Begin typing your search above and press return to search.

జగన్ పై వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు... ఐప్యాక్ పై సెటైర్లు!

ఈ నేపథ్యంలో ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   2 Jan 2024 9:10 AM GMT
జగన్  పై వైసీపీ ఎమ్మెల్యే  కీలక వ్యాఖ్యలు... ఐప్యాక్  పై సెటైర్లు!
X

గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్నట్లుగా వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 స్థానాల్లో ఇన్ ఛార్జ్ లను మారుస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ లను మార్చారు. ఈ నేపథ్యంలో మిగిలిన జిల్లాలపైనా కసరత్తులు చేస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా జగన్ కు సూటిప్రశ్నలు సంధించారు.

అవును... ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అధికార వైసీపీ చేపడుతున్న ఇన్ ఛార్జ్ ల మార్పు అంశం కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఈ టిక్కెట్ల కసరత్తు అంశం పార్టీలో పెను చిచ్చు రేపుతోందని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగురువేసిన సంగతి తెలిసిందే. తాను పార్టీని ఎందుకు వీడుతున్నదీ జగన్ మనసుకు తెలుసంటూ ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో... విశాఖపట్నానికి చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ.. వైసీపీని వీడి జనసేనలో చేరారు. ఇదే సమయంలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు ఈ దఫా టిక్కెట్ లేదని కథనాలొస్తున్న వేళ ఆయన అనుచరులు జగన్, మిథున్ రెడ్డిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు! ఈ నేపథ్యంలో... తాజాగా చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా వైసీపీ అధినాయకత్వంపై మండిపడ్డారు. ఈ సమయంలో తెరపైకి సామాజికవర్గం టాపిక్ తీసుకొచ్చారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన ఎంఎస్ బాబు... గత అయిదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ పెద్దలు, మంత్రులు చెప్పినట్టే నడుచుకున్నట్లు తెలిపారు. అంతలా పనిచేసినా ఇప్పుడు తనపై వ్యతిరేకత ఉందని చెబుతుంటే.. అందుకు ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో... ఇంతకాలం తాను సీఎం జగన్ చెప్పినట్లే చేసినప్పుడు తన తప్పంటే ఎలా అంటూ లాజిక్ లాగుతున్నారు.

తాజాగా తనతో మాట్లాడిన జగన్... ఐప్యాక్ సర్వే ఫలితం తనకు అనుకూలంగా లేదని, ఈసారి పూతలపట్టు టికెట్ ఆశించవద్దని చెప్పారని.. ఇది ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. అసలు డబ్బులు ఇస్తే ఐఫ్యాక్ వాళ్లు సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా... 2019 ఎన్నికల్లో తనకు ఐఫ్యాక్ సర్వే ఆధారంగానే టికెట్ ఇచ్చారా అంటూ బాబు సూటిగా ప్రశ్నించారు.

ఇదే క్రమంలో... అసలు జగన్ చెప్పకముందే తాను నియోజకవర్గంలో గడపగడపకు తిరిగినట్లు చెబుతున్న ఎంఎస్ బాబు... ఇప్పుడు తన పనితీరు బాగోలేదని, సర్వే నెగటివ్ గా ఉందని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓసీ సీట్లు మార్చకుండా కేవలం ఎస్సీ సీట్లే మారుస్తున్నారని.. తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఓసీ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై వ్యతిరేక ఉన్నాకూడా మార్చడం లేదని తెలిపారు. ఈ క్రమంలో.. అసలు తాను చేసిన తప్పేమిటో చెప్పాలంటూ ప్రశ్నించారు ఎంఎస్ బాబు.

అనంతరం తాను పార్టీని వీడే ప్రసక్తే లేదని.. ఇప్పటికీ వైసీపీ పెద్దలపై నమ్మకం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై గౌరవం ఉందని.. తనకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని ఎంఎస్ బాబు అన్నారు. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. మరి ఇలా ఎర్రజెండా ఎగురవేస్తున్న అసంతృప్తులను జగన్ ఎలా కూల్ చేస్తారనేది వేచి చూడాలి.