Begin typing your search above and press return to search.

ట్రాఫిక్ నరకం చూపిన వాన.. హైదరాబాద్ ఐటీ కారిడార్ ఆగమాగం

ప్రతి ఉదయం.. సాయంత్రం వేళలో ఐటీ కారిడార్ మొత్తం తీవ్రమైన ట్రాఫిక్ ఒత్తిడిని ఎదుర్కోవటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   6 Jun 2024 4:38 AM GMT
ట్రాఫిక్ నరకం చూపిన వాన.. హైదరాబాద్ ఐటీ కారిడార్ ఆగమాగం
X

చిన్న వర్షానికే తెగ ఇబ్బందులు పడే హైదరాబాద్ లో బుధవారం కురిసిన వానతో హైదరాబాదీయులకు మరోసారి ట్రాఫిక్ నరకయాతనను చవిచూశారు. ఒక్కసారిగా కుమ్మరించినట్లుగా పడే భారీ వర్షంతో పోలిస్తే.. బుధవారం సాయంత్రం కురిసిన వాన తక్కువే అయినప్పటికీ.. దాని కారణంగా రోడ్ల మీద నిలిచిన నీరు.. దాని కారణంగా తగ్గిన వాహన వేగం వాహనదారులకు చుక్కలు చూపించింది. ప్రతి ఉదయం.. సాయంత్రం వేళలో ఐటీ కారిడార్ మొత్తం తీవ్రమైన ట్రాఫిక్ ఒత్తిడిని ఎదుర్కోవటం తెలిసిందే.

అలాంటిది వర్షం పడినప్పుడు ఆ ఇబ్బంది రెండు నుంచి మూడింతలు పెరుగుతుంది. దీంతో ప్రయాణ వేగం సగానికి సగం తగ్గిపోతుంది. కొన్నిసార్లు అంతకు మించిన అన్నట్లుగా మారుతుంది. పది కిలోమీటర్ల దూరానికి రెండు గంటల నుంచి మూడు గంటల వరకు టైం తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. తాజాగా అలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.

తాజా వర్షానికి రోడ్ల మీద నీళ్లు నిలిచిపోవటంతో పాటు.. భారీ ఎత్తున వాహనాలు ఐటీ కంపెనీల నుంచి బయటకు రావటంతో రోడ్లు మొత్తం జాం అయ్యాయి. ఓవైపు వర్షం మరోవైపు ట్రాఫిక్ జాంతో వాహనదారులు ప్రత్యక్ష నరకాన్ని చవిచూశారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం బుధవారం సాయంత్రం రెండు.. మూడు గంటల పాటు కురిసిన వాన గరిష్ఠంగా 9 సెంటీమీటర్లు కాగా.. కనిష్ఠంగా 7 సెంటీమీటరలుగా చెబుతున్నారు.

వాన పడితే చాలు.. ట్రాఫిక్ కష్టాలకు గురవుతున్న హైదరాబాద్ ప్రజల వెతల్ని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తాము ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాల్ని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మిగిలిన నగరం మొత్తం ఒక ఎత్తు అయితే.. ఐటీ కారిడార్ లో నెలకొనే జాం కారణంగా లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. ఐటీ కారిడార్ లో పని చేసే ఉద్యోగుల్లో చాలామంది నగరం నాలుగు మూలల నుంచి వస్తుంటారు. ఐటీ కారిడార్ జాం అయితే.. దాని ప్రకారం నాలుగు వైపులా ఉండే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారాన్ని కనుగోవాల్సి ఉంది. రేవంత్ సర్కారు ఏం చేస్తుందో చూడాలి.