Begin typing your search above and press return to search.

ఆర్టీసీ బస్సు ఆపలేదని బీర్ బాటిల్ పామును విసిరిన హైదరాబాద్ మహిళ

ఆపకుండా వెళ్లిపోతున్న బస్సు మీద బీర్ బాటిల్ విసిరి.. ఆగిన బస్సులోని కండక్టర్ మీదకు పామును విసిరి భయభ్రాంతులకు గురి చేసిన వైనం చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   9 Aug 2024 4:38 AM GMT
ఆర్టీసీ బస్సు ఆపలేదని బీర్ బాటిల్   పామును విసిరిన హైదరాబాద్ మహిళ
X

రోడ్డు మీద నిలబడి.. చేయి ఎత్తి ఆర్టీసీ బస్సును ఆపటం.. కొన్ని సందర్భాల్లో తప్పించి చాలా సందర్భాల్లో ఆపకుండా వెళ్లిపోయే అనుభవం హైదరాబాద్ లోని చాలామందికి ఎదురవుతూ ఉంటుంది. మామూలుగా అయితే.. ఆపకుండా వెళ్లిపోయే బస్సును.. ఆ బస్ డ్రైవర్ ను తిట్టుకోవటం చేస్తుంటాం. అయితే.. హైదరాబాద్ కు చెందిన ఒక మహిళ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. ఆపకుండా వెళ్లిపోతున్న బస్సు మీద బీర్ బాటిల్ విసిరి.. ఆగిన బస్సులోని కండక్టర్ మీదకు పామును విసిరి భయభ్రాంతులకు గురి చేసిన వైనం చోటు చేసుకుంది.

షాకిచ్చే ఈ ఉదంతం విద్యానగర్ లో చోటు చేసుకుంది. దిల్ సుఖ్ నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గురువారం సాయంత్రం సికింద్రాబాద్ నుంచి ఎల్బీ నగర్ వైపు వెళుతోంది. విద్యానగర్ బస్టాప్ సమీపంలోని సిగ్నల్ వద్ద ఫ్రీ లెఫ్ట్ లో తిరుగుతోంది. ఈ సందర్భంగా బస్సు ఆపాలని ఒక మహిళ చెయ్యి ఎత్తింది. అయినప్పటికీ బస్సు ఆగలేదు. దీంతో కోపానికి పోయిన ఆమె.. బస్సు వెనుక అద్దంపైకి సంచిలోని బీరు బాటిల్ ను కోపంగా విసిరింది. దీంతో.. అద్దం పగిలింది.

దీంతో.. బస్సును డ్రైవర్ ఆపేశాడు. బీర్ బాటిల్ దెబ్బకు వెనుక అద్దం పూర్తిగా ధ్వంసమైంది. బస్సులోని కండక్టర్ కిందకు దిగి.. నిందితుల్ని పట్టుకొని.. బస్సు మీద ఎందుకు దాడి చేశామని ప్రశ్నించింది. ఈ సందర్భంగా బస్సు ఆపని వైనం గురించి చెబుతూ.. కోపంతో తన సంచిలోని ఒక పామును బయటకు తీసి మహిళా కండక్టర్ మీదకు విసరటంతో ఒక్కసారిగా భయపడిన ఆమె చేతులు అడ్డుపెట్టుకోవటంతో పాము కింద పడింది.

దీంతో..మహిళా కండక్టర్ భయాందోళనలకు గురైంది. ఈ అంశంపై నల్లకుంట పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. బస్టాప్ లో బస్సు ఆపలేదంటూ సదరు మహిళ వాదిస్తోంది. బస్సు ఆపకుంటే మాత్రం బస్సు మీద ఈ తరహా దాడి చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మహిళా కండక్టర్ మీద పాము విసిరిన మహిళ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.