత క్షయం, మతిస్థిమితం, భ్రాంతులు మొదలైనటువంటి తీవ్రమైన శారీరక, మానసిక సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
ఇదే సమయంలో... హె.ఐ.వీ., క్షయ, హెపటైటిస్ వంటి వ్యాధులను సంక్రమించే ప్రమాదాన్ని కూడా ఈ డ్రగ్ వాడకం పెంచుతుందని అంటున్నారు. కారణం... వినియోగదారులు తరచుగా సూదులు లేదా పైపులను షేర్ చేసుకోవడమే అని అంటున్నారు. ఈ డ్రగ్ వాడకం వల్ల ఇప్పటికే చాలా మంది నిరాశ్రయులవ్వగా.. మరికొంతమంది మరణించారని తెలుస్తోంది!
సియెర్రా లియోన్ దేశంలోనే ఎందుకు?
ప్రస్తుతం ఈ బోన్ డ్రగ్ కుష్... సియెర్రా లియోన్ ను పట్టి పీడిస్తున్న లోతైన సామాజిక, ఆర్థిక సమస్య! అంతర్యుద్ధం, అవినీతి, పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యతతో కూడిన సమస్యలు కలిగిన ఈ దేశంలో చాలా మంది యువకులు కఠినమైన వాస్తవాలను జీర్ణించుకోలేక మాదక ద్రవ్యాల వైపు మొగ్గు చూపారని చెబుతున్నారు.
పైగా నిరుద్యోగం, పేదరికం పుష్కలంగా ఉన్న ఈ దేశంలో ఈ బోన్ డ్రగ్ చౌకంగా దొరుకుతుండటంతో వాడకం మరింత విరివిగా మారిందని చెబుతున్నారు. దీంతో... సమాదుల్లో ఎముకలు తవ్వడం, ఏజెంట్లకు అమ్మడం, ఆ సొమ్ముతో డ్రగ్స్ కొనుక్కోవడం చేస్తున్నారంట స్థానికులు. ఇక్కడ ఒక కిలో ఎముకలు బ్లాక్ మార్కెట్ లో $2000 వరకు లభిస్తాయని అంటున్నారు!
అంతర్జాతీయ సమాజానికి “కుష్” ఇచ్చే మెసేజ్ ఏమిటి?
"కుష్" డ్రగ్ నుంచి భారత్ వంటి అభివృద్ధి చెందుతోన్న దేశాలు చాలానే నేర్చుకోవాలని అంటున్నారు! సహజంగా అభివృద్ధి ముసుగులో కూడా కొత్త కొత్త కల్చర్ అలవాటు చేసుకునే క్రమంలో... ఈ తరహా అలవాట్లకు యువత మొగ్గుచూపే అవకాశం ఉందని చెబుతున్నారు! ఒక దేశంలో డ్రగ్స్ విపరీత వినియోగానికి పేదరికం ఎంత కారణమో... అభివృద్ధి పేరుతో, మోడ్రన్ కల్చర్ పేరుతో జరిగే కొన్ని చర్యలు, కార్యక్రమాలు కూడా కాస్త అటు ఇటుగా అంతే కారణం అని అంటున్నారు.
ఏ దేశంలోని ప్రభుత్వాలైనా... మాదక ద్రవ్యాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే, వీటి నిరోదానికి నిజాయితీగా కఠిన ఆంక్షలు విధించకపోతే... దేశానికి అంతకు మించిన ద్రోహం మరొకటి ఉండదనే భావించాలి! ఇలాంటి విషయంలో ప్రభుత్వాలు మెతక వైఖరి ప్రదర్శిస్తే... దేశానికి వెన్నెముఖ అయిన యువత.. పనికిరాని వ్యర్థ పదార్ధంగా మారిపోవడమే కాకుండా, దేశానికి అతిపెద్ద సమస్యగా పరిణమిస్తుంది!
ఈ నేపథ్యంలో ప్రస్తుతం డ్రగ్స్ కోసం ఏకంగా సమాదులను సైతం తవ్వే పరిస్థితికి దేశ యువత దిగజారిపోయిందంటే.. అంతకు తెగించేసిందంటే.. ఈ విషయం కచ్చితంగా అంతర్జాతీయ సమాజానికి సైతం ప్రమాదకరమైన సంకేతాలు పంపుతుందని చెబుతున్నారు. దీంతో... ప్రస్తుతం ఈ "కుష్" వ్యవహారం ప్రపంచ దేశాలను ఆలోచింపజేస్తోందని.. ఇది అంతర్జాతీయ సమాజానికి ఒక బలమైన హెచ్చరిక అని చెబుతున్నారు!