ఈసారి అసెంబ్లీ దద్దరిల్లాల్సిందే !
జగన్, చంద్రబాబు, పవన్ లోకేష్ అంతా ఒకే వేదిక మీద కనిపించే చాన్స్ ఉంటుంది అని అంటున్నారు.
By: Tupaki Desk | 27 May 2024 3:37 AM GMTఏపీలో హోరా హోరీ పోరు సాగింది. ఎన్నికలు పూర్తి అయ్యాయి. కౌంటింగ్ కి గడువు దగ్గర పడింది. మరొక వారం రోజులు ఓపిక పడితే ఎవరు విజేత అన్నది తేలనుంది. కొత్త ప్రభుత్వం వస్తే జూన్ నెలలో అసెంబ్లీ మొదటి సమావేశం జరుగుతుంది. ఈసారి అసెంబ్లీలో చాలా కళ కనిపిస్తుంది అని అంటున్నారు.
జగన్, చంద్రబాబు, పవన్ లోకేష్ అంతా ఒకే వేదిక మీద కనిపించే చాన్స్ ఉంటుంది అని అంటున్నారు. పొజిషన్స్ అపొజిషన్స్ ఎవరివి అయినా వీరంతా అసెంబ్లీలో మెరుస్తారు అని అంటున్నారు. ఇక సర్వేలు కానీ అంచనాలు కానీ చూస్తే ఈసారి అధికార పక్షానికి బొటా బొటీ సీట్లు దక్కుతాయని అంటున్నారు.
అంటే దాని అర్ధం వంద సీట్లకు అటూ ఇటూగా అని చెబుతున్నారు. ఆ మిగిలిన డెబ్బై నుంచి డెబ్బై అయిదు సీట్లు ప్రతిపక్షానికి వస్తాయని లెక్క కడుతున్నారు. ఒక అసెంబ్లీలో డెబ్బై మంది విపక్షం అంటే అత్యంత బలమైనదిగా భావించాల్సి ఉంటుంది. దాంతో సభలో రానున్న అయిదేళ్ళూ హోరాహోరీ పోరు సాగనుంది అని విశ్లేషిస్తున్నారు.
చంద్రబాబు హయాంలో 105 మందితో అధికార పక్షంలో టీడీపీ ఉంటే 67 మందితో విపక్షంలో వైసీపీ ఉంది. ఆనాడు అసెంబ్లీలో నువ్వా నేనా అన్న పరిస్థితి కొనసాగింది. 2019లో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా అందరూ దాదాపుగా సీనియర్లు కావడంతో 151 సీట్లు సాధించిన వైసీపీని ముప్పతిప్పలు పెట్టారు.
అసెంబ్లీ జరిగిన ప్రతీ సారీ వాడిగా వేడిగా సభ సాగింది. అలా అసెంబ్లీ హీటిక్కిన సందర్భాలే అత్యధికంగా కనిపించాయి. ఈసారి దానికి మించి అన్నట్లుగా కొత్త అసెంబ్లీ ఉంటుంది అని అంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చినా కట్టడి చేయడానికి కూటమి విపక్షంలో ఎన్నడూ లేనంత బలంతో ఉంటుంది అని అంటున్నారు.
అలాగే కూటమి అధికారం చేపట్టినా వైసీపీ విపక్షంలో ఉంటూ కొరకరాని కొయ్యగా మారే ప్రమాదం ఉంది అని అంటున్నారు. అటు నుంచి ఇటూ జంపింగులు కూడా పెద్దగా జరిగే వీలు ఉండదని, గతానుభవాలతో ఎవరూ పెద్దగా సాహసించరని అంటున్నారు. ఇక ఆనాడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకుని టీడీపీ 2019లో రాజకీయంగా నష్టాన్నే తెచ్చుకుందని గుర్తు చేస్తున్నారు. పైగా అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదైనా ఆశావహులు చాలా మంది ఉంటారు కాబట్టి వారిని పక్కన పెట్టడం జరగదు అంటున్నారు.
దాంతో ఎక్కడి వారు అక్కడే ఉంటూ చట్ట సభలలో తమ బలాబలాలను చూపించాల్సి ఉంటుంది అని అంటున్నారు. మొత్తానికి ఏపీలో కొత్త శాసన సభ మాత్రం ఈసారి కడు ఆసక్తికరంగా ఉంటుందని ముందే ఊహిస్తున్నారు.