ఇంటికి వచ్చిన లాయర్ ను బయట పడేయించిన జేసీ!
ఇలాంటివారి విషయంలో ఎంత కఠినంగా ఉండాలన్న విషయాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి చేతల్లో చేసి చూపించారు.
By: Tupaki Desk | 18 July 2024 7:26 AM GMTఏపీలో రాజకీయం ఎలా మారింది. గతంలో ఎలా ఉండేది పక్కన పెడితే.. గడిచిన ఐదేళ్లలో చోటు చేసుకున్న మార్పులు అన్ని ఇన్ని కావు. రాజకీయ వైరం వ్యక్తిగత వైరాన్ని మించేయటం.. ముఖముఖాలు చూసుకోలేనంత వరకు వెళ్లిపోవటం తెలిసిందే. కట్ చేస్తే.. ఈ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఏపీలో అధికార బదిలీ జరిగింది. దీంతో రాజకీయ వాతావరణం కొత్త రూపురేఖలు సంతరించుకుంది. వైసీపీ పాలనలో చెలరేగిపోయిన పలువురు.. పవర్ పోయిన తర్వాత పార్టీని వదిలేసి.. అధికార టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటివారి విషయంలో ఎంత కఠినంగా ఉండాలన్న విషయాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి చేతల్లో చేసి చూపించారు.
తన ఇంటికి వచ్చిన వైసీపీ లాయర్ శ్రీనివాస్.. తాను టీడీపీలో చేరతానని.. పార్టీకి సేవలు అందిస్తానని.. గతంలో తాను చేసిన తప్పుల్ని మన్నించాలంటూ ప్రాధేయపడగా.. అందుకు జేసీ ససేమిరా అన్నారు. పార్టీలోకి రావటం కుదరదని తేల్చేశారు. అయినప్పటికీ.. సదరు లాయర్ ఎంతకూ మాట వినకపోవటంతో.. ఇంట్లోని అనుచరులతో రోడ్డు మీదకు తీసుకెళ్లి వదిలేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలోకి వచ్చేందుకు సదరు లాయర్ పట్ల ఇంతలా ఎందుకు వ్యవహరించినట్లు? అన్నది ప్రశ్నగా మారింది.
కట్ చేస్తే.. వైసీపీ అధికారంలో ఉన్న వేళలో తాడిపత్రికి చెందిన ఈ లాయర్ నోరు పారేసుకునేవారు. ఎంతలా అంటే.. ఆయన పాత వీడియోలు ఇప్పటికి పలువురు టీడీపీ కార్యకర్తలు.. సానుభూతిపరులు దాచి పెట్టుకునేంతగా ఉండేవి. తెలుగుదేశం పార్టీకి చెందినోడు ఎవడైనా సరే.. కెలికే ప్రయత్నం చేస్తే వాడి జీవితం అంతమైపోయినట్లే. అవతల వారికి ఇది వార్నింగ్. నన్ను కెలికితే ఒక్కడు కూడా భూమి మీద ఉండడు. అక్కడ జరిగే ప్రతి ప్రెస్ మీట్ కు నా నుంచే రిప్లై ఉంటుంది’’ అంటూ చెలరేగిపోయేవాడు.
అలాంటి లాయర్ శ్రీనివాస్ ఈ రోజున టీడీపీ గెలిచిన తర్వాత.. పాత తప్పుల్ని పట్టించుకోవద్దని.. తన మాటల్ని సీరియస్ గా తీసుకోవద్దని చెబుతూ తనను పార్టీలోకి చేర్చుకోవాలని కోరారు. అందుకే.. జేసీ ససేమిరా అన్నారు. అయినప్పటికీ సదరు లాయర్ మాత్రం తనను పార్టీలో చేర్చుకోవాలని ప్రాధేయపడటంతో సీరియస్ అయిన జేసీ.. తన అనుచరులతో అతడ్ని తన ఇంటి నుంచి ఎత్తేసి.. రోడ్డు మీదకు తీసుకెళ్లి దించేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన పలువురు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు హద్దులు దాటి ప్రవర్తించిన ఎవరి విషయంలో అయినా ఇలానే వ్యవహరించాలని.. ఈ వీడియోను పార్టీ అధినేత చంద్రబాబుకు చూపించాలన్న వ్యాఖ్యలు వినిపించటం గమనార్హం. మరి.. ఈ వీడియోను చంద్రబాబు చూశారో.. లేదో?