Begin typing your search above and press return to search.

అమెజాన్‌ అడువుల్లో అలనాటి నగరాల విశేషాలు అద్భుతః!

ఈ క్రమంలో తాజాగా ఒక ఆస్కతికరమైన విషయం ఈ అమెజాన్ గురించి తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   29 Jan 2024 3:30 AM GMT
అమెజాన్‌  అడువుల్లో అలనాటి నగరాల విశేషాలు అద్భుతః!
X

అమెజాన్ అడవుల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు! ప్రపంచం ఎంత అడ్వాన్స్ అయినా.. మనిషికి ఇప్పటికీ అది ఒక పెద్ద ప్రశ్నే! దక్షిణ అమెరికాలోనీ సుమారు తొమ్మిది దేశాల పరిధిలో విస్తరించిన ఈ మహారణ్యం గురించిన చర్చలు నిత్యం ఆసక్తికరంగానే ఉంటాయి.. సమాధానాలు లేని ప్రశ్నల కోసం నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉంటయి. ఈ క్రమంలో తాజాగా ఒక ఆస్కతికరమైన విషయం ఈ అమెజాన్ గురించి తెరపైకి వచ్చింది.


అవును... చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడవి అని చెప్పే అమెజాన్ లో మనిషికి అంతుచిక్కని ఎన్నో రహస్యాలు దాగిఉన్నాయని అంటారు. ఈ సమయంలో... అలాంటి అమెజాన్ లో ఒకప్పుడు ప్రజలు నివశించేవారని.. దానికోసం వారు కొన్ని నగరాలనే నిర్మించుకున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో... దట్టమైన అడవిలో ఇన్నాళ్లూ మరుగునపడిన ఆ నగరాలు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి.


దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఈక్వడార్‌ లోని అమెజాన్‌ అటవీ ప్రాంతంలో పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలు డ్రోన్‌ ద్వారా తీసిన ఫొటోల్లో ఈ పురాతన నగరం బయటపడిందని తెలుస్తుంది. ఈ నగరంలోని శిధిల అవశేషాలు ఆండెస్‌ పర్వతాలకు దిగువన ఉన్న లోయలో బయటపడినట్లు చెబుతున్నారు. ఈ అవశేషాలపై శాస్త్రవేత్తలు లేజర్‌ సెన్సార్ టెక్నాలజీని ఉపయోగించి పరిశోధనలు జరిపారు.


దీంతో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో భాగంగా ఈ నగరం పరిధిలో మట్టి, రాళ్లు ఉపయోగించి కట్టడాలను నిర్మించారని.. అవి దాదాపు ఆరువేల వరకూ ఉంటాయని.. వీటితోపాటు వ్యవసాయ క్షేత్రాలు, పంట కాలువలు, వీథుల్లో ముగురునీటి కాలువలు, నగరంలో సంచరించడానికి వీలుగా సుమారు ముప్పయి మూడు అడుగుల వెడల్పైన విశాలమైన రహదారులను గుర్తించినట్లు చెబుతున్నారు.

ఇక ఇక్కడి కట్టడాల్లో నివాస గృహాలు మాత్రమే కాకుండా... ఉమ్మడిగా ఊరంతా ఉపయోగించుకునే సమావేశ మందిరాలు, శ్మశాన వాటికలు వంటి నిర్మాణాలను గుర్తించారట శాస్త్రవేత్తలు. ఈ క్రమంలో... సుమారు రెండువేల ఏళ్ల కిందట ఈ నగరంలో పదివేల నుంచి ముప్పయి వేల మంది వరకు నివాసం ఉండేవారని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇదే సమయంలో... అసలు ఇక్కడి ప్రజలు ఏ పరిస్థితుల్లో అంతరించిపోయి ఉంటారో తెలుసుకోవడానికి పరిశోధనలు సాగించాల్సి ఉందని చెబుతున్నారు.