Begin typing your search above and press return to search.

నాడు వద్దు నేడు ముద్దు...బాబు మార్క్ డెసిషన్ !

ఈ మేరకు ప్రభుత్వం జనరల్ కన్సెంట్ ఇస్తూ కీలకమైన నిర్ణయం తీసుకంది.

By:  Tupaki Desk   |   21 Aug 2024 1:30 AM GMT
నాడు వద్దు నేడు ముద్దు...బాబు మార్క్ డెసిషన్ !
X

సీబీఐని ఏపీలో విచారణను నేరుగా చేసుకోవడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సీబీఐ ఇక మీదట ఏపీలో ఏ కేసులను అయినా నేరుగా విచారణ చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం జనరల్ కన్సెంట్ ఇస్తూ కీలకమైన నిర్ణయం తీసుకంది.

దీంతో సీబీఐకి ఏపీకి ఎంట్రీకి ద్వారాలు డైరెక్ట్ గా తెరచినట్లు అయింది. ఏపీలో ప్రభుత్వ రంగ సంస్థలలో అవినీతికి పాల్పడిన ఉద్యోగులు కానీ అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు సంస్థలపైన కానీ ఇకమీదట సీబీఐ నేరుగా రంగంలోకి దిగి విచారణ చేసుకోవచ్చు.

ఈ మేరకు సీబీఐకి తగిన విధంగా వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై విచారణకు మాత్రం సీబీఐ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

మరో వైపు చూస్తే రాష్ట్రంలో సీబీఐ విచారణ పరిధిని కొనసాగించేందుకు పెంచేందుకు కూడా ఈ గెజిట్ వీలు కల్పిస్తుంది. ఢిల్లీ ప్రత్యేక పోలీసు వ్యవస్థాపక చట్టం-1946లోని సెక్షన్-3 ప్రకారం సీబీఐ విచారణ పరిధిని పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తాజా గెజిట్ లో పేర్కొంది. తద్వారా సీబీఐ పరిధిలో నిర్దేశించిన నేరాలపై విచారణ కోసం రాష్ట్ర సర్కారు లాంఛనంగా అనుమతిచ్చి నట్టయింది.

ఇక పోతే ఇప్పటికి సరిగ్గా అయిదేళ్ళ క్రితం ఇదే చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో సీబీఐకి నో ఎంట్రీ అని పేర్కొంటూ ఒక ఉత్తర్వును తెచ్చారు. అప్పట్లో ఎన్డీయేతో టీడీపీకి రాజకీయ బంధం కటీఫ్ అయింది. దాంతో కేంద్ర ప్రభుత్వం మీద ఏపీ ప్రభుత్వం ధర్మ పోరాటమే చేసింది. ఆ సమయంలో కీలకమైన నిర్ణయంగా సీబీఐకి ఇచ్చిన జనరల్ కన్సెంట్ ని రద్దు చేస్తూ ఒక సంచలన నిర్ణయం నాడు తీసుకున్నారు

అలా 2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలో సీబీఐ విచారణకు అనుమతి నిరాకరించిన చంద్రబాబు ప్రభుత్వమే ఇపుడు స్వయంగా వెల్ కం చెప్పడం విశేషం. ఇది మారిన ప్రభుత్వ వైఖరిని నిదర్శనంగా చూస్తున్నారు. ఇపుడు కూడా కేంద్రంలో మోడీ సర్కార్ ఉంది. అయితే ఇపుడు టీడీపీ ఎన్డీయేల మధ్య మంచి రాజకీయ మైత్రి కొనసాగుతోంది. పైగా ఎన్డీయే సర్కార్ కి బాసటగా టీడీపీ ఉంది

ఇలా టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి మారిన రాజకీయ పరిణామాలు కూడా కారణం కావచ్చు అని అంటున్నారు. మరో వైపు ప్రతిపక్ష వైసీపీ నేతల మీద సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్లు అధికార కూటమి నుంచి తరచుగా వస్తున్నాయి. దాంతో రానున్న రోజులలో సంచలన పరిణామాలు చోటు చేసుకోవడానికి ఈ తాజా నిర్ణయం దోహదపడుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా సీబీఐ నాడు వద్దు నేడు ముద్దు అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది.