Begin typing your search above and press return to search.

చోరకళ స్టార్... 100 రోజులు.. 200 విమానాలు..!

తాజాగా పోలీసులకు పట్టుబడిన ఇతడు చెప్పిన వివరాలు, చేసిన దొంగతనాలు, ఈ క్రమంలో అందుకు ఎంచుకున్న మార్గాలు, అందులో అవలంభిస్తున్న టెక్న్సిక్సూ వైరల్ గా మారాయి.

By:  Tupaki Desk   |   14 May 2024 5:07 AM GMT
చోరకళ స్టార్... 100 రోజులు.. 200 విమానాలు..!
X

చోర కళనే నమ్ముకున్న ఓ వ్యక్తి.. ఆ కళలో తనకున్న స్కిల్స్ ని డిఫరెంట్ గా ప్రజెంట్ చేయాలనుకున్నట్లున్నాడు! ఇందులో భాగంగా... విమాన ప్రయాణికులే లక్ష్యంగా దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. అందులోనూ కనెక్టింగ్ ఫ్లైట్స్ ప్రయాణికులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. ఇదే సమయంలో ఒంటరి మహిళలపైనా స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలోనే 100 రోజుల్లో సుమారు 200 విమానాల్లో ప్రయాణించి.. చేతివాటం చూపించాడు.

అవును... ఒక వ్యక్తి 100 రోజుల్లో సుమారు 200 విమానాల్లో పర్యటించాడు. అలా అని పెద్ద బిజినెస్ మేన్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే! మనోడు దొంగతనాలు చేయడానికి విమాన ప్రయాణమే బెస్ట్ అని భావించినట్లున్నాడు! తాజాగా పోలీసులకు పట్టుబడిన ఇతడు చెప్పిన వివరాలు, చేసిన దొంగతనాలు, ఈ క్రమంలో అందుకు ఎంచుకున్న మార్గాలు, అందులో అవలంభిస్తున్న టెక్న్సిక్సూ వైరల్ గా మారాయి.

వివరాళ్లోకి వెళ్తే... హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ ప్రయాణించిన ఓ మహిళ తన హ్యాండ్ బ్యాగ్‌ నుంచి సుమారు రూ.7 లక్షలు విలువ చేసే ఆభరణాలు పోయాయని పోలీసులను ఆశ్రయించారు. ఇదే క్రమంలో... మరో ప్రయాణికుడు సుమారు రూ.20 లక్షలు విలువ చేసే వస్తువులు కనిపించకుండా పోయాయని ఫిర్యాదు చేశారు! ఇదే తరహాలో పలు విమానాశ్రయాల పరిధిలోనూ దొంగతనాలు నమోదయ్యాయి.

దీంతో ఈ వ్యవహారంపై సీరియస్ గా దృష్టి సారించారు పోలీసులు. ఈ క్రమంలో ఇదంతా ఒక ముఠా పని అయ్యుంటుందని అనుమానించారు. ఈ సమయంలో ఆయా ప్రాంతాల్లోని సీటీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించారు. ఈ క్రమంలో ప్రతీ కెమెరాలోనూ అనుమానంగా అనిపించిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జరిగిన విచారణలో దొంగ బయటపడ్డాడు. అతని పేరు రాజేష్ కపూర్‌!

ఈ సందర్భంగా స్పందించిన ఢిల్లీ పోలీసులు... కనెక్టింగ్‌ ఫ్లైట్లలో ప్రయాణంచేవారిని ఈ రాజేష్ కపూర్‌ లక్ష్యంగా చేసుకునేవాడని.. అందులోనూ కాస్త వయసు పైబడిన మహిళలను గురిపెట్టేవాడని చెబుతున్నారు. విమానాశ్రయంలోనే వారిపై నిఘావేసి.. వారి వ్యవహారశైలిని నిశితంగా గమనించేవాడు. అనంతరం నెమ్మదిగా అనుసరిస్తూ.. బ్యాగేజ్‌ పై ఉండే స్లిప్‌ ను పరిశీలించేవాడని.. తద్వారా అందులో ఏయే వస్తువులు ఉన్నాయో అంచనాకు వచ్చేవాడని తెలిపారు!

ఈ సమయంలో వారితో మాట కలిపి.. విమానంలోకి వెళ్లాక సిబ్బందికి ఏదో ఒక కారణం చెప్పి తాను లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి దగ్గరకు సీటును మార్పించుకునేవాడట. ఈ క్రమంలో... నెమ్మదిగా లేచి బ్యాగేజ్‌ ను ఏదో సర్దుతున్నట్లు నటిస్తూ.. తన చేతివాటాన్ని ప్రదర్శించి విలువైన వస్తువులను కొట్టేసేవాడని అంటున్నారు!

ఈ క్రమంలో ఇతడిని ఢిల్లీ పహార్‌ గంజ్‌ లో ఉన్న తన గెస్ట్ హౌస్ "రిక్కీ డీలక్స్‌" లో అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. ఆ ఇంట్లోనే పోలీసులు పెద్ద ఎత్తున బంగారం, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారని సమాచారం. వాటిలో ఇప్పటికే కొన్నింటిని పక్క వీధిలో ఉండే నగల వ్యాపారికి అమ్మేసినట్లు చెప్పాడని తెలుస్తుంది.