Begin typing your search above and press return to search.

కర్నూలు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య.. వేట కొడవళ్లతో..!

పార్టీ అధికారంలో ఉండి అలాంటి పరిణామాలు ఎక్కువగా ప్రచారం జరిగితే డ్యామేజ్ ఎక్కువగా జరుగుతుందన్న ఉద్దేశంతో మౌనంగా ఉంటున్నారన్న మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   15 Aug 2024 4:36 AM GMT
కర్నూలు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య.. వేట కొడవళ్లతో..!
X

ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కారుకొలువు తీరిన తర్వాత వైసీపీ కార్యకర్తల్ని దారుణంగా చంపేస్తున్న ప్రచారం జరగటం తెలిసిందే. 40 రోజుల్లో 36 మంది దారుణ హత్యకు గురయ్యారన్న వైసీపీ అధినేత మాటతో జాతీయ మీడియా సైతం ఏపీ వైపు చూసిన పరిస్థితి. ఈ ప్రచారంతో జరుగుతున్న డ్యామేజ్ ను గుర్తించిన టీడీపీ.. హత్యకు గురైన 36 మంది జాబితా అడగటం.. ఆ తర్వాత నుంచి ఆ అంశం తెర మీదకు రాకుండా ఆగిపోయింది. కట్ చేస్తే.. చంద్రబాబు సీఎం అయ్యాక ఏపీలోని పలు జిల్లాల్లో టీడీపీ నాయకులు.. కార్యకర్తలు హత్యలకు గురైన పరిస్థితి. పార్టీ అధికారంలో ఉండి అలాంటి పరిణామాలు ఎక్కువగా ప్రచారం జరిగితే డ్యామేజ్ ఎక్కువగా జరుగుతుందన్న ఉద్దేశంతో మౌనంగా ఉంటున్నారన్న మాట వినిపిస్తోంది.


ఇదిలా ఉంటే.. తాజాగా కర్నూలు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. బహిర్భూమికి వెళ్లిన తెలుగుదేశం పార్టీ నేతను వెనుక నుంచి వేట కొడవళ్లతో నరికేసి చంపేశారు. అనంతరం తమ ఆచూకీ బయటకు రాకుండా ఉండేందుకు డెడ్ బాడీ మీదా.. చుట్టుపక్కల పరిసరాల్లో కారం జల్లి.. ఆనవాళ్లు దొరక్కుండా ప్రయత్నం చేయటం గమనార్హం. సంచలనంగా మారిన ఈ ఉదంతం కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలోని హోసూరు గ్రామంలో చోటుచేసుకుంది.

మొదట్నించి హోసూరు గ్రామం టీడీపీకి కంచుకోట. గ్రామానికి చెందిన టీడీపీ నేత వాకిటి శ్రీనివాసులు ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపులో కీలకంగా పని చేశారన్న పేరుంది. బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల వేళలో.. ఇంటి నుంచి పొలాల్లో బహిర్భూమికి వెళ్లారు. ఆ సమయంలో గుర్తు తెలియని వారు వెనుక నుంచి తలపై వేటకొడవళ్లతో దాడి చేయటంతో.. అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత కారం జల్లి.. అక్కడి నుంచి పరారయ్యారు. శ్రీనివాస్ డెడ్ బాడీని చూసిన వారు.. కుటుంబ సభ్యులకు చెప్పటంతో ఈ ఘోరం వెలుగు చూసింది. హత్య గురించి సమాచారం తెలిసినంతనే ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు హుటాహుటిన బాధితుడి ఇంటికి వెళ్లారు. తీవ్రమైన భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. ఈ హత్య రాజకీయ హత్యగా పేర్కొంటున్నారు.

టీడీపీలో కీలక నాయకుడిగా ఎదిగిన శ్రీనివాస్ ను అడ్డు తొలిగించుకోవం కోసమే ఇలాంటి దారుణానికి పాల్పడి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2013 సర్పంచ్ ఎన్నికల్లో శ్రీనివాస్ భార్య శారద టీడీపీ మద్దతుతో సర్పంచ్ గా ఎన్నికయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ టీడీపీ గెలుపులో కీలకభూమిక పోషించారు. ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న శ్రీనివాస్ ఎదుగుదలను ఓర్వలేని వారే హత్య చేయించి ఉంటారని భావిస్తున్నారు. శ్రీనివాసుల హత్యపై అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.