అప్పుడు చింతమనేని.. ఇప్పుడు నందిగం సురేష్.. !
ఇంకో రకంగా చెప్పాలంటే.. అప్పట్లో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ మాదిరిగా సురేష్ పరిస్థితి మారిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
By: Tupaki Desk | 8 Oct 2024 3:30 PM GMTరాజకీయాలన్నాక.. రాజకీయాలే. 'విధిచేయు వింతలన్నీ..' అన్నట్టుగా నాయకులు సతమతం అవుతు న్నారు. వైసీపీ నాయకుడు, మాజీ ఎంపీ నందిగం సురేష్ పరిస్థితి కుడితో పడ్డ ఎలుక మాదిరిగా మారిపో యింది. ఇంకో రకంగా చెప్పాలంటే.. అప్పట్లో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ మాదిరిగా సురేష్ పరిస్థితి మారిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒక కేసులో బెయిల్.. మరో కేసులో జైలు! ఇదీ ఇప్పుడు నందిగం పరిస్థితి.
ఒక ఏడాది కిందటకు వెళ్తే.. దెందులూరు ప్రస్తుత ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఆయనపై కక్ష కట్టినట్టుగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించింది. కేసులపై కేసులు పెట్టి వేధించింద ని టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున వాపోయారు. ఒక కేసులో బెయిల్ తెచ్చుకున్నా.. వెంటనే మరో కేసు.. ఇలా.. 65 కేసుల్లో చింతమనేనిని ఏడాదిన్నర పాటు జైలుకే పరిమితం చేశారని టీడీపీ నాయకుల లెక్క.
ఇప్పుడు యాదృచ్ఛికంగా ఇదే పరిస్థితి బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు కూడా ఎదురైంది. ఆయనపై టీడీపీ కార్యాలయంపై దాడి కేసు వేలాడుతోంది. ఈ క్రమంలోనే గత నెలలో ఆయనను అరెస్టు చేసి గుంటూరు జైల్లో ఉంచారు. దానిలో నానా తిప్పలు పడి హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్న ఆయనకు ఎంతో కొంత ఉపశమనం లభించిందని అనుకుంటున్న సమయంలో వెలగపూడిలో హత్యకు గురైన మరియమ్మ కేసును తిరగదోడారు.
ఇంకేముంది.. బెయిల్ పై ఆయన బయటకు కూడా రాకుండానే ఈ కేసులో అరెస్టు చేసి.. మళ్లీ 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. దీనిపై బెయిల్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే.. ఇంతలోనే మరో కేసు నమోదుకు.. తుళ్లూరు పోలీసులు రెడీ అయ్యారు. అది.. అప్పట్లో అమరావతి రైతులను కించపరిచి, అమరావతి కోసం ఉద్యమిస్తున్నవారిపై దాడి చేశారని. ఈ కేసును రాజధాని రైతులు రెండేళ్ల కిందటే నమోదు చేశారు. ఇప్పుడు దానిని ఫ్రెష్‌గా మొదలు పెట్టారు. సో.. ఇప్పుడు హత్య కేసులో బెయిల్ రాగానే.. ఈ కేసు వెంటాడడం ఖాయం. సో.. రాజకీయాలంటే ఇలానే ఉంటాయి!!