కేసీఆర్‌కు దక్కని ఊరట.. చిన్న ఛేంజ్ మాత్రమే!
దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కేసీఆర్‌కు ఎలాంటి ఊరట ఇవ్వలేదు.
By: Tupaki Desk | 16 July 2024 1:30 PM GMTబీఆర్ ఎస్ హయాంలో తెలంగాణలలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు.. ఒప్పందాలు.. ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి జస్టిస్ నరసింహారెడ్డిని చైర్మన్‌గా నియమించారు. అయితే.. ఈ కమిషన్‌ను రద్దు చేయాలంటూ.. మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ సుప్రీంకోర్టు ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కేసీఆర్‌కు ఎలాంటి ఊరట ఇవ్వలేదు. కేవలం.. కమిషన్ చైర్మన్‌ను మాత్రమే మార్చాలని ఆదేశించింది.
ఏం జరిగింది?
రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తూ.. గత బీఆర్ ఎస్ తాలూకు అక్రమాలను వెలుగులోకి తెస్తున్నామని ప్రకటించారు. ఈ క్రమంలోనే పలు శాఖలపై శ్వేత పత్రాలు కూడా విడుదల చేశారు. ఇలా.. విద్యుత్పై శ్వేత పత్రం విడుదల చేసిన సమయంలో అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గత సర్కారు తప్పులు చేసిందని భావిస్తే.. కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేయాలని.. బీఆర్ ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో రేవంత్ రెడ్డి సర్కారు జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ వేసింది.
తొలి పది పదిహేను గడిచిపోయిన తర్వాత.. కమిషన్ చైర్మన్‌గా ఉన్న నరసింహారెడ్డి.. నేరుగా మాజీ సీఎం కేసీఆర్‌నే విచారణకు రావాలంటూ.. ఆదేశించారు. ఈ మేరకు ఆయనకు నోటీసులు కూడా పంపించారు. అయితే.. కేసీఆర్ మాత్రం రాలేదు. ఇక్కడే వివాదం మరోసా రి యూటర్న్ తీసుకుంది. రేవంత్ రెడ్డి కూడా.. బీఆర్ ఎస్ నేతలపై ఘాటుగానే స్పందించారు. కమిషన్‌ను రద్దు చేసేది లేదన్నారు. విచారణకు వచ్చి.. తప్పులు జరగలేదని నిరూపించాలని సవాల్ రువ్వారు.
ఈ పరిణామాల నేపథ్యంలోనే కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించి.. కమిషన్‌ను రద్దు చేయాలన్నారు. దీనికి ముందు హైకోర్టులోనూ ఆయన వాదనలు వినిపించారు. తాజాగా సుప్రీంకోర్టు విచారణకు సంబంధించిన తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా కమిషన్‌ను రద్దు చేయలేమని పేర్కొన్న ధర్మాసనం.. చైర్మన్ వైఖరిని మాత్రం తప్పుబడుతూ.. కమిషన్ చైర్మన్‌ను మార్చాలని తీర్పు చెప్పింది. అంతేకాదు.. కేసీఆర్‌ను విచారణకు ఆహ్వానించడాన్ని కూడా కోర్టు సమర్థించింది. ఇది తప్పెలా అవుతుందని ప్రశ్నించింది.
సుప్రీం వ్యాఖ్యలు ఇవీ..
+ విద్యుత్ కమిషన్ చైర్మన్ గా ఉంటూ ప్రెస్ మీట్ ఎలా పెడతారు?
+ సొంత అభిప్రాయాల్ని కమిషన్ చైర్మన్ బహిరంగ పరచడం సమర్థనీయం కాదు.
+ కమిషన్ చైర్మన్ నిష్పక్షపాతంగా ఉండాలి.
+ విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ గా మరొక జడ్జిని నియమించాలి.