Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్ర మీద వరుణుడి పంజా...రెడ్ సిగ్నల్ తో వణుకు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంద్ర మీద పంజా విసిరింది.

By:  Tupaki Desk   |   8 Sep 2024 2:11 PM GMT
ఉత్తరాంధ్ర మీద వరుణుడి పంజా...రెడ్ సిగ్నల్ తో వణుకు
X

నిన్నటిదాకా బెజవాడను హడలెత్తించిన భారీ వానలు వరదలు ఇపుడు ఉత్తరాంధ్ర వైపు వచ్చాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంద్ర మీద పంజా విసిరింది. దీంతో ఎడతెరిపి లేకుండా భారీ ఎత్తున వానలు కురుస్తునాయి.

తీవ్ర తీవ్ర వాయుగుండం ప్రభావంతో విశాఖ‌ప‌ట్నంలో శ‌నివారం రాత్రి నుంచి ఆదివారం రోజంతా గ్యాప్ లేకుండా పెద్ద ఎత్తున వర్షం కురుస్తోంది. గడచి‌న 24 గంటల్లో న‌గ‌రంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. రోడ్ల మీదకు వరద నీరు లోతట్టు ప్రాంతాల్లో ఏరులుగా పారుతోంది.

భారీ వానల నేపధ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలెర్ట్ ని వాతావరణ జారీ చేసింది. దీంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ ప్రాంతాలలో పడతాయని అంటున్నారు. దీంతో విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాల‌యం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అదే విధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

మరో వైపు చూస్తే విజయనగరం జిల్లాలో భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉంది. విజయనగరం జిల్లాలో ఎడతెరిపి లేని వ‌ర్షం కురుస్తోంది. ఆదివారం ఉదయం నుంచి 11 గంటల వరకూ జిల్లావ్యాప్తంగా 21.7 మిల్లీమీట‌ర్ల‌ వర్షపాతం నమోదయింది. దీంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. మరో వైపు చూస్తే వాన నీరు లోతట్టు ప్రాంతాలలో ఇళ్లలోకి చేరడంతో పాటు చెరువులు ఏరులు ఉధృతంగా ప్రవహిస్తూ హడలెత్తిస్తున్నాయి.

తీవ్ర అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అంతటా గత రెండు రోజులుగా వర్షాలు నాన్ స్టాప్ గా కురుస్తున్నాయి. ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో ఉన్న నాగావళి, వంశధార, బహుదా, మహేంద్ర తనయ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి.ఎల్ఎన్ పేట, కొత్తూరు, పోలాకి, జలుమూరు, సరుబజ్జులి, హిరమండలం, గార, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల పరిధిలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయని అధికారులు తెలిపారు.

మన్యం జిల్లాలలో భారీ వానలు కురుస్తూండడంతో ప్రభుత్వ యంత్రాంగం అలెర్ట్ అవుతోంది. ఉత్తరాంధ్ర మీదనే తాజా భారీ వాయుగుండం ప్రభావం ఉంది. ఇది మరో రెండు రోజుల పాటు ఉంటుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు.

ఒక వైపు బెజవాడ వరద పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు, ఇంకో వైపు చూస్తే గోదావరి వరదలతో ఉభయ గోదావరి జిల్లాలలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇపుడు ఉత్తరాంధ్ర కూడా వణికిస్తోంది. ఈ మొత్తం పరిణామలు చూస్తే ఏపీలో ఉమ్మడి పదమూడు జిల్లాలలో పది జిల్లాల దాకా వరుణుడి పంజాకు చిక్కుకుని విలవిలలాడుతున్నాయని అంటున్నారు. వరసగా వాయుగుండాలు ఏర్పడడం అవి కూడా తీవ్ర రూపం దాల్చడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రాణాలు గుప్పిట పట్టుకుని ఉన్నారు. ఎపుడేమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది.

ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలలో నదులు ఏరులు పెద్ద ఎత్తున పారుతూండడంతో గండ్లు తెగి ఎక్కడ కొంప కొల్లేరు అవుతుందో అన్న అందోళన అంతటా ఉంది. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటున్నా ప్రజలు కూడా సహకరిస్తూ తగిన ఏర్పాట్లలో ఉండాలని అంటున్నారు. .