Begin typing your search above and press return to search.

రోడ్లే కదా అని చూస్తూ ఊరుకుంటే : కొత్త ఆలోచనతో బాబు !

రోడ్లే కదా అని చూస్తూ ఊరుకుంటే అవి ఎలాంటి చేదు ఫలితాలు ఇస్తాయో వైసీపీ పరాభవం ఒక ఉదాహరణగా నిలిచింది.

By:  Tupaki Desk   |   13 July 2024 2:30 AM GMT
రోడ్లే కదా అని చూస్తూ ఊరుకుంటే :  కొత్త ఆలోచనతో బాబు  !
X

ఏపీలో రోడ్లు జాతీయ స్థాయిలో చర్చకు తావిచ్చాయి. ఇవే రోడ్లు ఏపీలో వైసీపీని దారుణంగా ఓడించడానికి కారణం అయ్యాయి. రోడ్లే కదా అని చూస్తూ ఊరుకుంటే అవి ఎలాంటి చేదు ఫలితాలు ఇస్తాయో వైసీపీ పరాభవం ఒక ఉదాహరణగా నిలిచింది.

ఏపీ రోడ్లు అయిదేళ్ళుగా బాగుకు నోచుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. రొడ్డెక్కితే ఇంటికి రాకుండా నేరుగా పై లోకానికే పయనం అన్న తీరున సాగింది దురవస్థ. విపక్షాలు దీనిని ఆయుధంగా చేసుకుని వైసీపీ మీద ఎన్నో విమర్శలు చేశాయి. కానీ నాటి ప్రభుత్వం ఎందుకో పెద్దగా పట్టించుకోలేదు. సంక్షేమం తోనే క్షేమంగా గెలుస్తామని భావించి నట్లుంది.

అయితే వైసీపీని చిత్తుగా ఓడించి అధికారం చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలోని రోడ్ల మీద దృష్టి సారించింది. ముందుగా గుంతలు పూడ్చే పనిలో పడింది. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గానే ఉన్నారు. ఆయన విశాఖ జిల్లా టూర్ లో కూడా రోడ్ల దుస్థితి మీద సెటైర్లు వేశారు. గుంతలలో వైసీపీ నేతలను కూర్చోబెట్టాలని కామెంట్స్ చేశారు.

ఇదిలా ఉంటే రోడ్ల స్థితిగతుల మీద అధ్యయనం చేసిన బాబు ముందుగా గుంతలను పూడ్చే పనికి శ్రీకారం చుట్టాలని అధికారులను ఆదేశించారు. దానికి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని లెక్క తేలింది. అంతే కాదు. రాష్ట్రంలో నాలుగు వేల కిలోమీటర్లకు పైగా గుంతల సమస్య ఉందని తేలింది.వీటితో పాటుగా తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు మరో మూడు వేల కిలోమీటర్ల దాకా ఉన్నాయి.

అంటే ఏడు వేల కిలోమీటర్ల మేర రోడ్లకు తక్షణం మరమ్మతులు అవసరం పడుతోంది. కొత్తగా రోడ్లు వేయడం అంటే అయిదు నుంచి పది వేల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అందుకే ముందుగా రోడ్ల మీద గుంతలను పూడ్చే పనిని చేపట్టి ఆ మీదట పూర్తి స్థాయిలో రోడ్లు నిర్మాణం చేపట్టాలన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉంది.

అదే సమయంలో తరచూ రోడ్లు పాడవకుండా గుంతలు పడకుండా దీర్ఘకాలం పాటు మన్నిక ఉండేలా నూతన సాంకేతికతను వినియోగించాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీని కోసం సాంకేతిక నిపుణులు నిర్మాణ రంగ నిపుణులతో ప్రభుత్వం చర్చిస్తోంది.

దీని వల్ల తక్కువ ఖర్చుతో చాలా కాలం పాటు మన్నిక ఉండేలా రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటిదాకా ఒక ట్రెడిషనల్ సిస్టం లోనే రోడ్లు నిర్మాణం సాగుతోంది. రోడ్ల మీద తారు పోసి పిక్కలను వేసి నిర్మిస్తున్నారు. గట్టిగా వానలు పడితే ఆ రోడ్లు పాడవుతున్నాయి. అదే సమయంలో వాహనాల రద్దీ పెరిగిన నేపధ్యం ఉంది.

దాంతో సాంప్రదాయ పద్దతిలో కాకుండా పలు రకాల మెటీరియల్స్ ఉపయోగించి రోడ్ల నిర్మాణం చేపడితే కలిగే ప్రయోజనం అనేక రకాలుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతే కాదు రోడ్ల నిర్మాణం చేపట్టే ముందు ఆయా నేలల నేల తీరు తెన్నులు అధ్యయనం చేయడం, ట్రాఫిక్ రద్దీని కూడా దృష్టిలో ఉంచుకోవడం, అధిక వర్షాలను దృష్టిలో పెట్టుకుని రోడ్ల నిర్మాణం చేపట్టాలన్న దాని మీదనే ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తోంది. దీంతో రానున్న కాలంలో ఏపీ రోడ్ల దశ తిరుగుతుందని అంటున్నారు. అంతే కాదు ఏపీ రోడ్లు అభివృద్ధికి సూచికగా కూడా ఉండేలా ప్రభుత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు.