Begin typing your search above and press return to search.

హైదరాబాద్ పోలీసుల అదిరే ఐడియా.. ఆకతాయికి భార్యతో ‘ట్రీట్ మెంట్’

హైదరాబాద్ మహానగరంలో ఏడాది మొదట్లో జరిగే అతి పెద్ద కార్యక్రమం నాంపల్లి న్యూమాయిష్.

By:  Tupaki Desk   |   1 Feb 2024 11:00 AM IST
హైదరాబాద్ పోలీసుల అదిరే ఐడియా.. ఆకతాయికి భార్యతో ‘ట్రీట్ మెంట్’
X

ఆకతాయిలు దిమ్మ తిరిగేలా షాకిచ్చారు హైదరాబాద్ పోలీసులు. వారికి ఎలా అయితే బుద్ధి వస్తుందో అలాంటి తీరును ప్రదర్శించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రద్దీ ప్రాంతాలతో పాటు.. కొన్ని కీలక కార్యక్రమాలు జరిగే చోటుకు చేరుకునే ఆకతాయిలు.. మహిళల్ని తాకటం.. అసభ్యంగా ప్రవర్తించటం లాంటివి చేస్తుంటారు. ఇలా చేసే వారిని అదుపులోకి తీసుకునేందుకు తెలంగాణలో షీటీంలు పని చేస్తుంటాయి. హైదరాబాద్ మహానగరంలో ఏడాది మొదట్లో జరిగే అతి పెద్ద కార్యక్రమం నాంపల్లి న్యూమాయిష్.

ఈ ఎగ్జిబిషన్ కు దేశంలోని నలుమూలల నుంచి వచ్చే వ్యాపారులతో భారీగా ఏర్పాటు చేస్తుంటారు. ఇక్కడకు పెద్ద ఎత్తున మహిళలు రావటం తెలిసిందే. దీన్ని అదునుగా తీసుకొని కొందరు పోకిరీలు రద్దీగా ఉండే న్యూమాయిష్ లో మహిళల్ని తాకుతూ ఉంటారు. తాజాగా ఇలాంటి చిల్లర చేష్టలు చేసే వ్యక్తిని మఫ్టీలో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అతన్ని బేగంబజారు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మామూలుగా అయితే నాలుగు దెబ్బలతో బుద్ది చెప్పే ప్రయత్నం చేసి.. కేసు కట్టేస్తుంటారు. ఇలా చేస్తే వారికి బుద్ధి రాదని అనుకున్నారేమో కానీ.. ఈసారి రోటీన్ కు భిన్నంగా వ్యవహరించారు. సదరు ఆకతాయి భార్యను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. అతడు చేసే ఘనకార్యాన్ని వివరించారు. తాము చెబితే ఆమె నమ్ముతుందో లేదో అన్న ఉద్దేశంతో.. సీక్రెట్ గా రికార్డు చేసిన అతడి చిల్లర పనుల వీడియోను ఆమెకు చూపించారు. పోలీసులు చూపించిన వీడియోను చూసి షాక్ తిన్న ఆమె.. ఆ వెంటనే పోలీస్ స్టేషన్ లోనే భర్త చెంపను ఛెళ్లుమనిపించింది. వెకిలి చేష్టలకు పాల్పడే వారికి సరైన రీతిలో షాకిచ్చేలా వ్యవహరించిన బేగంబజార్ పోలీసుల తీరు బయటకు వచ్చింది. అందరూ ఆ తీరును అభినందిస్తున్నారు. ఆకతాయిలకు ఇలాంటి స్పెషల్ ట్రీట్ మెంట్ మంచిదన్న మాట వినిపిస్తోంది.