లహైనా విలయం.. వందేళ్లలో చూడనంత ఘోరం
పసిఫిక్ మహా సముద్రంలో.. అందాల దీవులతో అలరారుతూ.. పర్యటకులను రా రామ్మని ఆహ్వానించే ద్వీపాలే హవాయి.
By: Tupaki Desk | 13 Aug 2023 11:30 PM GMTమనందరం అమెరికా సంయుక్త రాష్ట్రాలు (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా) అని చదువుకునే 50 రాష్ట్రాల్లో చిట్టచివరగా ఏర్పడినదే హవాయి. పసిఫిక్ మహా సముద్రంలో.. అందాల దీవులతో అలరారుతూ.. పర్యటకులను రా రామ్మని ఆహ్వానించే ద్వీపాలే హవాయి. నిన్నటివరకు అతిపెద్ద హోటళ్లతో వేలాది మంది పర్యటకులతో కళకళలాడే ఆ ద్వీపంలోని లహైనా ఇప్పుడో మహా విలయానికి నిలువెత్తు నిదర్శనం. ఒకటి కాదు పది కాదు వందల ఇళ్లు కాలి బూడిదయ్యాయి. ఎక్కడో సుదూరాన రేగిన దావానలం నిలువునా ద్వీపాన్ని దహించి వేసింది. వందేళ్లలో కనీవిని ఎరుగని విషాదాన్ని నింపింది.
హవాయి ద్వీపాలు అమెరికాలో భాగమని ఇప్పటివరకు ఎవరికీ తెలిసి ఉండదు. కానీ ఇది వాస్తవం. అమెరికా అనగానే మనకు గుర్తొచ్చే ప్రధాన భూభాగం వేరు. కానీ, అందులో.. పసిఫిక్ సముద్రంలో చివరన ఉండే దీవులే హవాయి. ఆ దేశంలో 50వ రాష్ట్రంగా హవాయి ఏర్పడింది. అమెరికన్లు అంటేనే పర్యటక ప్రేమికులు. ఇంకేం వారితోపాటు ఇతర దేశాల వారికీ ఇష్టమైనవి హవాయి దీవులు. వీటికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఇందులోనే టూరిస్టులకు స్వర్గధామం లహైనా. పెద్దపెద్ద హోటళ్లతో అలరారే ఈ నగరాన్ని రిసార్టు నగరంగా చెబుతుంటారు.
మహా విలయానికి మౌన సాక్షి
గత వారం హవాయి ద్వీపంలోని మాయీ కౌంటీలో చెలరేగిన దావానలం లహైనా నగరాన్ని కమ్మేసింది. ఎక్కడో సుదూరాన రేగిన కార్చిచ్చు క్రమక్రమంగా నగరాన్ని కమ్మేసింది. ఇప్పుడా నగరం ఓ బూడిద గుట్ట. తొలుత 30 మంది చనిపోయినట్లుగా కథనాలు రాగా.. ఇప్పడా మృతుల సంఖ్య 89కి పెరిగింది. వాస్తవానికి మరణాలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. వందేళ్లలో ఇలాంటి కార్చిచ్చు నమోదు కాలేదని అమెరికా ఫైర్ అడ్మినిస్ట్రేటర్ లోరీ మూర్ మెరిల్లీ తెలిపారు.
కెనడా నుంచి హవాయి వరకు..
వాతావరణ మార్పులు ఎంతటి విధ్వంసానికి కారణమవుతాయో ఈ ఏడాది వివిధ దేశాల్లో చోటుచేసుకున్న కార్చిచ్చే ఉదాహరణ. కెనడా, అమెరికా, జర్మనీ వంటి దేశాల్లో ఈ వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు దావానలానికి కారణమయ్యాయి. ఇప్పటివరకు అమెరికాలో రేగిన దావానలాల్లో కాలిఫోర్నియా బట్టీ కౌంటీలో చోటుచేసుకుది అతి పెద్దది. కానీ, దానికన్నా లహైనాలో ఎక్కువ విధ్వంసం జరిగింది. కాగా, బట్టీ కౌంటీలో గతంలో 85 మంది చనిపోయారు. 1.50 లక్షల ఎకరాల అడవి కాలిపోయింది. 18 వేల నిర్మాణాలు కాలిపోయాయి. అయితే, మాయిలో 2,200 నిర్మాణాలు దహనమయ్యాయి. 6 బిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లింది. నష్టం అంచనాను 5.2 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.
60 ఏళ్ల కిందట సునామీ.. ఇప్పుడు కార్చిచ్చు
హవాయి ద్వీపం 1960లో భారీ సునామీకి కేంద్రమైంది. 61 మంది ప్రాణాలు కోల్పోయారు. 1946లోనూ సునామీ రాగా 158 మంది చనిపోయారు. వీటిని మించి ప్రస్తుతం కార్చిచ్చు మరణాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.