సిగ్గు విడిచేసి మాట్లాడేస్తున్నారు... వీళ్లా నాయకులు
కానీ, తప్పులు సమర్థించుకునే నాయకులు మాత్రం ఇటీవల కాలంలో పెరిగిపోయారు.
By: Tupaki Desk | 6 July 2024 3:00 AM GMTతప్పులు సరిచేసుకుంటామని చెప్పిన నాయకులు ఉన్నారు. తప్పులు జరగకుండా చూసుకుంటామని చెప్పిన నాయకులు కూడా ఉన్నారు. కానీ, తప్పులు సమర్థించుకునే నాయకులు మాత్రం ఇటీవల కాలంలో పెరిగిపోయారు. తాజాగా బిహార్‌లో వరుసగా బ్రిడ్జిలు కుప్పకూలుతున్న విషయం తెలిసిందే. వీటికి కారణాలు ఏంటనేది అందరికీ తెలిసిందే. నాలుగేళ్ల కిందట కట్టిన భారీ బ్రిడ్జిలు కూడా.. కుప్పకూలడం.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవి కూడా.. నీటమునగడం వంటివి బిహార్‌లో అవినీతి పాలన ఏ రేంజ్‌లో జరుగుతోందో చెప్పకనే చెబుతున్నాయి.
కానీ, పాలకులు ఎవరు మాత్రం తప్పులు ఒప్పుకొంటున్నారు. ప్రధాని అంతటివారికే.. తప్పులు కనిపించడం లేదు. తప్పులు చేసిన వారూ కనిపించడం లేదని.. రాహుల్‌గాంధీ పార్లమెంటులో నిలదీసినా.. ఎన్డీయే కూటమి పార్టీల నాయకులు ఇంకా కళ్లు తెరవలేదు. తాజాగా ఈ పరంపరలో బిహార్ మంత్రి, గతంలో మోడీ దగ్గర కేంద్ర మంత్రిగా పనిచేసిన.. జితిన్ రాం మాంఝీ .. చేసిన వ్యాఖ్యలు విన్నాక.. ఇలాంటి నేతలు ఉండడం ఈ దేశం చేసుకున్న అదృష్టం! అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆయన దేని గురించి మాట్లాడారంటే.. బిహార్‌లో గత వారం పది రోజులుగా కుప్పకూలిన ఆరు బ్రిడ్జిల గురించే.
ఆయనేదో.. తప్పులు తమపై వేసుకున్నారని అనుకుంటారా? లేక.. ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని అనుకున్నారా? అంటే.. లేనే లేదు. చాలా చక్కగా ఎలాంటి తడబాటు లేకుండా.. బిహార్ బ్రిడ్జిలు ఎందుకు కూలుతున్నాయో.. చెప్పారు మాంఝీ. ``రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టే ప్రాజెక్టులు కూలుతున్నాయి. మేమేం చేస్తాం. వర్షానికి చెయ్యి పెట్టి నిలబడతా మా? కురుస్తున్న మేఘాలను వెళ్లిపోవాలంటూ.. కర్ర పెట్టి తరిమి కొడతామా?`` అని చక్కగా సెలవిచ్చారు. దీనికి సంబంధించి న కొంత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిని విన్నవారు.. ఇలాంటివారు ఉండడం ఈ దేశం చేసుకున్న అదృష్టం అని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇలాంటి చిత్రం ఒక్క బిహార్‌తోనే సమసిపోలేదు. రెండు రోజుల కిందట యూపీలో జరిగిన హథ్రాస్ ఘోరంపై.. అక్కడి బీజేపీ నేతశ్రీ ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కడ సుమారు 150 మందికిపైగా భోలే బాబా సత్సంగ్‌లో పాల్గొని .. తొక్కిసలాట కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై ఆ మహిళా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ``భోలే బాబా అందరికీ తెలిసినవారే. ఇంట్లో కూర్చుని టీవీలో చూస్తే.. ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు కదా! అసలు అంత మంది ఎందుకు వెళ్లారో నాకు అర్థం కావడం లేదు. పైగా తోసుకున్నారు`` అని తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇక్కడే మరో చిత్రం కూడా ఉంది.. ఈమెను వివరణ కోరాల్సిన బీజేపీ సర్కారు.. ఆమె వ్యాఖ్యలు వ్యక్తిగతమంటూ తప్పించేసు కుంది. ఇక, గత ఏడాది ఒడిశాలో జరిగిన రైలు దుర్ఘటనలో 350 మంది ప్రయాణికులు మృతి చెందారు. అప్పట్లోనూ బీజేపీ నాయకులు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వినే వుంటారు. `రైళ్లలో ప్రయాణించమని వారికి ఎవరు చెప్పారు. ప్రమాదం చెప్పి జరుగుతుందా`` అని నోరు పారేసుకున్నారు. సో.. ఇలాంటివారిని ఉద్దేశించే ఈ దేశం చేసుకున్న అదృష్టమని అంటున్నారు.