Begin typing your search above and press return to search.

అక్కడ భారీగా క్రాస్‌ ఓటింగ్‌.. ఎవరి కొంప మునిగేనో!

దీంతో ఆ కులానికి చెందినవారు పార్లమెంటుకు తమ అభ్యర్థులకు ఓట్లేశారని.. అసెంబ్లీకి మాత్రం కూటమి అభ్యర్థులకు ఓట్లేశారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.

By:  Tupaki Desk   |   20 May 2024 12:30 PM GMT
అక్కడ భారీగా క్రాస్‌ ఓటింగ్‌.. ఎవరి కొంప మునిగేనో!
X

ఆంధ్రప్రదేశ్‌ లో మే 13న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి. ఓటర్లు తమ ఓట్లను ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. జూన్‌ 4న ఫలితాలు వెలువడే వరకు గెలిచేవారెవరో ఉత్కంఠ తప్పేలా లేదు. కాగా అసెంబ్లీకి, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరగడంతో క్రాస్‌ ఓటింగ్‌ భయం అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తోందని చెబుతున్నారు.

ముఖ్యంగా ‘తూర్పు’గాలి ఏ పార్టీ వైపు వేస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే నానుడి ఉండి. ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు, ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని తెలుస్తోంది. ముఖ్యంగా కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీలను క్రాస్‌ ఓటింగ్‌ భయం వెంటాడుతోందని చెబుతున్నారు.

కాకినాడ ఎంపీ స్థానంలో జనసేన, రాజమండ్రి, నరసాపురం ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేశాయి. అమలాపురం, ఏలూరు ఎంపీ స్థానాల్లో టీడీపీ పోటీకి దిగింది. ఈ ఐదు ఎంపీ స్థానాల బరిలో మూడు పార్టీలు.. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో భారీ ఎత్తున క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని అంటున్నారు.

ఓటర్లు ముఖ్యంగా అసెంబ్లీకి వచ్చేటప్పటికి ఒక పార్టీకి వేసి, పార్లమెంటుకు వచ్చేసరికి ఇంకో పార్టీకి ఓటేశారని పెద్ద ఎత్తున టాక్‌ నడుస్తోంది. వైసీపీ వ్యూహాత్మకంగా నరసాపురం, రాజమండ్రి ఎంపీ స్థానాలను ఒకే కులానికి కట్టబెట్టింది. దీంతో ఆ కులానికి చెందినవారు పార్లమెంటుకు తమ అభ్యర్థులకు ఓట్లేశారని.. అసెంబ్లీకి మాత్రం కూటమి అభ్యర్థులకు ఓట్లేశారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.

ఎన్నికలు ముగియడంతో పలు సర్వే సంస్థలు పోస్ట్‌ పోలింగ్‌ సర్వేలను నిర్వహిస్తున్నాయి. ఇందులో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయినట్టు సమాచారం. ముఖ్యంగా క్రాస్‌ ఓటింగ్‌ ఆయా పార్టీలను భారీ ఎత్తున దెబ్బ వేస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా కూటమి పార్టీలకు క్రాస్‌ ఓటింగ్‌ ప్రమాదం ఎక్కువ ఉందని ప్రచారం జరుగుతోంది. కూటమి తరఫున పార్లమెంటుకు పోటీ చేసేవారికి ఇబ్బందులు తప్పవనే టాక్‌ నడుస్తోంది. అసెంబ్లీకి వచ్చేసరికి కూటమి అభ్యర్థులకు అంతగా ఇబ్బందులు లేవని చెబుతున్నారు.

ఎన్నికలు ముగియడంతో ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కేంద్రంగా భారీ ఎత్తున బెట్టింగులు నడుస్తున్నాయి. వందల కోట్ల రూపాయల్లో బెట్టింగులు సాగుతున్నాయని చెబుతున్నారు. ఈ బెట్టింగుల్లోనూ క్రాస్‌ ఓటింగ్‌ పైన పందేలు కాస్తున్నారట. అసెంబ్లీకి అత్యధిక స్థానాలు కూటమికి, పార్లమెంటు స్థానాలు వైసీపీకి అనేవిధంగా పందేలు సాగుతున్నట్టు సమాచారం.

క్రాస్‌ ఓటింగ్‌ పెద్ద ఎత్తున జరిగితే ఆయా పార్టీలు అసెంబ్లీకో, పార్లమెంటుకో నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదేమైనా ఎన్నికల ఫలితాలు వెల్లడి అయితే కానీ ఈ అంశంపై స్పష్టత రాదు.