Begin typing your search above and press return to search.

టీడీపీ-జన‌సేన‌లో ఇదే హాట్ టాపిక్.. విష‌యం ఏంటంటే..!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు పొత్తుల‌పై క్లారిటీ లేక‌పోవ‌డం, మ‌రోవైపు ప‌వ‌న్‌ను సీఎంగా చూడాల‌న్న కాపు నాయకుల ఆశ‌లు.. నేప‌థ్యంలో జ‌న‌సేన‌లో ఇప్ప‌టికీ సీఎం సీటుపై చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది.

By:  Tupaki Desk   |   16 Nov 2023 12:30 AM GMT
టీడీపీ-జన‌సేన‌లో ఇదే హాట్ టాపిక్.. విష‌యం ఏంటంటే..!
X

ఒక‌వైపు స‌మ‌న్వ‌య స‌మావేశాలు.. మ‌రోవైపు ఉమ్మ‌డి మేనిఫెస్టో తొలి ద‌శ విడుద‌ల‌. మొత్తంగా వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ-జ‌న‌సేన పార్టీలు యుద్ధ‌రంగంలోకి దిగిపోయాయి. ప‌క్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నాయి. ప్ర‌తి ప‌దిహేను రోజుల‌కు ఒక‌సారి స‌మ‌న్వ‌య క‌మిటీలు భేటీలు కావాల‌ని కూడా నిర్ణ‌యించాయి. తొలుత ఇరు పార్టీల్లోనూ నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యానికి రెండు పార్టీలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు పొత్తుల‌పై క్లారిటీ లేక‌పోవ‌డం, మ‌రోవైపు ప‌వ‌న్‌ను సీఎంగా చూడాల‌న్న కాపు నాయకుల ఆశ‌లు.. నేప‌థ్యంలో జ‌న‌సేన‌లో ఇప్ప‌టికీ సీఎం సీటుపై చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది. దీనిపై ప‌వ‌న్ ఒకింత క్లారిటీ ఇచ్చినా.. ప్ర‌స్తుతం తాను త‌ప్పుకొంటున్నాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించినా.. జ‌నసేన నాయ‌కులు మాత్రం ప‌వ‌న్‌నే ఇంకా సీఎంగా చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల స‌మ‌యానికి వారిని మార్చే ప్ర‌క్రియ జ‌రుగుతోంది.

ఇక‌, టీడీపీలోనూ.. నాయ‌కులు క‌లిసి వెళ్లే అంశంపై త‌ర్జ‌న భ‌ర్జ‌న జ‌రుగుతూనే ఉంది. ఏయే స్థానాల్లో జ‌న‌సేన‌కు అవ‌కాశం ఇస్తారు? ఏయే స్థానాల‌ను వ‌దిలి పెడ‌తార‌నే చ‌ర్చ సాగుతోంది. ఈ నేప‌థ్యంలో రెండు పార్టీల నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కీల‌కంగా మారింది. అయితే.. అధిష్టానాలు అలా ఆలోచిస్తుంటే.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు మాత్రం సీట్ల‌పై చ‌ర్చిస్తున్నారు. ఏయే స్థానాలు వ‌దిలేస్తార‌నే చ‌ర్చ ముమ్మ‌రంగా ఉంది.

ముందు.. టికెట్లు తేల్చాలంటూ. కొంద‌రు నాయ‌కులు తాజాగాజ‌రిగిన స‌మ‌న్వ‌య స‌మావేశంలో డిమాం డ్ చేశారు. దానిని బ‌ట్టి తాము కార్యాచ‌ర‌ణ రూపొందించుకుంటామ‌ని వారు చెబుతున్నారు. కానీ, ఇది ఇప్ప‌టికిప్పుడు ప్ర‌క‌టిస్తే.. పొత్తుకు ప్ర‌మాదం ఏర్ప‌డ‌డ‌మో.. లేక రెబ‌ల్స్ పెర‌గ‌డోమో.. ఇవీ కాక‌.. వైసీపీకి ఛాన్స్ ఇచ్చిన‌ట్టు అవుతుంద‌నో ఇరు పార్టీల నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో టికెట్ల విష‌యాన్ని ఒకింత జాప్యం చేస్తున్నారు. అయితే.. నాయ‌కులు మాత్రం ప‌ట్టుబడుతున్నారు. దీంతో స‌మ‌న్వ‌య స‌మావేశాలు సాగుతున్నా.. వాటి ఫ‌లితం మాత్రం క్షేత్ర‌స్థాయిలో క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.